చేతుల పరిశు భ్రతపై విస్తృత ప్రచారం
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:48 PM
చేతుల పరిశుభ్రతకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం స్వచ్ఛ పార్వతీపురం, మరుగుదొడ్ల దినం తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్వతీపురం/టౌన్, నవంబరు20 (ఆంధ్రజ్యోతి) : చేతుల పరిశుభ్రతకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం స్వచ్ఛ పార్వతీపురం, మరుగుదొడ్ల దినం తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్‌వాడీలు, పాఠశాలలపై దృష్టి సారించి.. చిన్నారులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ, విద్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆదేశించారు. చేతుల శుభ్రతపై వల్ల 70 శాతం వరకు వ్యాధులు దూరమవుతాయని తెలిపారు. మరుగుదొడ్ల దినం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బహిరంగ మలవిసర్జనకు అడ్డుకట్ట వేయాలని, మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. స్వచ్ఛ సుందర పార్వతీపురానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. టెన్త్ ఉత్తీర్ణులైన యువతను ఎస్‌ఎస్‌పీ సమన్వయకర్తలుగా గ్రామాల్లో నియమించాలన్నారు. స్వచ్ఛ సుందర పార్వతీపురానికి సంబంధించి గ్రామ పంచాయితీ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను డిసెంబరు-1 లోగా తయారు చేయాలని ఆదేశించారు. డీపీవో కొండలరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి సదస్సుకు కలెక్టర్
పార్వతీపురం, నవంబరు20 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో గురువారం నిర్వహించనున్న జాతీయస్థాయి సదస్సుకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హాజరు కానున్నారు. నవజాతి శిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు తదితర అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. గతంలో జిల్లాలో ఏటా 300 వరకు శిశు మరణాలు నమోదయ్యేవి. అయితే ఇటీవల వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం వందలోపే మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఇందు కోసం జిల్లాలో తీసుకున్న చర్యలను కలెక్టర్ ఆ సదస్సులో తెలియజేయనున్నారు. కాగా జాతీయ సదస్సుకు బీహార్, పంజాబ్ కలెక్టర్లు హాజరవుతుండగా.. మూడో వారిగా రాష్ట్రం తరపున మన్యం జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి వినోద్‌కుమార్ పాల్గొనడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.