Share News

ఐటీడీఏ వరకు ఎందుకు?

ABN , Publish Date - Oct 29 , 2024 | 12:31 AM

గ్రామస్థాయిలో చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ వరకు గిరిజనులు రావడంపై కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతం అయితే క్షమించేది లేదని హెచ్చరించారు.

 ఐటీడీఏ వరకు ఎందుకు?
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఇది పునరావృతమైతే క్షమించేది లేదు..

కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

సీతంపేట రూరల్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ వరకు గిరిజనులు రావడంపై కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతం అయితే క్షమించేది లేదని హెచ్చరించారు. గ్రామ సచివాలయ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. సోమవారం సీతంపేట ఐటీడీఏలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌కు ఎక్కువగా రహదారులు, రక్షణ గోడలు, అంగన్‌వాడీ భవనాలు, తాగునీటి సమస్యలపై వినతులు వస్తున్నాయని తెలిపారు. గ్రామసభ తీర్మానం మేరకు ఉపాధిహామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు రంగులు వేయించాలని, సూర్యఘర్‌ పథకంపై గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఏజెన్సీలో తాగునీటి అవసరాలను గుర్తించి, మండల స్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వేసవికాలంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూడాలన్నారు. జలజీవన్‌మిషన్‌ పనుల వివరాలు అందించాలని సూచించారు. రహదారుల పనులు క్వాలిటీ తనిఖీలు పూర్తయిన తర్వాత మాత్రమే బిల్లుల చెల్లించాలని తెలిపారు. ఎంపీసీసీ పనులు 14 మంజూరు కాగా ఇప్పటివరకు రెండు పనులు ప్రారంభం కాకపోవడంపై గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. భామిని ఏకలవ్య పాఠశాల భవనాలు త్వరగా పనూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ పి.రమాదేవి, డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజనీర్‌ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 12:31 AM