Share News

CM Chandrababu: ప్రజా హితం కోసం యుద్ధం తప్పడం లేదు

ABN , Publish Date - Sep 11 , 2024 | 01:27 PM

గడిచిన ప్రభుత్వం చేసిన తప్పుల వలన బుడమేరు విజయవాడ అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ కట్టి 70 ఏళ్లు అయ్యిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ పై అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు.

CM Chandrababu: ప్రజా హితం కోసం యుద్ధం తప్పడం లేదు

ఏలూరు: గడిచిన ప్రభుత్వం చేసిన తప్పుల వలన బుడమేరు విజయవాడ అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ కట్టి 70 ఏళ్లు అయ్యిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ పై అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు. అయినా వాతావరణంలో మార్పుల వలన పెద్దఎత్తున నీరు వచ్చిందన్నారు. బుడమేరుకు గండ్లు పడినా గత ప్రభుత్వం పూడ్చలేదన్నారు. అప్పటి టీడీపీ పనులను సైతం రద్దు చేశారన్నారు. తరువాత వారు కూడా సొంతంగా పనులు చేయలేదన్నారు. ఆక్రమణలను రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.


అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు పేర్కొన్నారు. అందువల్లనే బుడమేరుకు వరద వచ్చినా తట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. బుడమేరు వరద అడ్డుకట్ట వేయడానికి ఒక యుద్ధమే చేశామన్నారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ మాట్లాడుతోందన్నారు. మూడు బోట్లను ఒకటిగా కట్టి కృష్ణానదిలో వదిలారన్నారు. ఎప్పుడు అవి వెళ్ళాయో తెలీదని వారంటున్నారన్నారు. బాబాయిని చంపేసి మాకు తెలీదన్న అన్న వారు.. బోట్లు ఎవరు వదిలారో తెలీదన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ రంగులు, నంబర్లు చూసి అవి ఎవరివో తెలుసుకున్నామన్నారు. ఆ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను గుద్దితే, లంక గ్రామాలు ఏమయ్యేవని ప్రశ్నించారు. వైసీపీ పేపరు పెట్టి విషం చిమ్ముతోందన్నారు.


ప్రజలు మమ్ములను గెలిపించారు కాబట్టి, వారిని నాశనం చెయ్యాలని చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటువంటి పార్టీ దేశంలో ఎక్కడా ఉండదన్నారు. నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందన్నారు. తాను రాజకీయాలను పక్కనపెడితే, వీరి తాట తీయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఒక రాజకీయ పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తే విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక నేరస్తుడితో రాజకీయం చేయక తప్పడం లేదన్నారు. ప్రజా హితం కోసం యుద్ధం తప్పడం లేదన్నారు. గత ప్రభుత్వంలో వరదలు వస్తే మిమ్మల్ని పరామర్శించారా? అని నిలదీశారు. చివరకు తన దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి బురదలోకి దిగాడన్నారు. వరదల వలన దెబ్భతిన్న వరి పంటకు హెక్టారుకు రూ.25వేలు ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. ఇలాంటి వ్యవస్థ తమకు వద్దని వైసీపీని ఓడించి, వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 01:27 PM