తప్పుల తిప్పలు
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:13 AM
విద్యార్థుల పుట్టినరోజు, విద్యార్హత సర్టిఫికెట్లలో తప్పులు.. అపార్ నమోదుకు ఆటంకాలుగా మారా యి. అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి.
అపార్ నమోదులో విద్యార్థుల తల్లిదండ్రుల అవస్థలు
సర్టిఫికెట్లలో తప్పులు సరిచేయించేలా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
గెజిటెడ్ సంతకాలకు పడిగాపులు
ఇప్పటికి 70 శాతం పూర్తి.. 30 శాతం పెండింగ్.. నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారుల ఒత్తిడి
భీమవరం ఎడ్యుకేషన్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల పుట్టినరోజు, విద్యార్హత సర్టిఫికెట్లలో తప్పులు.. అపార్ నమోదుకు ఆటంకాలుగా మారా యి. అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో 1,385 ప్రభుత్వ పాఠశాలల్లో లక్షా నాలుగు వేల మంది, ప్రైవేటు పాఠశాలల్లో లక్షా 35 వేల మంది మొత్తం రెండు లక్షల 39 వేల మంది విద్యార్థులు అపార్ నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు 70 శాతం విద్యార్థుల వివరాలు యాప్‌లో నమోదు చేయగా ఇంకా 30 శాతం అప్‌లోడ్ చేయాల్సి వుంది. వీటిలో చాలావరకు నమోదు కాకపోవడానికి ప్రధాన కారణం.. విద్యార్థుల వివరాలు తప్పులు తడకగా ఉండడమే. ఆధార్ కార్డు, పుట్టిన రోజు, విద్యార్హత ధ్రువపత్రాలు, స్కూల్ రికార్డులలో విద్యార్థుల వివరా ల్లో ఏదో ఒక తప్పు ఉంది. యాప్‌లో ఇచ్చిన ఫార్మెట్ ప్రకారం విద్యార్థి వివరాలు అన్ని పత్రాల్లో ఒకేలా ఉండాలి. వీటిలో ఏ చిన్న అక్షరదోషం వున్నా యాప్ తీసుకోవడం లేదు. అక్షరాల మధ్య గ్యాప్ ఉన్నా, క్యాపిటల్ బదులు స్మాల్ లెటర్ ఉన్నా నమోదు కావడం లేదు. విద్యార్థుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌లలో తప్పులు పెద్ద సమస్యగా మారింది. దీంతో అపార్ నమోదు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సేవ, సచివాలయాలు, మున్సిపాలిటీల్లోని పుట్టిన తేదీ నమోదు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పుట్టిన తేదీ వివ రాలు సక్రమంగా ఉండాలంటే విద్యార్థి పుట్టిన ఊరు, ఆసుపత్రులలో ఆ సమయంలోని వివరాలు తీయించుకుని సచివాలయాల ద్వారా మార్పించుకోవాలి. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల ఆధార్ కార్డు, విద్యార్థి స్టడీ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్‌లతోపాటు ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలు తీసుకోవాలి. ఒకే సారి విద్యార్థుల తల్లిదండ్రులు మీ సేవ కేంద్రాలు, సచివాలయాలకు వెళ్ళడంతో గంటల సమయం కేటాయించాల్సి వస్తోంది. గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాల కోసం, ప్రభుత్వ కార్యాలయాలలో అధికారుల కోసం వేచి చూస్తున్నారు. ఆధార్ కార్డులో తప్పులున్నా దాని నమోదుకు ఇదే తరహాలో తిరగాల్సి వస్తోంది. కొన్ని చోట్ల నోటరీ చేయించాలంటూ వందల్లో వసూళ్లకు పాల్పడడంతో తల్లిదండ్రులు విసిగిపోతున్నారు.
కాస్త సమయం ఇవ్వాలి
విద్యార్థులకు అపార్ ఐడీ కార్డులు ఇవ్వడం మంచిదే. అయితే వారి వివరాల్లో చిన్నపాటి అక్షర దోషాలు ఉంటున్నాయి. వీటిని సరిచేయించడానికి రోజుల సమయం పడుతోంది. పలుచోట్లకు తిరగాల్సి వస్తోంది. ఈలోగా సమయం లేదు.. త్వరగా ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నారు. కంగారు పెట్టకుండా కాస్త సమయం ఇవ్వాలి.
– నాగబాబు, విద్యార్థి తండ్రి, భీమవరం