Share News

విశాఖ వెళ్లాలంటే గుబులే

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:24 PM

రాజాం-విశాఖ ప్రధానమార్గంలోని చీపురుపల్లిలో రోడ్‌ కం రైల్‌ వంతెన (ఆర్‌వోబీ) నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభమైనా నేటికీ కొలిక్కి రాకపోవడంతో ప్రయాణికుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

విశాఖ వెళ్లాలంటే గుబులే
చీపురుపల్లిలో నిర్మాణం పూర్తికాని రోడ్‌ కం రైలు వంతెన

విశాఖ వెళ్లాలంటే గుబులే

రెండున్నరేళ్లు గడచినా పూర్తికాని చీపురుపల్లి ఆర్వోబీ నిర్మాణం

ప్రయాణికులకు సమయం, డబ్బు వృథా

రాజాం రూరల్‌, అక్టోబరు 7: రాజాం-విశాఖ ప్రధానమార్గంలోని చీపురుపల్లిలో రోడ్‌ కం రైల్‌ వంతెన (ఆర్‌వోబీ) నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభమైనా నేటికీ కొలిక్కి రాకపోవడంతో ప్రయాణికుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తొలిరోజుల్లో సరిపడినన్ని బస్సులు కేటాయించిన ఆర్టీసీ అధికారులు వాటి సంఖ్య గణనీయంగా తగ్గించడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్వోబీ పనులు ప్రారంభించిన తొలిరోజుల్లో ఉన్న టికెట్‌ ధరలు సైతం భారీగా పెరిగాయి. అదే సమయంలో అదనంగా ఎక్కువదూరం ప్రయాణించాల్సి రావడం, సకాలంలో బస్సులు లేకపోవడం వంటి కారణాలతో ప్రయాణికులు తీవ్ర నిరాశ పడుతున్నారు. ఆర్వోబీ నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా ఎన్నాళ్లు సమయం పడుతుందనేది స్పష్టత లేదు. పాత వంతెన బలహీనంగా ఉండడంతో వంతెనకు ఇరువైపులా రైల్వేశాఖ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ మార్గంలో రాజాం-విశాఖ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి.

దూరం.. భారం..

రాజాం నుంచి నేరుగా విశాఖ ప్రయాణించే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు రెండు మార్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పాలకొండ డిపో నుంచి రాజాం, చిలకపాలెం మీదుగా నాన్‌స్టాప్‌ సర్వీసులతో పాటు రాజాం, ఉత్తరావల్లి, గరివిడి మీదుగా విజయనగరం, విశాఖ, కాకినాడ, అమలాపురం, విజయవాడ ఇతరత్రా ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. చిలకపాలెం మీదుగా విశాఖకు వెళ్లే బస్సులు ఉపయోగకరంగా ఉన్నా ప్రయాణికులపై చార్జీభారంతో పాటు 40 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది.

- రెండున్నరేళ్ల క్రితం ఆర్వోబీ పనులు ప్రారంభమైన సమయంలో బస్సుల రాకపోకలకు సంబంధించిన షెడ్యూల్‌ను పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాజాం బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఆ బోర్డులో పొందుపరిచిన బస్సుల సంఖ్యలో నాలుగోవంతు బస్సులు కూడా ప్రస్తుతం రాజాం-విశాఖ మధ్య తిరుగాడడం లేదు.

త్వరితగతిన పూర్తి చేయాలి

లక్ష్మణరావు, పెరుమాళి

వ్యాపార అవసరాల కోసం వారంలో నాలుగుసార్లు విశాఖ వెళ్లి వస్తుంటాను. రెండున్నరేళ్లుగా విశాఖ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాను. గతంలో ఉత్తరావల్లి మీదుగా విశాఖ వెళ్లే బస్సులో పెరుమాళిలో బస్సెక్కి విశాఖ చేరేవాడిని. ప్రసుతం ఈ మార్గంలో సర్వీసులు లేకపోవడంతో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం వెళ్లి అక్కడి నుంచి చిలకపాలెం మీదుగా విశాఖ వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా సమయం, డబ్బు వృథా అవుతోంది.

Updated Date - Oct 07 , 2024 | 11:24 PM