Share News

land problem ఫ్రీహోల్డ్‌పై ఏం తేల్చారో!

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:47 PM

What was decided on the freehold! జిల్లాలో అత్యధికంగా ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్‌ జరిగిన గ్రామంగా వేపాడ మండలం కొండగంగుపూడి(కేజీ పూడి) గుర్తింపు పొందింది. జిల్లా మొత్తంలో 191 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములకు రిజిస్ర్టేషన్లు జరగ్గా ఈ గ్రామానికి చెందిన భూములే 98.32 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారుల నివేదిక చెబుతోంది.

land problem ఫ్రీహోల్డ్‌పై ఏం తేల్చారో!
వేపాడ మండలం కొండగంగుపూడి గ్రామ అసైన్డ్‌ భూములు

ఫ్రీహోల్డ్‌పై ఏం తేల్చారో!

కేజీ పూడి అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌పై ఎన్నో అనుమానాలు

జిల్లాలో అత్యధిక భూములకు రిజిస్ట్రేషన్‌ జరిగిన గ్రామం ఇదే

అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ

తనిఖీకి వచ్చిన సీసీఎల్‌ఎ ప్రధాన కార్యదర్శి సిసోడియా

రేపటి రెవెన్యూ సదస్సులో నిజానిజాలు బయటపడే అవకాశం

- జిల్లాలో అత్యధికంగా ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్‌ జరిగిన గ్రామంగా వేపాడ మండలం కొండగంగుపూడి(కేజీ పూడి) గుర్తింపు పొందింది. జిల్లా మొత్తంలో 191 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములకు రిజిస్ర్టేషన్లు జరగ్గా ఈ గ్రామానికి చెందిన భూములే 98.32 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారుల నివేదిక చెబుతోంది. ఫ్రీహోల్డ్‌ ఆప్షన్‌ ఇచ్చిన వెంటనే ఒకేసారి ఇన్ని ఎకరాల భూములు చేతులు మారడాన్ని సీసీఎల్‌ఏ(భూ పరిపాలన శాఖ) అనుమానించింది. కూటమి ప్రభుత్వం లోతుగా పరిశీలించేందుకు నిర్ణయం తీసుకోవడంతో భూ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌.పీ సిసోడియా విచారించేందుకు వచ్చారు. ఆ గ్రామానికి చెందిన ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్టేషన్‌లు శృంగవరపుకోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరగడంతో ఆగస్టు 16న ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తప్పుజరిగినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారిని సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత రికార్డుల పునఃపరిశీలన, పలుమార్లు కలెక్టర్‌ కార్యాలయంలో వడపోత తంతు జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు ఏ తేల్చారో మాత్రం బయటపడలేదు. సోమవారం జరగనున్న గ్రామ రెవెన్యూ సదస్సులో వీటి గురించి అధికారులు వివరిస్తారని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

శృంగవరపుకోట, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి):

ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌మెంట్‌ భూముల చట్టం-1977 (పీవోటీ యాక్ట్‌)ను సవరిస్తూ పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల గడువు ఇరవై సంవత్సరాలు దాటితే వాటిపై యాజమాన్యపు హక్కులు (ఓనర్‌ఫిప్‌ రైట్స్‌) కల్పించాలని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి భూములన్నింటినీ నిషేధిత భూముల జాబితా 22(ఎ) నుంచి తొలగించింది. ఫ్రీహోల్డ్‌ చేసిన తరువాత రిజిస్ర్టేషన్‌ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు జీవో నెంబర్‌ 596 జారీ చేసింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కొందరు అధికారులతో కుమ్మకయ్యారు. పేదల పేరున వున్న అసైన్డ్‌ భూములపై కన్నేశారు. జీవోను అడ్డం పెట్టుకొని పేదల భూములను తమకు అనుకూలంగా మలుచుకున్నవారు కొందరైతే.. వాటితో వ్యాపారం చేశారు ఇంకొందరు. అధికారుల సహకారంతో డబ్బున్నవారు భూములను సొంతం చేసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4.17 లక్షల ఎకరాలను అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేయడంతో పాటు 25 వేల ఎకరాలను ఇతరులకు కట్టబెట్టినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది.

- వేపాడ మండలం కొండగంగుపూడి గ్రామంలో అత్యధికంగా అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌ చేసినట్లు అనుమానాలు వచ్చాయి. ఈగ్రామంలో ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 400 మంది వరకు అసైన్డ్‌ రైతులున్నారు. 566 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేదలే. పది సెంట్ల నుంచి ఎకరా, రెండు ఎకరాలున్న లబ్ధిదారులే ఎక్కువ. గత వైసీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ జీవో ఇవ్వడంతో ఇక్కడ 450.39 ఎకరాలను ఫ్రీహోల్డ్‌కు (22ఎ నుంచి తొలగించేందుకు నోటిఫై చేసిన విస్తీర్ణం) అర్హతగా గుర్తించారు. వీటిని పరిశీలించిన అధికారులు 384.63 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ చేసేందుకు గ్రామ రెవెన్యూ అధికారి, తహసీల్దార్‌ లాగిన్‌లకు పంపించారు. ఈ భూములను పరిశీలించిన అధికారులు ఫ్రీహోల్డ్‌ చేసేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని 224.95 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచారు. వీటిల్లో నుంచి 210.11 ఎకరాల అసైన్డ్‌ భూములను ఫ్రీహోల్డ్‌ చేసినట్లు, 98.32 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు రెవెన్యూ అధికారులు తయారు చేసిన నివేదిక చెబుతోంది. అయితే ఇంతకంటే ఎక్కువ భూమినే రెవెన్యూ అధికారులు ఫ్రీహోల్డ్‌ చేసినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. దాదాపు 155 మంది అసైన్డ్‌ రైతులకు చెందిన 336.66 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ జరిగినట్లు సమాచారం. ఫ్రీహోల్డ్‌ జరిగిన వెంటనే 99.93 ఎకరాలు చేతులు మారాయి. వివిధ పట్టణాల్లో నివశిస్తున్న 15 మంది బడాబాబులకు ప్రత్యేక ఖాతాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఒక్కొక్కరూ ఒక్కోలా రెండున్నర ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు కొనుగోలు చేశారు. రెవెన్యూ అధికారులు తయారు చేసిన నివేదికలో కనిపిస్తున్న అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌కు, రికార్డుల్లో వున్న ఫ్రీహోల్డ్‌ భూముల మధ్య తేడా ఉన్నట్లు తెలిసింది. ఇదే విధంగా రిజిస్ట్రేషన్‌ వివరాల్లోనూ 1.61 ఎకరాల వ్యత్యాసం కనిపిస్తోంది.

- నిబంధనల ప్రకారం ఆ భూములను ఫ్రీహోల్డ్‌ చేసే అవకాశం లేనప్పటికీ అసైన్డ్‌ లబ్ధిదారులను ముందుంచి పనికానిచ్చారు. ఇందులో కొన్నింటికి రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. మరికొన్ని రిజిస్ట్రేషన్‌లు చేసేలోపే కూటమి ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌లను నిలిపేసింది. రికార్డుల పునఃపరిశీలనకు పూనుకుంది. తహసీల్దార్‌ తప్ప మిగిలిన అధికారులంతా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారే ఇప్పటికి ఉన్నారు. అప్పట్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు చెప్పినట్లు తప్పులు చేసిన వారంతా తమను తాము కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. వాస్తవాలను దాస్తున్నారు. రికార్డుల పునఃపరిశీలకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎన్నిసార్లు అడిగినా తప్పులు బయటపడకుండా తయారు చేసిన నివేదికలనే చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రికార్డుల పునఃపరిశీలన పూర్తయినందున రెవెన్యూ సదస్సుల్లో ఈ ఫ్రీహోల్డ్‌కు సంబంధించిన వాస్తవ విషయాలను బహిరంగ పరుస్తారని అంతా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:47 PM