ఏపీ నిట్‌లో సీట్ల పెంపు లేనట్టేనా..?
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:13 AM
తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో వచ్చే విద్యా సంవత్సరంలోనూ సీట్లు పెరిగే అవకాశం లేదు. ఫ్యాకల్టీ నియామకంలో జాప్యం జరుగుతోంది.
ఫ్యాకల్టీ నియామకంలో జాప్యం..
ఇన్‌చార్జిలతోనే పాలన
భీమవరం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో వచ్చే విద్యా సంవత్సరంలోనూ సీట్లు పెరిగే అవకాశం లేదు. ఫ్యాకల్టీ నియామకంలో జాప్యం జరుగుతోంది. ఆ ప్రభావం సీట్లపై పడనుంది. మూడేళ్ల క్రితం ఏపీ నిట్‌లో 750 మంది విద్యార్థులకు అడ్మిష న్‌లు కల్పించారు. ఫ్యాకల్టీ కొరతతో తర్వాత ఏడాది సీట్ల సంఖ్యను కుదించేశారు. వాస్తవా నికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిట్ ప్రారంభమైనప్పుడే 480 సీట్లు కేటాయిం చారు. రాష్ట్ర విభజనలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో కేంద్రంతో సంప్రదించి సీట్లు పెంచేలా అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం కృషి చేసింది. కొత్తగా నిట్ ఏర్పాటైతే 120 సీట్లు మాత్రమే కేటాయిస్తారు. అటువంటిది 2015లో ఏపీ నిట్ ప్రారంభమై నప్పుడు 480 సీట్లకు అడ్మిషన్‌లు కల్పించారు. మరో 60 సీట్లకు ప్రత్యేకంగా రాష్ట్ర విద్యార్థుల కోసం వరంగల్ నిట్‌లో అడ్మిషన్‌లు ఇస్తూ వచ్చారు. తదుపరి ఆ సీట్లను కూడా ఏపీ నిట్ లో విలీనం చేశారు. ఇతర రాష్ట్ర విద్యార్థులకు మరో 50 శాతం సీట్లను కలుపుకుని మొత్తం పైన నిట్‌కు 600 సీట్లు కేటాయించడంలో గత తెలుగుదేశం ప్రభుత్వం విజయవంతమైంది. నిట్‌కు శాశ్వత క్యాంపస్‌ను పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకపడిన విద్యార్థులకు పది శాతం సీట్లు కేటాయించ డంతో నిట్‌లో సీట్ల సంఖ్య 750కి చేరింది. ఒక్క ఏడాది మాత్రమే ఆ మేరకు అడ్మిషన్‌లు కల్పించారు. తర్వాత ఫ్యాకల్టీ కొరత ఉందంటూ కుదించడంతో రెండేళ్ల నుంచి 480 మందికి అవకాశం ఇస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అయినా సీట్ల సంఖ్య మళ్లీ 750కి చేరుతుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 125 మంది ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలిచ్చింది. నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దాదాపు 3,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి అర్హు లను గుర్తించి, ఇంటర్వ్యూలు నిర్వహించాలి. అందుకోసం కమిటీలను ఏర్పాటు చేయాలి. అటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. అదేవిధంగా 145 బోధనేతర సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు దానికి నోటిఫికేషన్ విడుదల చేయలేదు.
ఇన్‌చార్జి డైరెక్టర్లతో ఇబ్బందులు
ప్రస్తుతం ఏపీ నిట్‌లో ఇన్‌చార్జి డైరెక్టర్ ఉన్నారు. బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్‌ను కూడా నియమించలేదు. రెగ్యులర్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాశరావును తొలగించిన తర్వాత ముగ్గురు ఇన్‌చార్జిలు మారారు. తొలుత నాగ పూర్ నిట్ డైరెక్టర్ డాక్టర్ పడేలా ఏడాదిపాటు ఇన్‌చార్జిగా కొనసాగారు. ఆ తర్వాత హైదరా బాద్ ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ మూర్తి తొమ్మిది నెలలపాటు నిట్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆయన హయాంలో ఫ్యాకల్టీ నియామకానికి పోస్ట్‌లు మంజూరు చేయించారు. అదనంగా మరో రూ.430 కోట్లు అవసరం అంటూ కేంద్రా నికి ప్రతిపాదనలు పంపారు. అంతలోనే రా యపూర్ నిట్ డైరెక్టర్ ఎన్‌వీ రమణారావును ఇన్‌చార్జిగా నియమించారు. ఇలా మార్పులతోనే కాలం గడుస్తోంది. రెగ్యులర్ డైరెక్టర్ కోసం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసినా సరే భర్తీ కావడంలేదు. రిజిస్ర్టార్‌తోపాటు, ఇతర అధికారు లు ఇన్‌చార్జిలుగానే కొనసాగుతున్నారు. ఈ ప్రభావం నిట్ అభివృద్ధిపై పడుతోంది. సీట్ల సంఖ్య తగ్గిపోయింది. ఇదే పరిస్థితి ఉంటే వచ్చే ఏడాది అడ్మిషన్‌లలోనూ 480 సీట్లకే ఏపీ నిట్ పరిమితం కానుంది.