కౌలుకు భరోసా
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:13 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణార్హత కార్డుల జారీకి రెవెన్యూ శాఖకు సూచనలిచ్చింది. జిల్లా అధికారులు గ్రామాల వారీగా కౌలు రైతుల సమాచారం సేకరించి 80 వేల కార్డులు అందించారు.
జిల్లాలో 80 వేల కౌలు రైతులకు రుణార్హత కార్డుల అందజేత
రుణాలకు అర్హులు 46 వేల మందేనని బ్యాంకర్ల గుర్తింపు
సార్వా, దాళ్వాలలో 13 వేల మందికి ఇచ్చిన రుణం రూ.163 కోట్లు
మిగిలిన 33 వేల మందికి రుణాలు ఎందుకు ఇవ్వనట్లు..?
కౌలు రైతులకు చేయూతనిచ్చేలా రుణాలందించేందుకు రుణార్హత కార్డులు ఇచ్చినప్పటికీ అందరికీ రుణాలందించడంలో వెనుకబాటు కనిపిస్తోంది. కేవలం ఇరవై శాతంలోపు మాత్రమే రుణాలు పొందారు. అందరికీ అందించేలా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది.
భీమవరం రూరల్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి):కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణార్హత కార్డుల జారీకి రెవెన్యూ శాఖకు సూచనలిచ్చింది. జిల్లా అధికారులు గ్రామాల వారీగా కౌలు రైతుల సమాచారం సేకరించి 80 వేల కార్డులు అందించారు. వీరికి సార్వా పంటకు కౌలు రుణాలు అందుకునే అవకాశం వచ్చింది. సార్వా పంటకు తొమ్మిది వేల 740 మంది కౌలు రైతులకు రూ.141 కోట్లు కౌలు రుణాలుగా అందించారు. ఈ దాళ్వా పంటకు 3,273 మందికిగాను రూ.22 కోట్లు రుణాలు పొందారు. ఈ లెక్కన 13 వేల 13 మంది కౌలు రైతులు రూ.163 కోట్ల కౌలు రుణాలు అందుకోగలిగారు. మొత్తం 80 వేల కౌలు కార్డులందుకోగా, 46 వేల మంది కౌలు రైతులు అర్హులుగా గుర్తించినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కాని, 13 వేల 13 మంది కౌలు రైతులే రుణాలు పొందడం ఎక్కడ లోపమన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో మాదిరి ఎకరానికి రూ.10 వేలు రుణంతో సరిపెట్టకుండా బ్యాంకుల నుంచి రూ.50 వేలు పైగా కౌలు రుణాన్ని అందిస్తున్నారు. దీనిని బట్టి కౌలుకు సాగు చేసే రైతుకు సాగుకు పూర్తి పెట్టుబడి పెట్టుకునేలా రుణం బ్యాంకు నుంచి కౌలు కార్డు ద్వారా పొందగలుగుతున్నారు.
ఈ సమయంలో కౌలు రుణాలు అర్హత కలిగిన కార్డుదారులందరూ రుణాలు పొందడం వారికి ఉపయోగకరం. అయినప్పటికీ కొంత మందికే కౌలు రుణాలుగా మిగిలిపోవడం పట్ల వ్యవసాయాదికారులు ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంది. బ్యాంకర్లు, అధికారులు కౌలు రుణార్హత కార్డుల ద్వారా కౌలు రుణాలు పొందాలని పది రోజులపాటు జిల్లా వ్యవసాయ శాఖ వారు, బ్యాంకుల వారు కలిపి గ్రామసభలు నిర్వహించనున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ చెబుతున్నారు. అవగాహన లేక కౌలు రైతులు రుణాలకు వెళ్ళడం లేదా, బ్యాంకర్లు అడిగే పత్రాలు కౌలు రైతులు అందించలేకపోతున్నారా అన్నది ఈ సభల్లో తేలే అవకాశం ఉంది. అప్పుడైనా కౌలు రుణాలు పొందేవారి సంఖ్య పెరుగుతుందని అనుకోవాలి.
రుణం వస్తే మొత్తం పెట్టుబడి పెట్టుకోవచ్చు
కౌలు రుణాలందించే విధానంలో మార్పు వచ్చింది. గతంలో కౌలు గ్రూపుల ద్వారా కౌలు రైతులు రుణాలు పొందేవారు. పది మంది కలిగిన ఒక్కో గ్రూపునకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం అందించేవారు. ఇప్పుడు ఒక రైతు కౌలు కార్డు ద్వారా రూ.50 వేలపైన రుణంబ్యాంకులు ఇస్తున్నారు. ఆ కౌలు రైతు ఎకరం సాగు చేస్తే రూ.35 వేలు పెట్టుబడి సరిపోతుంది. ట్రాక్టర్ నుంచి ఎరువులు, పురుగు మందులు, పంట కోత మిషన్‌కు ఇలా అన్ని ఖర్చులకు రుణం ద్వారా వచ్చిన సొమ్ముతోనే పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనివల్ల కౌలు రైతులకు పెట్టుబడి భారం అప్పు వడ్డీ భారం లేకుండాపోతుంది. పంటలో మిగులు కనిపిస్తుంది. అందువల్ల కౌలు కార్డులు పొందిన కౌలు రైతులందరూ కౌలు రుణాలు పొందితే సాగులో పెట్టుబడి ఇబ్బందులు ఉండవు.
బ్యాంకుల వారీగా పంపించాం
కౌలు రుణార్హత కార్డుల అర్హుల జాబితాను బ్యాంకుల వారీగా పంపించాం. భూమికి చెందిన యజమాని రుణం పొందకపోతే కౌలు రైతులకు కార్డుల ద్వారా రుణాలు ఇస్తున్నాం. కాబట్టి కౌలు రైతులు కార్డులను బ్యాంక్‌లకు తీసుకుని వెళ్లండి. పరిశీలించి వెంటనే రుణం మంజూరు చేస్తారు.
– ఎ.నాగేంద్రప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్
నాట్లు పూర్తయ్యే వరకు రుణాలు
సార్వా పంటకు సంబంధించి కౌలు రైతులు చాలా మందికి రుణాలు మంజూరయ్యాయి. నాట్లు పూర్తయ్యే వరకు రుణార్హత కార్డుల ద్వారా ఇస్తున్నారు. అర్హులను గుర్తించి, వారందరికీ అవగాహన కల్పిస్తున్నాం.
– జడ్.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి