గిరిజన కుటుంబాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:49 PM
గిరిజన ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రంలోని గిరిజన కుటుంబాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.
శృంగవరపుకోట రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గిరిజన ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రంలోని గిరిజన కుటుంబాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. పట్టణంలోని జీసీసీ భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు. వీటిని ఉపయోగంలోకి తీసుకువచ్చే విషయమై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం గిరిజనుల ఆభ్యున్నతిని పట్టించుకోలేదని ఆరోపించారు. వారిని పూర్తిగా అధో పాతాళానికి తొక్కేసిందన్నారు. గిరిజన సంస్ధకు చెందిన ఆస్తులు ప్రస్తుతం దెయ్యాల కొంపల్లా ఉన్నాయన్నారు. త్వరలోనే తమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యవేక్షణలో ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు. గిరిజన ఉత్పత్తులకు వినూత్న ప్రచారం ద్వారా ప్రపంచంలో వాటి విఖ్యాతి పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దాసరి లక్ష్మి, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.