పారదర్శకంగా కానిస్టేబుళ్ల పరీక్షలు: ఎస్పీ
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:25 AM
కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత అయిన అభ్యర్థులకు సోమవారం నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్‌పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించామని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు.
తొలి రోజున 309 మంది హాజరు
ఏలూరు క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత అయిన అభ్యర్థులకు సోమవారం నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్‌పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించామని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద సోమవారం ఉదయం మీడియాతో ఎస్పీ మాట్లాడారు. సోమవారం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 309 మంది హాజరయ్యారు. వీరిలో 179 మంది అన్ని ఈవెంట్స్‌లో అర్హత సాధించారని చెప్పారు. మహిళా అభ్యర్థినులకు జనవరి 3,4 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ప్రతి అంశాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరణ జరుపుతున్నామన్నారు. ఎటు వంటి అపోహ లకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య పరమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే అస్వస్థతకు గురైన అభ్యర్థులను వెంటనే ఆసుపత్రికి తరలించడానికి రెండు అంబులెన్సులను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహిస్తామని దానిలో డిస్‌క్వాలిఫై అయితే మిగిలిన ఈవెంట్స్‌కు అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. జనవరి 9వ తేదీ వరకూ ఈవెంట్స్ కొనసాగుతాయని అభ్యర్థులు మినహా ఎట్టిపరిస్థితుల్లో ఎవరిని అనుమతించమని, ఎటు వంటి ఎలక్ర్టానిక్ వస్తువులు కూడా అభ్యర్థులు తీసుకురాకూడదని ఎస్పీ తెలిపారు.