భూప్రకంపనలు
ABN , Publish Date - Dec 05 , 2024 | 12:42 AM
గోదావరి పరీవాహక ప్రాంతంతోపాటు మిగతా ప్రాంతాల్లో బుధవారం భూమి స్వల్పంగా కంపించింది.
జిల్లాలో సెకన్లపాటు ప్రకంపనలు.. బెదిరిపోయిన జనం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
గోదావరి పరీవాహక ప్రాంతంతోపాటు మిగతా ప్రాంతాల్లో బుధవారం భూమి స్వల్పంగా కంపించింది. ఉదయాన్నే ఎవరి పనిలో వారుం డగా 7.45 గంటల సమయంలో ఐదు నుంచి పది సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. భద్రాచలంకు సమీపాన కుక్కునూరు, వేలేరు పాడు మండలాల్లో 15 సెకన్లకుపైగా రెండు విడతలుగా భూప్రకంపనలు రావడంతో స్థానికు లు ఉలిక్కిపడ్డారు. వంట గదుల్లో వస్తువులు కిందపడ్డాయి. కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. భూకంపం వచ్చిందంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. చాలా మంది కాసేపు ఆందోళన చెందారు. కుక్కునూరు శివాలయంలోని ధ్వజస్తంభానికి ఉన్న గంటలు భూప్రకంపనల కారణంగా ఒక్కసారిగా మోగినట్లు భక్తులు చెబు తున్నారు. ప్రకంపనలు వచ్చే పావుగంట ముందు గ్రామంలో కోతులు ఆందోళనగా అటుఇటూ ఉరు కులు పెట్టినట్లు గమనించామని కొందరు చెబు తున్నారు. జీలుగుమిల్లి, టి.నర్సాపురం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూ డెం, పోలవరం, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. వాస్తవా నికి పోలవరం ప్రాంతం భూకంపాలకు ఆస్కారం లేదు. కాని ఇక్కడ కూడా తొలిసారిగా బుధవారం సెకన్లపాటు స్వల్ప భూప్రకంపనలు కనిపించా యి. దీంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఈమధ్య కాలంలో తొలి సారిగా ఇప్పుడు ప్రకంపనలు నమోదు కావడం పై అధికారులు సైతం నివ్వెరపోతున్నారు. ద్వారకాతిరుమల, ఏలూరు వంటి ప్రాంతాల్లో సెకన్ల పాటు భూప్రకంపనలు వెలువడగా స్థానికులు తొలుత దీనిని తేలిగ్గా తీసుకున్నారు. రెండోమారు ప్రకంపనలు రావడంతో భూకంపంగా నిర్ధారించి ఆందోళన చెందారు. ‘ఉదయాన్నే అందరం కూ ర్చొని ఉండగా 7.45 గంటల ప్రాంతంలో ప్రకంప నలు వచ్చాయి. ఇదేంటి ఏదో అదురుతుందని ముందుగా అనుకున్నాం. ఆ తరువాత కొద్ది సేప టికే మా ఎదుటే ఉన్న టీపాయి, ఖాళీ కుర్చీలు సైతం కదలడం కనిపించింది. ఇదంతా కొన్ని సెకన్లపాటే ఉంది’ అని ఆర్‌ఆర్ పేటకు చెందిన ఒక ఆసుపత్రిలో జనరల్ మేనేజర్ శివప్రసాద్ వెల్లడించారు. నగరంలో ఒకట్రెండు చోట్ల కూడా మాత్రమే కొందరికి ఈ అనుభవం ఎదురైంది. కొయ్యలగూడెం పట్టణంలోని అశోక్‌నగర్, కన్నాపురం, అంకాలగూడెం, దిప్పకాయలపాడు గ్రామాల్లో ప్రకంపనులు గమనించారు. గెడా సత్తిబాబు ఇంటి వద్ద తలుపులు కొట్టుకో వడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొయ్యల గూడెం పట్టణంలోని మండల పరిషత్ ఉద్యోగి స్వామి ఇంటి వద్ద పెంపుడు కుక్కలు యాజ మానుల వద్దకు వచ్చి అరిచినట్లు ఆయన తెలిపాడు. కామవరపుకోట మండలంలో పలు గ్రామాల్లో నివాసాలు, వీధుల్లోని వస్తువులు కద లికలు ఏర్పడడంతో కొందరు వీధుల్లోకి పరుగులు తీశారు. కొన్ని సెకన్ల అనంతరం ప్రకంపనలు ఆగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం సుబ్బారెడ్డి కాలనీలో కొప్పాక శ్రీనివాసరావు కూర్చున్న కుర్చీతో పాటు గ్యాస్ బండ, సోఫా ఒకేసారి కదలడంతో ఇంట్లో వారు బయటకు పరుగులు తీశారు. నూజివీడు రూరల్ మండలం మీర్జాపురం, మండల కేంద్రమైన ఆగిరిపల్లి, చాట్రాయిలలో కూడా భూమిలో స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు నిర్ధారించారు. సాధారణంగా ఈ ప్రాం తాల్లో భూప్రకంపనలకు పెద్దగా ఆస్కారంలేదని, అయినప్పటికి ఇప్పుడు తొలిసారిగా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు ఏర్పడడంతో ఆందోళన కలిగిస్తుందని స్థానికులు పేర్కొంటుండగా పెద్దగా భయపడాల్సిన అవసరంలేదంటూ అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు భూప్రకంపనలతో పలువురు భయపడ్డారు. రెండు, మూడు సెకన్లు ప్రకంపనలు గమనించినట్లు పలువురు చెప్పారు.