Share News

బస్సులన్నీ సీఎం సభకే..

ABN , Publish Date - Jan 19 , 2024 | 11:49 PM

విజయవాడలో శుక్రవారం అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణతోపాటు, అనంతరం సీఎం భారీ సభ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి పశ్చిమ జిల్లాలో అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులను సభకు తరలించడంతో శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బస్సులన్నీ సీఎం సభకే..
ఏలూరు కొత్త బస్టాండ్‌ వద్ద బస్సు రాగానే ఎక్కేందుకు వెళుతున్న ప్రయాణికులు

విజయవాడకు తరలివెళ్లిన ఆర్టీసీ బస్సులు

అన్ని రూట్లలో కిక్కిరిసిన ప్రయాణాలు

పండగ సమయాల్లో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

విజయవాడలో శుక్రవారం అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణతోపాటు, అనంతరం సీఎం భారీ సభ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి పశ్చిమ జిల్లాలో అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులను సభకు తరలించడంతో శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ డిపోనుంచి ఎన్ని బస్సులు సీఎం సభకు తీసుకువెళ్లాలో ముందుగానే నిర్ణయిం చుకున్నారు. ఈ మేరకు ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోలనుంచి 100 బస్సులను, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 107 ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించారు. మిగిలిన బస్సులను రద్దీ రూట్లలో నడిపి కొంతలో కొంతైనా సర్వీస్‌ ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ బస్సులు చాలకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సివచ్చింది. చాలామంది ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.

– ఏలూరు రూరల్‌/జంగారెడ్డిగూడెం/ భీమవరంటౌన్‌

విజయవాడలో సీఎం సభకు కార్యకర్తలను తరలించేందుకు ఆర్టీసీతో పాటు ప్రైవేట్‌ కళాశాల బస్సులను వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. జనసమీకరణకు ఏలూరు జిల్లాలోని మూడు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు కేటాయించారు. దీంతో సరిపడా బస్సులు లేక ఉన్నబస్సుల్లో తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. తక్కువగా ఉండే రూట్లలో సర్వీసులను తగ్గించారు. ఆయా రూట్లలో ప్రయాణికులు ఏలూరు బస్టాండ్‌లో గంటలకొద్దీ ఎదురుచూడాల్సి వచ్చింది. ఏలూరు బస్టాండ్‌ నుంచి దాదాపు 50 వేల నుంచి 60వేల మంది ప్రయాణికులు పలు రూట్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికుల అవసరాలను పూర్తిగా తీర్చలేకే ఆర్టీసీ అద్దెబస్సులు నడుపు తోంది. గమ్యస్థానాలకు చేరుకునేందుకు వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొత్త బస్టాండ్‌లో రద్దీగా ఉండడంతో బస్సులకోసం ఎగబడాల్సి వచ్చింది. చాలాసేపు వేచిఉన్న బస్సుల్లో సీట్లు దొరక్కపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. ప్రైవేట్‌ వాహనాలు అదనంగా చార్జీలు పెంచి వసూలు చేశారు. ఇప్పటికే సంక్రాంతి ప్రత్యేక బస్సులు మాటచెప్పి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ఆర్టీసీకి అదనపు ఆదాయం చేకూరలేదు.

సగం బస్సులు విజయవాడకే..

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుంచి సగం బస్సులను విజయవాడ సీఎం సభకే కేటాయించారు. మిగిలిన వాటితో కొన్ని సర్వీసులను కుదించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగు సమయం కావడంతో సొంత గ్రామాలకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజులుగా ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో మొత్తం 68 బస్సులు ఉన్నాయి. కాగా చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి శుక్రవారం ఉదయం జనాన్ని తరలించడానికి 33 బస్సులను కేటాయించారు. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంకు పన్నెండు బస్సులు చింతలపూడి మండలానికి ఏడు బస్సులు, కామవరపుకోట మండలానికి 7 బస్సులు, లింగపాలెం మండలానికి 7 బస్సులు మాత్రమే కేటాయించారు.

భీమవరం బస్‌కాంప్లెక్స్‌ కిటకిట

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 107 ఆర్టీసీ బస్సుల్లో సీఎం సభకు జనాన్ని తరలించడానికి ఉపయోగిం చడంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం అందక ప్రయాణికులు ఇబ్బందులు గురాయ్యరు. ఉదయం నుంచి బస్సులు లేకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను, ఆటోలను పట్టుకుని ప్రయాణాలు కొనసాగించారు. కాంప్లెక్స్‌కు బస్సు వచ్చిందంటే చాలు ప్రయాణికులు ఎక్కేందుకు ఆపసోపాలు పడ్డారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు కూడా తగ్గాయని ప్రయాణికులు వాపోయారు. అధికారులు ముందస్తు సమాచారం అందించకపోవడంతో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. జిల్లాలోని భీమవరం డిపో నుంచి 32 బస్సులు, తాడేపల్లిగూడెం డిపో నుంచి 22 బస్సులు, తణుకు డిపోనుంచి 31 బస్సులు, నరసాపురం డిపో నుంచి 22 బస్సులను విజయవాడకు పంపించారు.

Updated Date - Jan 19 , 2024 | 11:49 PM