Share News

అక్రమాలు తేలకుండానే..

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:56 AM

సీతంపేట ఐటీడీఏ అధికారులు అనుకున్నారంటే చేసుకుపోతారంతే అనే మాట ఏజెన్సీలో వినిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించినా.. గిరిజన అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టినా పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి.

అక్రమాలు తేలకుండానే..

- పైనాపిల్‌ మొక్కల బిల్లులు చెల్లింపునకు రంగం సిద్ధం

- ఐటీడీఏ అధికారుల ఇష్టారాజ్యం

- రూ.12 లక్షల గిరిజన నిధులు పక్కదారి

- కాగితాలపైనే కమిటీ

సీతంపేటరూరల్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ అధికారులు అనుకున్నారంటే చేసుకుపోతారంతే అనే మాట ఏజెన్సీలో వినిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించినా.. గిరిజన అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టినా పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. గిరిజన అభివృద్ధికి సంబంధించి పథకాల టెండర్లలో కూడా ఐటీడీఏ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పైనాపిల్‌ మొక్కల పంపిణీ టెండర్లలో అవకతవకులు చోటుచేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. తక్కువకు టెండర్‌ పాడిన వారికి కాకుండా అధికారులే ఒక ధరను నిర్ణయించి టెండర్లు ఖరారు చేశారు. మొక్కల పంపిణీలో రూ.12లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్క తేలకుండానే సంబంధిత టెండర్‌దారులకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సీతంపేట ఐటీడీఏకు రెగ్యులర్‌ ప్రాజెక్ట్‌ అధికారి లేరు. ఇన్‌చార్జిలతోనే కాలం నెట్టుకొస్తున్నారు. దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవడంతో పాటు గిరిజన అభివృద్థి కుంటుపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

టెండర్లలో తికమకలు..

కేరళ రకానికి చెందిన మారిషయస్‌ పైనాపిల్‌ మొక్కల పంపిణీకి, గిరిజన గురుకుల పాఠశాలలకు కాయగూరల సరఫరాకు సంబంధించి సీతంపేట ఐటీడీఏ ద్వారా ఇటీవల టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్ల ప్రక్రియలో తికమకలు నెలకొన్నాయి. సీతంపేట, భామిని మండలాల్లోని 90 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా కేరళ మారిషయస్‌ పైనాపిల్‌ మొక్కలను నాటేందుకు అధికారులు సంకల్పించారు. ఎస్‌సీఏ టు టీఎస్‌పీ(స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెటిన్స్‌ ఫర్‌ ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ స్కీమ్స్‌) కింద గిరిజన రైతులకు రూ.1.38 లక్షల విలువైన 7.20 లక్షల మారిషయస్‌ పైనాపిల్‌ మొక్కల సరఫరా చేయాలని భావించారు. దీనికోసం ఈ ఏడాది ఆగస్టు 31న ఐటీడీఏ కేంద్రంగా అప్పటీ ఇన్‌చార్జి పీవో వీవీ రమణ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. 11 మంది టెండర్లదారులు పాల్గొనగా, వీరిలో తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన గ్లోబల్‌ నర్సరీ కంపెనీ అతి తక్కువ ధర రూ.15కు కోట్‌ చేసింది. ఈ కంపెనీకి కాదని, అధికారులే ఒక్కొక్క పైనాపిల్‌ మొక్క ధరను రూ.19గా నిర్ణయించారు. వీటిని సరఫరా చేసేందుకు 11 మంది టెండర్లదారులకు ఒక్కొక్కరికి 65,454 మొక్కల సరఫరాకు అనుమతులు ఇచ్చారు. ఒక్కో మొక్క ధరలో రూ.4 తేడా ఉన్నా ఐటీడీఏ అధికారులు ఎందుకు అలా చేశారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అలాగే, ఇటీవల గురుకుల పాఠశాలలకు ఒక రూపాయికే 13 రకాల కూరగాయలను సరఫరా చేస్తామని టెండర్‌దారులు బిడ్‌లు దాఖలు చేస్తే, ఐటీడీఏ అధికారులు నమ్మి టెండర్లు ఖరారు చేశారు. టెండర్లు దక్కించుకున్న వారు ఇప్పుడు కూరగాయలను సరఫరా చేయడం మానేశారు. ఈ విషయాన్ని గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్‌లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం.

మొక్కల పంపిణీలోనూ దుందుడుకే..

పైనాపిల్‌ మొక్కల టెండర్ల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఐటీడీఏ అధికారులు ఆదరాబాదరాగా మొదటి విడతగా వచ్చిన 60వేల మొక్కలను అప్పుడే కొత్తగా వచ్చిన ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా కీసరజోడు, దిబ్బగూడ గిరిజన రైతులకు పంపిణీ చేశారు. విషయం బయటపడడంతో దీనిపై విచారణ చేపట్టేందుకు ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఏర్పాటు చేసినప్పటికే 50 శాతానికి పైగా మొక్కలను అధికారులు పంపిణీ చేసేశారు. మొత్తంగా 7.20 లక్షల మొక్కలకు గాను 5.89లక్షల మొక్కలను గిరిజన రైతులకు పంపిణీ చేశారు.

నిబంధనలు తుంగలోకి

ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏ టెండర్లు నిర్వహించినా స్థానిక ఎస్టీ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. జీవో నెం.4 ప్రకారం ఐటీడీఏ టెండర్ల కమిటీలో స్థానిక శాసన సభ్యుడు నిమ్మక జయకృష్ణ మెంబర్‌గా ఉన్నందున ఆయనకు సమాచారం అందించాలి. అనంతరం ఐటీడీఏ పీవో అధ్యక్షతన టెండర్లు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈ నిబంధనలను ఐటీడీఏ అధికారులు తుంగలోకి తొక్కారు. పైనాపిల్‌ మొక్కల టెండర్ల ప్రక్రియలో ఎమ్మెల్యే జయష్ణకు కనీసం సమాచారం అందించలేదు. మొక్కలను కూడా వారే పంపిణీ చేశారు. పైనాపిల్‌ మొక్కల పంపిణీలో గిరిజన నిధులు సుమారు రూ.23 లక్షల వరకు పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఐటీడీఏ అధికారులు ఈ టెండర్లకు సంబంధించి రూ.కోటి వరకు బిడ్‌లు దాఖలు చేసిన వారికి బిల్లులు చెల్లించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఒక్కో పైనాపిల్‌ మొక్క ధరపై రూ.4 వరకు తేడా ఉండడంపై ఏమాత్రం పట్టించుకోకుండా, గతంలో అధికారులు నిర్ణయించిన ధర రూ.19 చొప్పున నిధులు చెల్లింపులకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లుగా తెలిసింది. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే జయకృష్ణ ప్రభుత్వానికి, విజిలెన్స్‌ అధికారులకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

ఏపీవో ఏమన్నారంటే..

మారిషయస్‌ పైనాపిల్‌ మొక్కల టెండర్ల అంశంపై వివరణ కోరేందుకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. అలాగే సంబంధిత పీహెచ్‌వోకు ఫోన్‌ చేయగా ఆయన కూడా స్పందించలేదు. దీంతో అందుబాటులో ఉన్న ఏపీవో జి.చిన్నబాబు ఈ విషయమై స్పందించారు. ‘పైనాపిల్‌ మొక్కలకు సంబంధించి టెండర్లు, నాణ్యతా వంటి అంశాలను పరిశీలించే అనుమతులు ఇచ్చాం. దీనిపై క్వాలిటీ కంట్రోల్‌ బృందాన్ని గతంలో ఏర్పాటు చేశాం. క్వాలిటీ ఇన్‌స్పెక్షన్‌ జరిగిన తరువాతే గిరిజన రైతులకు వాటిని పంపిణీ చేశాం’ అని తెలిపారు.

సీతంపేట రూరల్‌ 3:దిబ్బగూడలో గిరిజన రైతుల పొలాల్లో పెరుగుతున్న పైనాపిల్‌ మొక్కలు

Updated Date - Dec 06 , 2024 | 12:56 AM