శరవేగంగా డయాఫ్రం గైడ్ వాల్ నిర్మాణం
ABN , Publish Date - Dec 12 , 2024 | 12:53 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన నూతన డయా ఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన గైడ్ వాల్ పనులు ఊపందుకున్నాయి.
80 మీటర్ల వరకు కాంక్రీటు పనులు పూర్తి
తవ్వకాలు జరిపేందుకు ట్రెంచ్ కట్టర్లు సిద్ధం
వరదలకు దెబ్బతిన్న రోడ్డు 90% పూర్తి
పోలవరం డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన నూతన డయా ఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన గైడ్ వాల్ పనులు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న ప్రాజెక్టు వద్దకు వచ్చి.. నిర్మాణ పనుల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు వివిధ కట్టడాల పనులను వేగవంతం చేశారు. నూతన డయా ఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన ఫ్లాట్‌ఫారాన్ని సిద్ధం చేశారు. వాల్ నిర్మాణ ప్రాంతానికి ఇరువైపులా ఐదు గైడ్‌వాల్స్ కాంక్రీట్ పనులు వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే 80 మీటర్ల మేర ఈ కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. గతంలో మాదిరిగా ఈ సారి కూడా డయాఫ్రం వాల్‌ను 1,396 మీటర్ల పొడవున, ఐదు మీటర్ల వెడల్పున నిర్మిస్తున్నారు. గోదావరి అడుగున ఇసుక సిల్టు, మట్టిపొరల నుంచి ఎర్త్‌కం రాక్ ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యాంలో సీపేజీ రాకుండా నివారించే ప్రక్రియలో భాగంగా నూతన వాల్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నదీతలం అడుగు భాగాన సుమారు 100–150 మీటర్ల లోతు వరకూ ప్రాంతాన్ని బట్టి రాతి పొరలు తగిలే వరకూ తవ్వకాలు జరిపేందుకు ట్రెంచ్ కట్టర్ యంత్రాలను సిద్ధం చేశారు. ఈ యంత్రాలను వినియోగానికి అనువుగా బిగించడానికి సుమారు 20 రోజులు పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. గత 5 నెలలుగా డయాఫ్రం వాల్ ప్రాంతంలో ఇరువైపులా శాండ్ ఫిల్లింగ్, మట్టి , ఇసుక రాతి నమూనాల సేకరణ పనులు నిర్వహిస్తున్నారు. ఈసీపీటీ యంత్రంలో కెమెరా ప్రెషర్ ద్వారా సెన్సర్‌లను భూమిలోకి పంపి ల్యాప్‌ట్యాప్ డిస్‌ప్లే ద్వారా నదిలో మట్టి, రాతి పొరల స్థితిగతుల అంచనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్–2 ప్రాంతంలో వైబ్రో కంపాక్షన్ పనులు నిర్వహించడం ద్వారా భూమిని గట్టిపరిచే పనులు వేగవంతంగా చేస్తున్నారు. వాల్ ప్రాంతానికి మట్టి, రాళ్లు తరలించేందుకు స్పిల్ చానల్ నదీ ప్రవాహంపై ఈ ఏడాది వరదలకు దెబ్బ తిన్న రోడ్డును 90 శాతం వరకు పునరుద్ధరించారు. ప్రవాహానికి ఆటంకం లేకుండా ఈ రోడ్డు మార్గంలో పలుచోట్ల భారీ ఇనుప తూములను ఏర్పాటు చేశారు. మరో 100 మీటర్ల రోడ్డు పనులు ఈ వారంలో పూర్తవుతాయని ఈఈ వెంకటరమణ వెల్లడించారు. గైడ్‌వాల్ పనులు వేగవంతంగా జరుగు తున్నాయని ఈఈ సుధాకర్, డీఈ మల్లికార్జునరావు తెలిపారు.