Share News

గ్రేడ్‌ -2 లైన్‌మన్లకు మంచి రోజులెప్పుడో?

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:47 PM

వారు క్షేత్రస్థాయిలో విద్యుత్‌ పరికరాల మరమ్మతులు చేపడుతుంటారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతుంటారు. నిరంతరం అందుబాటులో ఉంటారు. ఐదేళ్ల కిందట నియామకమైన వీరు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయారు. వారే ఎనర్జీ అసిస్టెంట్లుగా పిలిచే గ్రేడ్‌-2 లైన్‌మన్లు. పెరిగిన పని ఒత్తిడితో రెండు శాఖల మధ్య నలిగిపోతున్నామని వాపోతున్నారు.

      గ్రేడ్‌ -2 లైన్‌మన్లకు  మంచి రోజులెప్పుడో?

గ్రేడ్‌ -2 లైన్‌మన్లకు

మంచి రోజులెప్పుడో?

ఐదేళ్ల కిందట నియామకం

పెరిగిన పని ఒత్తిడి

సౌకర్యాలు అంతంతమాత్రం

రెండు శాఖల మధ్య నలిగిపోతున్నామని ఆవేదన

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

వారు క్షేత్రస్థాయిలో విద్యుత్‌ పరికరాల మరమ్మతులు చేపడుతుంటారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతుంటారు. నిరంతరం అందుబాటులో ఉంటారు. ఐదేళ్ల కిందట నియామకమైన వీరు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయారు. వారే ఎనర్జీ అసిస్టెంట్లుగా పిలిచే గ్రేడ్‌-2 లైన్‌మన్లు. పెరిగిన పని ఒత్తిడితో రెండు శాఖల మధ్య నలిగిపోతున్నామని వాపోతున్నారు.

రాజాం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):

2019 అక్టోబరు 2న వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో భాగంగా ఎనర్జీ అసిస్టెంట్లను నియమించింది. ఐటీఐ ఎలక్ర్టానిక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసింది. వీరు ఉద్యోగాల్లో చేరి ఐదేళ్లవుతున్నా మిగతా ఉద్యోగుల మాదిరిగా రాయితీలు, ఇతరత్రా సౌకర్యాలు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 777 పంచాయతీలు ఉన్నాయి. 530 సచివాలయాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో సచివాలయానికి ఒకరు చొప్పున ఎనర్జీ అసిస్టెంట్లు (గ్రేడ్‌ 2 లైన్‌మన్లు)ను నియమించారు. వీరి విషయంలో ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతోంది. వీరు సచివాలయం పరిధిలో పనిచే యాలా? లేకుంటే విద్యుత్‌ శాఖ పరిధిలోనా అన్నది స్పష్టత ఇవ్వలేదు. దీంతో రెండువైపులా నలిగిపోతున్నారు. అటు సచివాలయ ఉద్యోగులకు అందుతున్న ప్రయోజనాలు కాని.. ఇటు విద్యుత్‌ శాఖ ప్రయోజనాలు కాని పొందలేని దయనీయ స్థితిలో ఉన్నారు.

జిల్లాలో 530 సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్స్‌ (గ్రేడ్‌-2 లైన్‌మెన్లు) పనిచేస్తున్నారు. వీరంతా ఐటీఐ పూర్తిచేసిన వారే. జిల్లా సెలక్షన్స్‌ కమిటీల ద్వారా ఎంపికయ్యారు. శారీర దారుఢ్య పరీక్షలతో పాటు స్తంభం ఎక్కడం, సైకిల్‌ తొక్కడం వంటి వాటిలో నైపుణ్య పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు. వారం, పదిరోజుల పాటు శిక్షణను ఇచ్చి సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమించారు. వీరికి వృత్తిపరమైన శిక్షణ ఇవ్వలేదు. సాధారణంగా విద్యుత్‌ శాఖ అంటే ప్రమాదకరమైనది. కానీ వీరికి అత్తెసరు శిక్షణనిచ్చి విధుల్లో నియమించడంపై రకరకాల విమర్శలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం పెడచెవినపెట్టింది. అయితే వీరు సచివాలయం పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉన్నా.. విద్యుత్‌ శాఖ నియంత్రణలో పనిచేయాల్సి వస్తోంది. విద్యుత్‌ శాఖలో సిబ్బంది కొరత వీరిపై ప్రభావం చూపుతోంది. సచివాలయం దాటి పదుల సంఖ్యలో గ్రామాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోంది. కొన్నిమండలాల్లో లైన్‌మెన్లు లేకపోవడంతో అయినదానికి.. కానిదానికి వీరే స్పందించాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు ప్రమాదాల్లో బాధితులుగా మిగులుతున్నారు.

వారి డిమాండ్లు

సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ అయ్యింది. ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో ఎటూ తేల్చలేదు. అటు 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించడం లేదు. సచివాలయాల జాబ్‌ చార్డు కూడా అమలు చేయడం లేదు. సెలవులకు సంబంధించి సీఎల్‌, ఈఎల్‌, మెడికల్‌, ఇతరత్రా సెలవులేవీ వీరికి దక్కడం లేదు. ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌కార్డులు కూడా జారీ కావడం లేదు. మిగతా సచివాలయం ఉద్యోగుల మాదిరిగా వేతనాలతో పాటు గుర్తింపునివ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా కోరుతూ వస్తున్నారు. కానీ అరణ్యరోదనగా మిగిలింది. అయితే వీరితో పాటు పనిచేస్తున్న విద్యుత్‌ శాఖ అధికారుల జీతాలు లక్షల్లో ఉన్నాయి. వారితో సమానంగా పనిచేస్తున్న వీరికి జీతం పెరగడం లేదు. దీంతో అసంతృప్తితోనే విధులు నిర్వహిస్తున్నారు.

సమస్య ఉంటే మా దృష్టికి తెస్తారు

కుమార్‌, ఏఈ విద్యుత్‌ శాఖ

సచివాలయం పరిధిలో నియమించిన గ్రేడ్‌-2 లైన్‌మన్‌లు ఏదైనా మేజరు సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకు వస్తారు. వారు మాత్రం మా కంట్రోల్‌లో ఉండరు. సచివాలయం పరిధిలోనే ఉంటారు. బిల్లుల జారీలో సమస్యలున్నా.. కొత్తగా మీటర్లు కావాలన్నా... కొత్తగా విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలన్నా మా దృష్టికి తీసుకువస్తారు.

----------------------

Updated Date - Nov 17 , 2024 | 11:47 PM