Share News

కాలుష్య కోరల్లో వశిష్ఠ గోదావరి

ABN , Publish Date - Nov 09 , 2024 | 12:16 AM

వశిష్టా గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంది, చెత్తా, చెదారంతో పాటు ఆక్వా చెరువుల కలుషిత నీరు, కంపెనీలు విడిచిపెట్టే వ్యర్థాలు, పరిశ్రమల రసాయనాలు పవిత్రమైన నదీజలాల్లో కలుస్తున్నాయి.

కాలుష్య కోరల్లో వశిష్ఠ గోదావరి
నరసాపురంలో గోదావరి వద్ద కంపోస్టు యార్డు

కలుషితంపై ‘ఎన్టీజీ’ ఆగ్రహం

నివేదిక అందించాలని మూడు సంస్థల సంయుక్త కమిటీకి ఆదేశం

నరసాపురం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): వశిష్టా గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంది, చెత్తా, చెదారంతో పాటు ఆక్వా చెరువుల కలుషిత నీరు, కంపెనీలు విడిచిపెట్టే వ్యర్థాలు, పరిశ్రమల రసాయనాలు పవిత్రమైన నదీజలాల్లో కలుస్తున్నాయి. గోదావరి ఒడ్డునే పురపాలక సంఘం కంపోస్టుయార్డు నిర్వహిస్తుంది, దాదాపు ఆరు వేల టన్నుల చెత్త పేరుకుపోయింది. ఈకారణంగా నీరు కలుషితమై మత్స్య సంపద హరించిపోతుంది, కొన్ని సమయా ల్లో రసాయనాలకు మత్స్య సంపద చనిపోయి నీటిపై తేలియాడు తున్నాయి. ఇటువంటి ఘటన లు గతంలో అనేకం జరిగాయి. అయినప్పటికీ కాలుష్య బోర్డు నిర్లక్ష్య ధోరణి మారలేదు, వ్యర్థాలను గోదావరిలో కలవకుండా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. గతంలోనే కంపోస్టుయార్డు తొలగించమని కేంద్ర కాలుష్య బోర్డు పురపాలక సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. నేటికీ స్థలం దొరకలేదు. కోస్టల్‌ కారిడార్‌ నిబంధనలకు విరు ద్ధంగా వశిష్ఠా గోదావరిలో వ్యర్థాలు తీరానికి చేరుతున్నాయని ఎన్టీజీలో (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌)లో దాఖలైన పిటీషన్‌పై ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రారంభం కాని గోదావరి ప్రక్షాళన

వశిష్ఠ గోదావరి విజ్జేశ్వరం వద్ద పాయగా వీడి సిద్దాంతం, ఆచంట, యలమంచిలి, నరసాపురం మీదుగా ప్రవహించి మండలంలోని బియ్యపుతిప్పకు అర కిలోమీటరు దూరంలో బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ ప్రదేశాన్ని ఆన్నచెల్లెల గట్టు అని పిలుస్తారు, సముద్ర ఆటుపోటులకు అలల ప్రభావం గోదావరిపై ఎక్కువగా పడుతుంది. ఈ కారణంగా దొడ్డిపట్ల వరకు నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం కోనసీమ జిల్లా రాజోలు వరకు కనిపిస్తుంది. గతంలో కేంద్రం గోదావరి ప్రక్షాళన చేస్తామని ప్రకటించింది. కానీ ఆ ప్రక్రియ ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు.

కలుషితం ఈవిధంగా..

గత ఇరవై ఏళ్ళ నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆక్వా చెరువుల సాగు సంఖ్య ఎక్కువగా సాగుతోంది. చించినాడ, యలమంచిలి, నరసాపురం మండలంలోని అనేక ప్రాంతాల్లో గోదావరికి ఆనుకునే రొయ్యల సాగులు జరుగుతున్నాయి. చెరువులకు వాడే మందులు, మత్స్య సంపదకు వాడిన ఫీడ్‌ నీటిని గోదావరిలోకే విడిచిపెడుతున్నారు. సాధారణంగా నదీ ప్రవాహానికి 50 మీటర్ల వరకు సీఆర్‌జడ్‌ పరిధి ఉంటుంది. జిల్లాలో ఎక్కడా ఈ నిబంధన పాటించడం లేదు. నదీ ప్రవాహానికి పది మీటర్ల దూరంలోనే పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. సాగు చేసే చెరువులన్ని జిరాయితీ భూమిగా చూపిస్తున్నారు. ఈ భూములు సాగుకు పనికిరావు, ఈ కారణంగా రొయ్యలు, చేపల చెరువులే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇటు గోదావరి నదికి సమీపంలో నివాసాలు ఉంటున్న చాలామంది డ్రైనేజీల నీటిని గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. వీటికి తోడు కోనసీమ జిల్లాలోని కొన్ని గ్రామాలు చెత్తా, ఇతర వ్యర్థాలను గోదావరిలోనే పడేస్తున్నారు. కొన్ని నది ఒడ్డునే నరసాపురం పురపాలక సంఘం వారే కంపోస్టుయార్డును నిర్వహించి చెత్తా, చెదారాన్ని ఒడ్డునే పడేస్తున్నారు. ఇవికాకుండా కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఆక్వా ప్రాసెసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకుని వ్యర్థాలు, వాడిన రసాయనాలను నిబంధనలను అతిక్రమించి నదిల్లోకి విడిచిపెడుతున్నారు. కొన్ని కంపెనీలు పేరుకు రీసైక్లింగ్‌ యూనిట్లు పెట్టి వాటిని వినియోగించకుండా రాత్రి సమయాల్లో వ్యర్థనీటిని గోదావరిలోకే పంపేస్తున్నారు. ఈ కారణంగా పవిత్ర నది నిత్యం కలుషితమవుతుంది. ఇదే విధంగా కొనసాగితే కొన్నేళ్ళకు యనమదుర్రు డ్రెయినేజీగా మారే ప్రమాదం ఉందన్న వాదనలు లేకపోలేదు.

రెండు నెలల్లో నివేదిక అందించాలి

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కోస్టల్‌ జోన్‌ మేనేజిమెంట్‌ అథారిటీ, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుల ఆధ్వర్యంలో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి రెండు నెలల్లో నివేదికను అందించా లని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారయంత్రాంగం ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా అనేక నదులు ఉన్నప్పటికీ ఒక్క వశిష్ఠ గోదావరిపై దాఖలైన రిపోర్టులోని ప్రమాదకరమైన వ్యర్థాలు, రసాయనాల వల్లే ట్రిబ్యునల్‌ ఈ విధమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండవచ్చన్న వాద నలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారు లెవ్వరూ నోరు మొదపడం లేదు. ట్రిబ్యు నల్‌ ఆదేశాలకు అనుగుణంగా నివారణ చర్యలు చేపడతామంటూ దాటవేస్తారు.

అనేక సార్లు ఉద్యమం

కంపోస్టు యార్డును తొలగించమని ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నాం. గోదావరి ఒడ్డునే పెట్టడం వల్ల నదీ జలాలు కలుషితం అవుతున్నాయి. ఇవి కాకుండా పరిసర ప్రాంతాలకు వచ్చే దుర్భర వాసనకు అంటు రోగాలు వస్తున్నాయి. కొన్ని సమయాల్లో ఈగలు ముసిరేస్తున్నాయి. ప్లాస్టిక్‌ వంటి సంచులను భారీ చేపలు తినడం వల్ల మృత్యువాత పడుతున్నాయి. సముద్రం, నదిలో కొన్ని రకాల మత్స్య సంపద కూడా కనిపించడం లేదు.

– పెమ్మాడి శ్రీదేవి, మాజీ కౌన్సిలర్‌

Updated Date - Nov 09 , 2024 | 12:18 AM