Share News

41 ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టారు

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:54 AM

ట్రాన్స్‌ఫార్మర్లు సునాయాసంగా పగుల గొట్టేస్తారు. అందులో రాగి వైరు తస్కరించడమే వారి లక్ష్యం.

41 ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టారు
వివరాలు చెబుతున్న ఎస్పీ కిశోర్‌, పోలీసుల అదుపులో నిందితులు

639.75 కేజీల రాగి అపహరణ

విలువ రూ.6.39 లక్షలు

జిల్లాలో 16 కేసులు నమోదు

ముఠా సభ్యులు ముగ్గురు అరెస్ట్‌

ఏలూరు క్రైం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌ఫార్మర్లు సునాయాసంగా పగుల గొట్టేస్తారు. అందులో రాగి వైరు తస్కరించడమే వారి లక్ష్యం. జిల్లాలో ఒకటి రెండు కాదు 41 ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టేశారు. 639.75 కేజీ రాగి వైరు అపహరించారు. వారిపై జిల్లా వ్యాప్తంగా 16 కేసులు నమోదు కాగా ఎట్టకేలకు పోలీసు లకు చిక్కారు. రాగి వైరు అపహరించే ముగ్గురు ముఠా సభ్యులతో పాటు వాటిని కొనుగోలు చేసే మరొకరిని కూడా భీమడోలు సర్కిల్‌ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావే శంలో ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ వివరాలు తెలిపారు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొలాల్లోని ట్రాన్స్‌ ఫార్మర్లను పగులగొట్టి వాటిలో రాగి వైరును అపహరిస్తున్నారు. ద్వారకాతిరుమల పరిధిలో ఈ ఏడాది 10 కేసులు, లక్కవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2, టి.నరసాపురం పరిధిలో 1, తడికల పూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2, భీమడోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 1 కేసు నమోదు చేశారు. మొత్తం 41 ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి 639.75 కేజీల రాగివైరును అపహరించారు. వీటి విలువ రూ.6,39,750 ఉంటుందని ఎస్పీ తెలిపారు.

ప్రత్యేక బృందం నిఘా

పొల్లాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి రాగి వైర్లు అపహరిస్తున్న సంఘటనలపై డీఎస్పీ డి శ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యుజె విల్సన్‌, ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి సుధీ ర్‌, భీమడోలు హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌ శ్రీనివాస రావు, ద్వారకాతిరుమల కానిస్టేబుళ్లు ఎం వెంకటే శ్వరరావు, ఎన్‌.మురళీకృష్ణ, హోంగార్డు విజె ప్రకాష్‌బాబు ఒక బృందంగా నిఘా ఉంచారు. ఈనెల 17న రాత్రి అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు వెళుతుండడంతో పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారించారు. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన మాను కొండ వెంకట్రావు, అతని బావమరుదులు జంగారెడ్డిగూడేనికి చెందిన ముగ్గళ్ళ దుర్గా ప్రసా ద్‌, ముగ్గళ్ళ శ్రీనివాసరావు కలిసి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దుర్గా ప్రసాద్‌, శ్రీనివాసరావుపై గతంలో గంజాయి కేసులు ఉన్నాయని గుర్తించారు. గంజాయికి బానిసలై అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడానికి బావ వెంకట్రావుకు సహాయంగా వెళ్లి నేరాలకు పాల్పడ్డారన్నారు. ఈ ముగ్గురు ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి తీసుకువచ్చిన రాగి వైరును జంగా రెడ్డిగూడేనికి చెందిన పాత సామాన్లు వ్యాపారి ఉక్కుర్తి వెంకటేశ్వరరావు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దొంగ సొత్తు కొనుగోలు చేసిన నేరంపై వెంకటేశ్వరరావును కూడా అరెస్టు చేసి నట్లు ఎస్పీ చెప్పారు.

రాగి వైర్లు కరిగించి..

రాగి వైర్లను కరగదీసి ఐదు కేజీల దిమ్మెలుగా చేశారు. మరి కొంత వైరు కరగదీయడానికి సిద్ధంగా ఉంచారు. వారి నుంచి 639.75 కేజీలు రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్‌ ఫార్మర్లు పగులగొడితే కఠిన చర్యలు తీసుకుంటా మని, పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ కిశోర్‌ హెచ్చరించారు. నిరంతరం పోలీసు నిఘా పెడతామన్నారు. ఈ సందర్భంగా భీమడోలు సీఐ, ద్వారకాతిరుమల ఎస్‌ఐ, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఎన్‌.సూర్య చంద్రరావు, డీఎస్పీ డి.శ్రావణ్‌ కుమార్‌, భీమడోలు సీఐ యుజె విల్సన్‌, ద్వారకా తిరుమల ఎస్‌ఐ సుధీర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 12:54 AM