Share News

అన్నక్యాంటీన్‌ ప్రారంభంలో రచ్చ

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:31 AM

పట్టణంలోని స్టీమర్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలు, ఫొటోలు పెట్టకపోవడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి గురువారం రాత్రి ధర్నాకు దిగారు.

అన్నక్యాంటీన్‌ ప్రారంభంలో రచ్చ

టీడీపీ నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు పెట్టకపోవడంపై ఆగ్రహం

క్యాంటీన్‌ గేటు మూసివేసి ధర్నా

నరసాపురంలో రెండు గంటలు హైటెన్షన్‌

నరసాపురం టౌన్‌, సెప్టెంబరు 19: పట్టణంలోని స్టీమర్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలు, ఫొటోలు పెట్టకపోవడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి గురువారం రాత్రి ధర్నాకు దిగారు. పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. క్యాంటీన్‌ ప్రారంభోత్సవ ప్రొటోకాల్‌ అంతా పురపాలకం సంఘం పర్యవేక్షణలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌ ఫొటోలతో పాటు ఎమ్మెల్యే నాయకర్‌, మాజీ శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌, చైర్‌పర్సన్‌ వెంకటరమణ, వీసీలు, కౌన్సిలర్లు మల్లాడి బుజ్జి, బొంతు రాజశేఖర్‌ ఫ్లెక్సీలు క్యాంటీన్‌ ముందు కట్టారు. అయితే ప్రారంభోత్సవ సమయానికి విచ్చేసిన టీడీపీ నాయకులు తమ నేతలైన పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడుల ఫొటోలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహ కులతో వాగ్వాదానికి దిగారు. అన్న క్యాంటీన్‌ ముందు బైఠాయించి కమిషనర్‌ అంజయ్య రావాలంటూ నినా దాలు చేశారు. ఆయన రాకపోవడంతో వైసీపీ నేతల ఫ్లెక్సీలు తొలగించారు. ప్రొటోకాల్‌ పాటించిన తరువాత క్యాంటీన్‌ను ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించారు. ఈనేపథ్యంలో కమిషనర్‌ అంజయ్య టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే నాయకర్‌, షరీఫ్‌ను, రామరాజును కలిసి చర్చించారు. జరిగిన లోపాన్ని వివరించారు. దీంతో నేతలు సమస్యకు చెక్‌ పెట్టాలని నిర్ణయించారు. ఆఘమేఘాలపై పొత్తూరి, కొవ్వలి ఫ్లెక్సీలు వేయించి క్యాంటీన్‌ వద్ద ఏర్పాటు చేశారు. దీంతో కేడర్‌ శాంతించారు. ఆ తరువాత ఎమ్మెల్యే నాయకర్‌, షరీఫ్‌, పొత్తూరి రామరాజులు క్యాంటీన్‌ను ప్రారంభించారు.

Updated Date - Sep 20 , 2024 | 12:31 AM