శ్రీవారి క్షేత్రంలో సహస్ర దీపాలంకరణ సేవ
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:50 AM
చిన్న తిరుమలేశుని క్షేత్రంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ శనివారం రాత్రి ప్రారంభమైంది.
ప్రతి శనివారం ఆర్జిత సేవ
16 నుంచి భక్తులకు అందుబాటులో..
ద్వారకాతిరుమల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): చిన్న తిరుమలేశుని క్షేత్రంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ శనివారం రాత్రి ప్రారంభమైంది. ముందుగా శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీనివాసుడు తిరుచ్చి వాహనంపై ఆలయ నిత్య కల్యాణ మండపం వద్ద సహస్ర దీపాలంకరణ మండపానికి మంగళ వాయిద్యా ల తరలివచ్చారు. మండపాన్ని, సేవను దాత పీపీ.రాజు, చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మండ పంలో 1008 నేతి వత్తులను వెలిగించారు. నేతి దీపాల నడుమ శ్రీవారు కొలువైన తిరుచ్చిని గొలుసులతో వేలాడతీసి అర్చకుల వేదమంత్రోచ్ఛరణ, ప్రముఖ గాయని శోభారాజ్ ఆలపించిన అన్నమయ్య కీర్తనలతో ఊయలను ఊపారు. తర్వాత నివేదన జరిపి స్వామి, అమ్మవార్లకు కర్పూర హారతిని సమర్పించారు. ఆలయ చైర్మన్ రాజా ఎస్‌వి సుధాకరరావు, ట్రస్టీ ఎస్వీ నివృతరావు, ఈవో ఎన్వీ సత్యనా రాయణమూర్తి, మండప దాత పీపీ.రాజు తదితరులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అన్నమయ్య భావనా వాహిని వ్యవస్థాపకు రాలు, పద్మశ్రీ శోభారాజ్ తన గానంతో శ్రోతలను మైమర పింపజేసారు. మండప నిర్మాత పీపీ రాజును ఆలయ చైర్మన్ ఘనంగా సత్కరించారు.
సహస్ర దీపాలంకరణ సేవను ఈనెల 16 నుంచి భక్తులకు ఆర్జిత సేవగా అందుబాటులో ఉంటుందని చైర్మన్ సుధాకరరావు తెలిపారు. ప్రతీ శనివారం జరిగే ఈసేవ నిమిత్తం భక్తులు రూ.500 చెల్లించాలన్నారు. శాశ్వత విరాళంగా రూ.5000 చెల్లిస్తే పదేళ్లపాటు ఏడాదికో శనివా రం దాతలు పాల్గొనవచ్చని తెలిపారు. ఈసేవలో పాల్గొనే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు శేషవస్త్రం, కండువా, రవిక, పటికబెల్లం, పసుపు, కుంకుమ అందజేస్తామని భక్తులు గమనించాలని కోరారు.