Share News

పెద్దకష్టమే..!

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:53 AM

చెరువుల కట్టలు, కాల్వ కట్టల నిర్వహణలో గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యవైఖరితో పాటు మెట్ట ప్రాంతమే కదా అంత వరదలు వస్తాయేంటి అన్న భావనతో చెరువు కట్టలు, ఎన్‌ఎస్‌పీ కాల్వ కట్టలు దెబ్బతినకుండా చర్యలు చేపట్ట డంలో ఇరిగేషన్‌, ఎన్‌ఎస్‌పీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యవైఖరి వెరసి నూజి వీడు పట్టణ ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది.

పెద్దకష్టమే..!
పెద్దచెరువుకు పడిన గండి

ముందు జాగ్రత్త చర్యల్లో అధికారులు విఫలం

గత ప్రభుత్వ నిర్వహణ లోపం..

గండి పూడ్చివేతలోనూ అధికారుల నాన్చుడు ధోరణి

మరోసారి వరదలు సంభవిస్తే నూజివీడుకు తీవ్ర నష్టం

నూజివీడు టౌన్‌, సెప్టెంబరు 15 : చెరువుల కట్టలు, కాల్వ కట్టల నిర్వహణలో గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యవైఖరితో పాటు మెట్ట ప్రాంతమే కదా అంత వరదలు వస్తాయేంటి అన్న భావనతో చెరువు కట్టలు, ఎన్‌ఎస్‌పీ కాల్వ కట్టలు దెబ్బతినకుండా చర్యలు చేపట్ట డంలో ఇరిగేషన్‌, ఎన్‌ఎస్‌పీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యవైఖరి వెరసి నూజి వీడు పట్టణ ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. ఫలితంగా నూజివీడులోని వెలమపేట, గాంధీనగర్‌ ప్రాంతాలు నీటమునిగాయి. సుమారు 200 ఎకరాల్లో పంట నీటమునగడంతో పాటు ఇసుక, కంకర మేటవేసి తిరిగి వ్యవసాయానికి పనికి రాకుండా భూములు మారాయి. నూజివీడు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు గండ్లు పూడ్చడానికి చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలు జారీ చేయగా, వాటిని పాటించకుండా అధికారుల నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తు న్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోసారి భారీ వర్షాలు పడి వరదలు సంభవిస్తే నూజివీడు మరింతగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

నిర్వహణ లోపంతో రెండు విధాలా నష్టం..

గత వైసీపీ ప్రభుత్వం చెరువులు, కాల్వల నిర్వహణను గాలికి వదిలివేయడంతో నూజివీడు పెద్దచెరువు రెండు రకాలుగా నష్టపోయిం ది. దాదాపు 208 ఎకరాల విస్తీర్ణం గల చెరువు, మరో 200 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. అల్పపీడన ప్రభావంతో కుంభవృష్టి పడడం, ఎగువ ప్రాంతాల్లోని బత్తులవారిగూడెం, సుంకొల్లు గ్రామాల్లోని చెరువులు తెగడంతో పాటు యనమదల వద్ద ఎన్‌ఎస్‌పీ కాల్వ యూటీ కూలి పోవడంతో ఆ నీరు అంతా వాగుల ద్వారా ఒక్కసారి పెద్దచెరువుపై పడింది. దీంతో బలహీనంగా ఉన్న చెరువుకట్టకు మూడుచోట్ల గండి పడింది. మరోవైపు వేసవిలో పెద్దచెరువుకు నీటిని సరఫరా చేసే ఎన్‌ఎస్‌ పీ కాల్వకు యనమదల లిఫ్ట్‌ పంపుల వద్ద యూటీ కుప్పకూలడంతో పెద్దచెరువుకు భవిష్యత్‌లో నీటి సరఫరాకు అవాంతరం ఏర్పడింది. ఇరిగేషన్‌, ఎన్‌ఎస్‌పీ అధికారుల నిర్లక్ష్యవైఖరి, నూజివీడు వాసులను, నూజివీడు పెద్దచెరువును రెండురకాలుగా నష్టపరిచినట్టు అయింది.

ముందు జాగ్రత్త చర్యల్లో వైఫల్యం

చెరువు కట్టలు బలహీనంగా ఉన్నచోట కట్టలను బలపర్చడంలో ఇరిగేషన్‌ అధికారులు తీవ్రంగా వైఫల్యం చెందారు. వాతావరణశాఖ రెడ్‌అలర్ట్‌ ఇచ్చిన నేపఽథ్యంలో చెరువుకట్టలు బలహీనంగా ఉన్నచోట ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి చర్యలను తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ చెరువుకు గండిపడగా, గతంలో ఎక్కడా గండిపడిందో తిరిగి అక్కడే గండిపడడంపై ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి భవిష్యత్‌లో తిరిగి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గండిపూడ్చివేత ఎప్పుడు?

నూజివీడు డివిజన్‌లో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు తదితరాల మరమ్మతులకు రూ.10కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని, దాదాపు రూ.25 లక్షలతో పెద్దచెరువు గండి పూడ్చివేతకు చర్యలు చేపడుతున్నామని డివిజన్‌ స్థాయి అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రి పార్థసారథి యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించినా ఇప్పటికి అధికారులు గండిపూడ్చివేత చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కష్టాన్ని తీర్చేదెలా..

భారీ వర్షాలకు పెద్దచెరువుకు గండిపడి వరదనీరు ఒక్కసారిగా పొలాలపై పడటంతో పంట పొలాలు కొన్నిచోట్ల భారీకోతకు గుర య్యాయి. మరికొన్నిచోట్ల ఇసుక, మట్టి, కంకర మేటలు వేయడంతో ఆ మేటలను తొలగించడం రైతులకు మరింత భారంగా మారింది. మరో వైపు చెరువు పూర్తిగా ఖాళీ అవ్వగా వరదతో పంటనష్టపోయిన రైతులకు భవిష్యత్‌లో నీటి లభ్యత కష్టమే. మరో ఏడాది పాటు పంటలు పండించే పరిస్థితి ఇక్కడ కానరావడం లేదు.

Updated Date - Sep 16 , 2024 | 12:53 AM