Share News

అప్పుడు కయ్యం.. ఇప్పుడు వియ్యం

ABN , Publish Date - Dec 18 , 2024 | 12:40 AM

ఏలూరు నియోజకవర్గంలో అనూహ్య మార్పు లు జరుగుతున్నాయి. టీడీపీలో చేరేందుకు చాలా కాలం నుంచే మాజీ మంత్రి, సీనియర్‌ నేత ఆళ్ల నాని ప్రయత్నించారు.

అప్పుడు కయ్యం.. ఇప్పుడు వియ్యం

నేడు ఆళ్ల నాని టీడీపీలో చేరిక

ఏలూరు రాజకీయాల్లో అతి పెద్ద మలుపు

సీనియర్‌గా నాని రాకతో మరింత బలం

తొలుత వ్యతిరేకించినా సర్దుకున్న కేడర్‌

సీఎం చంద్రబాబు సమక్షంలోనే అట్టహాసంగా చేరిక

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఏలూరు నియోజకవర్గంలో అనూహ్య మార్పు లు జరుగుతున్నాయి. టీడీపీలో చేరేందుకు చాలా కాలం నుంచే మాజీ మంత్రి, సీనియర్‌ నేత ఆళ్ల నాని ప్రయత్నించారు. టీడీపీలో కొందరు ఆయనకు ఊతమిచ్చారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నానిని పార్టీలోకి తీసుకోవాలన్న నిర్ణయం రెండు వారాల క్రితమే ఖరారైంది. అప్పటి నుంచి ఏలూరులో టీడీపీ శ్రేణులన్నీ తీవ్ర అసంతృప్తితో భగ్గుమన్నాయి. ఆయన రావడానికి వీల్లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా నిరసనల హోరెత్తించారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశంకు జరిగిన నష్టా న్ని ఉదహరించారు. ఆస్తులను కోల్పోయిన అనేక మంది నేతలు బహిరంగ వ్యాఖ్యలకు దిగారు. నానిని వద్దనుకుని చంటిని ఎమ్మెల్యేగా గెలుపొం దేలా ఏకపక్ష మద్దతు ఇవ్వగా ఇప్పుడు ఆయనను ఎందుకు పార్టీలోకి చేర్చుకోవాల్సి వచ్చిందన్న వాదనను టీడీపీ కేడర్‌ లేవనెత్తింది. ఈలోపు నాని రాకను అడ్డుకునేందుకు కేడర్‌ సమాయత్త మై.. టీడీపీలోకి వస్తే ఇక్కడి క్రమశిక్షణకు మీరు తట్టుకోగలరా అంటూ సోషల్‌ మీడియాలోనే ప్రశ్నల వర్షం కురిపించారు. నాని విషయంలో పార్టీ అధినాయకత్వం సానుకూలంగా ఉంది. ఆయనను తీసుకోవాలని సంకేతాలు అధినాయక త్వం కేడర్‌కు పంపింది. ఎన్నికలకు ముందుగానే నానితో వైసీపీలో ప్రయాణించిన సీనియర్‌ నేత ఎంఆర్‌డి బలరాం, అప్పట్లో ఈడా చైర్మన్‌గా ఉన్న మధ్యాహ్నపు ఈశ్వరి వైసీపీ నుంచి బయటపడి టీడీపీలో చేరడం ద్వారా నానికి షాక్‌ ఇచ్చారు. నాని కంటే ముందుగానే ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ పెదబాబు దంపతులు టీడీపీలో చేరారు. అప్పట్లో వీరి రాకను టీడీపీ నేతలు వ్యతిరేకించారు. వైసీపీలో ఉంటూ నానా యాగి చేసి ప్రజా వ్యతి రేకతను మూటకట్టుకున్న వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటా రంటూ ఎమ్మెల్యే చంటిపైనా ఒత్తిడి తెచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో కార్పొరేషన్‌ అభివృద్ధి జరగాలన్నా పార్టీ భేదం లేకుండా చూసేందుకు, వీరిని తీసుకోవాల్సి వస్తుందంటూ అప్పట్లో ఎమ్మెల్యే కేడర్‌ను శాంతపరిచారు. తదు పరి నానితో అత్యంత సన్నిహితంగా ఉండే వైసీపీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌, ఆయన కుమార్తె టీడీపీలో చేరారు. సమాంతరంగా నాని కోటరీలో కీలకంగా ఉండే మంచెం మైబాబు ఇదే బాటలో ప్రయాణించారు. అంటే ఒక్క ఏలూరు నియోజకవర్గంలోనే వైసీపీలో చాన్నాళ్ళపాటు చక్రం తిప్పిన నేత లంతా టీడీపీలో చేరారు. ఇప్పుడు నాని టీడీపీలో చేరుతుండడంతో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి.

నాని, చంటి సర్దుకుంటారా ?

వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నాని కరోనా తరువాత టీడీపీ నేతలపై ఒకింత పట్టు బిగించారు. తమను కాదని టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కంప్యూటర్‌ ప్రసాద్‌ తోపాటు అనేకమంది నేతలు, కార్యకర్తలపై కేసులు బనా యించడానికి ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తల నిర్మాణాలు ఆక్రమణల్లో ఉన్నాయంటూ వాటిని కూల్చే ప్రయత్నం చేసినట్లు టీడీపీ కేడర్‌ వాదన. అటు వైసీపీలో ఉండగా స్వపక్షంలో సీనియర్లంతా టీడీపీ వైపు రాగా ఇప్పుడు నాని కూడా అదే రూటులో ప్రయాణించడం, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చంటి ఒకే నియోజకవర్గంలో సర్దుకుపోగలుగు తారా అనే సందేహాలు కేడర్‌లో ఉన్నాయి. వీటన్నిటి మధ్య పార్టీలో చేరబోతున్న సీనియర్‌ నేత నాని, ఎమ్మెల్యే చంటి మధ్య మంగళవారం స్నేహపూరితంగా సంభాషణ సాగినట్టు సమాచారం.

పార్టీ నిర్ణయం శిరోధార్యం

సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీలో చేరుతున్నారని, అధినాయకత్వం నిర్ణయమే మా అందరి నిర్ణయం కూడా అని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నాని రాకను వ్యతిరేకిస్తూ కేడర్‌ కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమేనని, అయినప్పటికీ పార్టీ నిర్ణయానికే తామూ, కేడర్‌ కట్టుబడి ఉంటామని మీడియాకు తెలిపారు. ఈ విషయంలో అపోహలు, వివాదాలకు తావేలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన తామంతా క్రమశిక్షణగల సైనికులుగానే వ్యవహరిస్తామని చంటి ప్రకటించారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినాయకత్వం కూడా నాని చేరికను ఖరారు చేసిన వైనాన్ని ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకొచ్చింది. రాజకీయంగా అంతా ఆలోచించే పార్టీ నిర్ణయాలు ఉంటాయనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆళ్ల నాని చేరిక సందర్భంగా మీరు కూడా హాజరుకావాలని ఎమ్మెల్యే చంటికి అధినాయకత్వం ఆహ్వానించింది. ఎలాంటి బేషిజం లేకుండా తాను కూడా హాజరవుతున్నట్టు చంటి బదులిచ్చారు.

Updated Date - Dec 18 , 2024 | 12:40 AM