కనబడని కెమెరా కన్ను
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:23 AM
కనబడని నాలుగో సింహం పోలీస్ అయితే.. ఆ సింహానికి మరో కన్ను సీసీ కెమెరా.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో నేరస్థుల కదలికలు పసిగట్టి నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరా సమర్ధవంతమైన సాధనం.
నగరం, పట్టణాల్లో పనిచేయని సీసీ కెమెరాలు
ఏలూరులో కొంతవరకు మెరుగు
భీమవరంలో సగంపైగా రిపేర్
రెచ్చిపోతున్న నేరస్థులు
కనబడని నాలుగో సింహం పోలీస్ అయితే.. ఆ సింహానికి మరో కన్ను సీసీ కెమెరా.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో నేరస్థుల కదలికలు పసిగట్టి నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరా సమర్ధవంతమైన సాధనం. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఇది గుర్తించారు. నగరం, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల్లో వీటిని ఏర్పాటు చేయడంతో నేరస్థులు వెనక్కి తగ్గారు. వ్యాపారుల దుకాణాలతో పాటు, అపార్ట్‌మెంట్‌లు, పలు నివాసాల్లో కెమెరాల ఏర్పాటుతో కొంత భద్రత చేకూరింది. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కెమెరాల కన్ను మూతపడింది. నిరంతరాయం నిశితంగా గమనించే కెమెరాలు చాలాచోట్ల మరమ్మతులకు గురయ్యాయి. వాటిని పట్టించుకునే వారే లేరు. దీనితో పట్టణాల్లో మహిళల మెడలో గొలుసులు, వాహన చోరీలు యథాతధంగా మారాయి.
ఏలూరులో నిఘా నేత్రం
ఏలూరు క్రైం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీసీ కెమెరాల పనితీరు ప్రశ్నార్ధకంగా మారింది. నిర్వహణ, పర్యవేక్షణ ఒక ప్రైవేటు సం స్థకు అప్పగించారు. మరో 3 వేల కెమెరాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. కాగా నగరంలోని ప్రధాన కూడళ్లు, నగరంలో ప్రవేశించే మార్గాల్లో సుమారు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా పోలీస్ కార్యాల యానికి అనుసంధానించారు. కెమెరాల ఆధారం తో అనేక కేసులను పోలీసులు ఛేదించగలిగారు. ఆందోళనలు, ఉద్యమాలు జరిగిన సమయంలో ఎంతమంది పాల్గొన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నా రు, వారు వెళ్లే మార్గాలను అంచనా వేసి పోలీసు బలగాలను ఆ ప్రాంతానికి పంపిస్తారు.
ఏలూరు నగరంలో రెండు ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లు ఉన్నాయి. ఫైర్‌స్టేషన్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్ర మిస్తే వాహన నెంబర్ ప్లేటు ఆధారంగా ఆటోమే టిక్‌గా ఫైన్ విధిస్తారు. అంబులెన్సులకు కూడా ఫైన్లు అనేకం విధించడం జరిగింది. ఏలూరు నగరంలో సీసీ కెమెరాల దెబ్బకు ఆటో వాలాలు అబ్బా అంటూ అధికారుల వద్దకు వెళ్లి గోడును వినిపించుకున్నారు. తమకు తెలియకుండానే పడిపోయాయని ఒక్కొక్క ఆటోకు వేల రూపా యల జరిమానా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్‌స్టేషన్, పాత బస్టాండ్ సెంటర్లలో రెడ్‌సిగ్నల్ ఉండగా ఒక్క అడుగు వాహనం ముందుకు వెళ్లినా ఫైన్ కట్టి తీరాల్సిందే.
తణుకులో కళ్లు కప్పి..
తణుకు: పట్టణంలోని ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలున్నా నేరాల నియంత్రణలో తడబాటు తప్పడం లేదు. కెమెరాల కళ్లుగప్పి మరీ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. పట్టణంలో 21 కెమెరాలు ఏర్పాటు చేశారు. మరో ఆరు మరమ్మ తులకు గురయ్యాయి. పట్టణంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి మరో 15 కెమె రాలు అవసరం. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పా టుకు ప్రతిపాదన చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతంలో కెమెరా ఆధారంగా చర్యలు చేపడతారు.
పాలకొల్లులో పని చేయవు
పాలకొల్లు అర్బన్: పట్టణంలోని ముఖ్య ప్రాం తాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు కొంత కాలం గా పనిచేయడం లేదు. కెమెరాల పర్యవేక్షణకు హౌసింగ్ బోర్డు కాలనీలోని రిజర్వుడ్ స్థలంలో చిన్నపాటి భవనాన్ని నిర్మించారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఈ భవనం దరిదాపు లకు కూడా పోలీసులు వెళ్లడంలేదు. ఆ భవనం ఆవరణ పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా మా రింది. ప్రధాన రద్దీ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పా టు చేయాల్సి ఉంది. పూలపల్లి, బ్రాడీపేట, దొడ్డిపట్ల రోడ్డు, నరసాపురం రోడ్డు, గాంధీ బొమ్మల సెంటర్, లాకుల సెంటర్, పెద్ద గోపురం వద్ద సీసీ కెమెరాలు నిరుపయోగంగా ఉన్నాయి.
పుష్కరాల నాటి కెమెరాలు..
భీమవరం క్రైం: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం కొంత కాలంగా చోరీలు, నేరాల కేంద్రంగా మారింది. మహిళల మెడలో బంగారు వస్తువులతోపాటు ద్విచక్ర వాహనాల చోరీలు పెరిగాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో దుండగుల ఆగడాలకు అడ్డుకట్టప డింది. ప్రస్తుతం కెమెరాలు పనిచేయకపోవ డంతో నేరాలు పెరిగాయి. పట్టణంలో వివిధ దుకాణదారులు ఏర్పాటు చేసుకున్న కెమెరాలే దిక్కు. పట్టణంలో కెమెరాలు పని చెయ్యకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పోలీసు లు చెబుతున్నారు. 2015లో గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి చుట్టుపక్కల ప్రాం తాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. పుష్కరాలు ముగిసిన అనంతరం ఆ కెమెరాలను కొన్ని పట్టణాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. పట్టణంలో 32 కెమెరాలను మ్యాట్రిక్స్ సంస్థ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కెమెరాలు చాలాకాలం పనిచేశాయి. దొంగలు కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత కెమెరాల నిర్వహణ కొరవడి మరమ్మతులకు గురయ్యాయి. వైసీపీ పాలనలో 2020 నుంచి మూలనపడ్డాయి. ప్రస్తుతం కెమెరాల మరమ్మతుకు అంచనా వేయగా సుమారు రూ.8.5 లక్షల ఖర్చు తేలడంతో పోలీసులు కొందరు దాతలను సంప్రదించారు. ప్రస్తుతం బస్టాండ్‌లో మాత్రం కొన్ని కెమెరాలను అమర్చి పోలీసుల ఆధ్వర్యంలో వాటిని పర్యవేక్షిస్తున్నారు.
తాడేపల్లిగూడెంలో అలంకారం
తాడేపల్లిగూడెం రూరల్: పట్టణంలో సీసీ కెమెరాలు అలంకారప్రాయమే. ప్రధాన కూడళ్ల లో 54 కెమెరాలు, దాతల సహకారంతో మరో 72 కెమెరాలు ఏర్పాటు చేశారు. 20 కెమెరాలు కూడా పని చేయడం లేదు. మరమ్మతు చేయిం చామని సీఐ సుబ్రహ్మణ్యం చెప్పారు.
జంగారెడ్డిగూడెంలో జాడే లేదు
జంగారెడ్డిగూడెం: పట్టణంలో నేరస్తుల కదలి కలు పసిగట్టే కెమెరాలు పూర్తిస్థాయిలో లేవు. ఉన్నవి కూడా పనిచేయక నేరస్తులకు కలిసి వచ్చింది. కెమెరాలతోనే నేరాలను అరికట్టడం సాధ్యం కాదనే అధికారుల ధోరణితో పట్టణంలో నిఘా కొరవడింది.