ఏలూరులో ఉల్లి బాంబుల పేలుడు
ABN , Publish Date - Nov 02 , 2024 | 12:52 AM
దీపావళి పండుగ రోజున గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఏలూరు వన్‌టౌన్‌లో ఆకస్మాత్తుగా పేలుడు సంబవించడంతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇద్దరు యువకులు ఉల్లిపాయ బాంబులను గోనెసంచిలో సర్దుకుని స్కూటర్‌పై వెళ్తుండగా పేలుడు సంబవించింది.
ఒక యువకుడి మృతి
8 మందికి తీవ్ర గాయాలు
ఏలూరు టూటౌన్, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ రోజున గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఏలూరు వన్‌టౌన్‌లో ఆకస్మాత్తుగా పేలుడు సంబవించడంతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇద్దరు యువకులు ఉల్లిపాయ బాంబులను గోనెసంచిలో సర్దుకుని స్కూటర్‌పై వెళ్తుండగా పేలుడు సంబవించింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా ఒక యువకుడితో పాటు మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. ఏలూరు సత్యనారాయణ పేటకు చెందిన ప్రైవేట్ ఎలక్ర్టీషియన్ తాబేలు సాయిరామ్ అతడి స్నేహితుడు ఏలూరు మారుతీనగర్‌కు చెందిన పూల కొట్టులో పని చేసే దుర్గాసి సుధాకర్(28) కలిసి ఏలూరు మాదేపల్లి రోడ్డులోని కబేళప్రాంత సమీపం నుంచి ఉల్లిపాయ బాంబులను గోనెసంచిలో వేసుకుని స్కూటర్‌పై సత్యనారాయణపేట వెళ్తున్నారు. మార్గమధ్యలో తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఆకస్మాత్తుగా ఉల్లిపాయబాంబులు పేలడంతో పెద్ద విస్పోటం సంబవించింది. సుధాకర్ రెండు ముక్కలైపోయాడు. అతడి ఎడమకాలు రెండుమీటర్ల దూరంలోని మూడంతస్థుల భవనంపై పడగా కుడికాలు పక్కనే ఉన్న భవనంపై పడింది. గౌరమ్మ గుడి ఎదురుగా నిలబడి మాట్లాడుకుంటున్న ఏడుగురు యువకులైన అదే ప్రాంతానికి చెందిన కె.శ్రీనివాసరావు, ఎస్‌కే.ఖాదర్, మళ్ళా పెద్దిరాజు, సువ్వారి శశి, మెడికల్ షాపు సురేష్, బొడ్డేటి సతీష్‌కుమార్, సువ్వారి సత్యనారాయ ణ తీవ్రగాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్‌కే.మదీనబాషా వారి వద్దకు చేరుకుని క్షత గాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆర్తనాదాలు
క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో కాలిన గాయాలతో ఉన్నవారు పెట్టిన కేకలు వర్ణాణాతీతం. వారి కేకలు విన్న బంధువులు తల్లడిల్లిపోయారు. వారి రోదనలతో ఆసుపత్రి వద్ద ఆందోళన పరిస్థితలు నెలకొన్నాయి. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రసాదరెడ్డి, డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు, డాక్టర్ మల్లికార్జున రాజు, డాక్టర్ కుమార్ పలువురు వైద్యులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులకు వైద్యసేవలందించారు. తాబేలు సాయిరామ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో అతడిని విజయవాడ తరలించారు. సురేష్, సతీష్‌కుమార్, సత్యనారాయణలను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఘటన స్థలంలో ఎస్పీ పరిశీలన
ఉల్లిపాయ బాంబుల పేలిన ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ కేపీఎస్.కిషోర్, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, జిల్లా క్లూస్ టీమ్ బృందాలు, విజయవాడ పోరెన్సిక్ బృందాలు పరిశీలించారు. సంఘటన స్థలంలో పలు ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై ఏలూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఉల్లిపాయ బాంబులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను ఎస్పీ కిషోర్ పరామర్శించారు.