సిరామిక్ పార్క్ ఏమైంది?
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:41 AM
ద్వారకాతిరుమల చిన వెంకన్న కొలువైన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే నాణ్యతతో కూడిన సుద్ద గనులు ఉన్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు.. వైసీపీ పాలనలో బుట్టదాఖలు
ఉపాధి అవకాశాల కల్పనకు అప్పట్లో కార్యాచరణ
వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం
సుద్ద గనులపైనా కన్నేసి వేధించారు
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో మళ్లీ చిగురించిన ఆశలు
ద్వారకాతిరుమల చిన వెంకన్న కొలువైన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే నాణ్యతతో కూడిన సుద్ద గనులు ఉన్నాయి. సిరామిక్ పరిశ్రమ అభివృద్ధి చేయడం ద్వారా నాణ్యతతో కూడిన టైల్స్ ఉత్పత్తులే కాకుండా వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2014లో టీడీపీ ప్రభుత్వం ఇక్కడ సిరామిక్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించింది. తదనుగుణంగా కొన్ని విదేశీ సంస్థలు ఇక్కడికి వచ్చి అధికారులతో సంప్రదింపులు జరిపాయి. తర్వాత ఐదేళ్ల జగన్ ప్రభుత్వం మాత్రం సిరామిక్ ఊసే ఎత్తలేదు. ఆవైపు తొంగిచూడలేదు. స్థానికులు, యువతకు ఉపాధిని ప్రోత్సహించలేదు. దీనికితోడు గనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి అప్పటి ప్రభుత్వం చర్యలు చేపడితే.. తర్వాతి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. స్థానిక వనరులను సద్వినియోగం చేయడానికి 2014–19లో టీడీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచే సింది. ఎక్కడ వనరులు ఉంటాయో గుర్తించి వాటిని సద్వినియోగపర్చుకునే దిశగా అడుగులు వేశారు. అందుబాటులో ఉన్న గనుల వివరాలను బహిర్గతం చేశారు. ఆఖరుకు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ పరిధిలో ఒక సుద్ద గని(బాల్‌క్లే)ని ప్రోత్సహించారు. ద్వారకాతిరుమలలో నాణ్యతతో కూడిన సుద్ద దాదాపు పది గనుల్లో లభ్యమయ్యేది. వీటి ఆధారంగానే ద్వారకా తిరుమల, పరిసరాల్లో కూడా స్థానికులు కొందరు సిరామిక్ చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారు. అప్పట్లో పదికిపైగా ఉన్న గనుల్లో సుద్ద లభ్యత సంతృప్తికరంగా ఉండేది. అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం వీటిని గమనించి స్థానికంగా ఉపాధి మెరుగుపర్చడమే కాకుండా ఇక్కడి నుంచి సిరామిక్ ఉత్పత్తుల తయారీ, అమ్మకాలను ప్రోత్సహించడం ద్వారా సిరామిక్ పరిశ్రమను భారీగా విస్తరించాలని ప్రణాళిక రూపొందించారు. ఎక్కడికక్కడ సుద్ద గనులు అందుబాటులో ఉండడం, ఉన్న వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సాధ్యమైనంత వివరణాత్మకంగా ప్రచార ప్రాచుర్యం కల్పించారు. ద్వారకాతిరుమల వెంకన్న నిలయమే కాకుండా సుద్ద గనులకు ఎంతో ప్రసిద్ధి అనే విషయం అప్పట్లో బాహ్య ప్రపంచానికి తెలిసింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొందరు విదేశీ ప్రతినిధులు సైతం అప్పట్లో ద్వారకాతిరుమలకు వచ్చి జిల్లా అధికా రులతో సంప్రదించారు. ప్రభుత్వం ద్వారకాతిరుమలను సిరామిక్ పార్కుగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉందని, దీనికి అనుగుణంగా భీమడోలు, ద్వారకాతి రుమల ప్రాంతంలో కొత్త గనుల కోసం మరింత అన్వేష ణ కూడా జరుపుతామని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు యంత్రాంగం ఉప్పందించింది. ప్రత్యక్షంగా పెట్టుబడులకు దిగితే ప్రభుత్వ ప్రోత్సాహం భారీగా ఉంటుందనే విషయాన్ని తేల్చి చెప్పారు. సుద్ద గనులు దగ్గరగా ఉండడంతో వీలైతే జి.కొత్తపల్లి గ్రామ సమీపాన అటవీ ప్రాంతాన్ని సేకరించి ఆ మేరకు అక్కడ సిరామిక్ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ఇదే విషయాన్ని అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు సైతం పలు సందర్భాల్లో ఉఠంగించారు కూడా. ఇంకేముంది స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని అప్పట్లో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. శుద్ధ గనులను లీజుకు తీసుకున్న వారంతా ఇతర ప్రాం తాలకు రవాణా చేసేదానికంటే స్థానికంగానే సిరామిక్ ఉత్పత్తుల ప్రోత్సాహానికి నాణ్యమైన సుద్దను అందించవచ్చని సంతృప్తిపడ్డారు.
వైసీపీ దెబ్బతో సిరామిక్ ముక్కలు
ద్వారకాతిరుమలలో సిరామిక్ పరిశ్రమలను ప్రోత్సహించాలని, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చా లనుకున్న ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రణాళిక కాస్తా వైపీపీ ప్రభుత్వ హయాంలో గాలికి కొట్టుకుపోయింది. ఎక్కడి కక్కడే ప్రణాళికను, ప్రతిపాదనలు మూలనపడేశారు. ఒకప్పుడు రాజమహేంద్రవరం, కడప జిల్లా మందలూ రు, పల్నాడు జిల్లా మాచర్ల, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద నాణ్యమైన సుద్ద గనులు ఉండేవి. కాని రాజకీయ కారణాలతో సుద్ద గనులపై వైసీపీ కన్నేసింది. తమకు వ్యతిరేకంగా ఉన్న వారి గనులను రెన్యువల్ చేయకుండా అడ్డుకుంది. దీంతో ఒక్క ద్వారకాతిరుమల లోనే ఆరు గనులు మూతపడగా మూడు గనులు మాత్రం అంతోఇంతో సుద్ద తవ్వి తీశారు. ఏపీఎండీసీ పరిధిలో ఉన్న మరొక గనిలో కూడా సుద్ద తవ్వకాలు సాగాయి. ఒకవైపు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపో వడంతో అప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు సుద్ద రవాణా జరగ్గా ప్రస్తుతం అది తిరుపతి, పెద్దాపురం, నారాయణపురానికే పరిమితమైంది.
ప్రతిపాదనలు పట్టాలెక్కిస్తారా
తెలుగుదేశం ప్రభుత్వంలో సిరామిక్ పార్కుపై స్థానికులు కోటి ఆశలు పెంచుకున్నారు. కళ్లెదుటే ఉపాధి సాక్షాత్కరించబోతుందని యువత కలలు కన్నా రు. వైసీపీ పాలనలో కలలన్నీ చెదిరిపోవడంతో స్థానికులు తీవ్ర మనోవ్యధ చెందారు. ఇక్కడ లభించే సుద్దతో వాల్ టైల్స్, రూఫ్ టైల్స్, శానిటరి సామాగ్రితో పాటు పొగాకు బ్యారెన్ల నిర్మాణంలో ఉపయోగించే కొన్ని ఇటుకలను ఇక్కడి నుంచే ఇంతకుముందు చిన్న చిన్న యూనిట్‌లలో తయారు చేసేవారు. ఒకప్పుడు టన్ను సుద్ద రూ.800 నుంచి రూ.950 వరకు ధర పలకగా అది కాస్తా చాలా వరకు గందరగోళంలో పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, ఉపాధి అవకాశాలను మెరుగుపరు స్తామని ప్రకటించింది. ఎక్కడ వీలైతే అక్కడ పరిశ్ర మలకు అనువైన పరిస్థితులను సృష్టించాలని యంత్రాం గాన్ని ఆదేశించింది. ద్వారకాతిరుమలలో ప్రతిపాదించిన సిరామిక్ పార్కుకు తిరిగి జీవం పోస్తారన్న ఆశతోనే స్థానికులు ఉన్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నిరుద్యోగం పెరగ్గా, ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. సిరామిక్ పరిశ్రమను ప్రోత్సహిస్తే వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుంది. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.