ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి యువకుడి వీరంగం
ABN , Publish Date - Nov 13 , 2024 | 01:15 AM
ముదినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి ఊటుకూరు గ్రామానికి చెందిన పోసిన సురేష్ అనే యువకుడు శరీరాన్ని బ్లేడుతో కోసుకుని వీరంగం సృష్టించాడు.
ముదినేపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ముదినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి ఊటుకూరు గ్రామానికి చెందిన పోసిన సురేష్ అనే యువకుడు శరీరాన్ని బ్లేడుతో కోసుకుని వీరంగం సృష్టించాడు. సెప్టెంబరు 7న ఆ గ్రామంలో హత్యకు గురైన బాలకోటయ్య కుమారుడైన సురేష్ తన తండ్రి చావుకు మీరే కారణమంటూ.. హత్యకు పాల్పడిన హంతకులకు కొమ్ము కాస్తున్నారంటూ చిందులు తొక్కాడు. వారం క్రితం ఊటుకూరు వచ్చి ఒక కానిస్టేబుల్ తనను తీవ్రంగా కొట్టాడని, ఇప్పుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నా తీసుకోకుండా ఏఎస్‌ఐ తనను కొట్టాడంటూ ఆ యువకుడు బ్లేడుతో తన శరీరాన్ని పలు చోట్ల కోసుకున్నాడు. రక్తం కారుతున్న శరీరంతో గంతులేస్తూ నన్ను చావమంటారా లేక న్యాయం చేస్తారా? అని కేకలు వేశాడు. పోలీసులు అతనిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు.