Share News

ఇంటి వద్దే ఈకేవైసీ

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:20 AM

దీపం–2 ఉచిత గ్యాస్‌ పఽథకానికి చాలా మంది ఈకేవైసీ చేయించకపోవడంతో ఉచిత సిలిండర్‌ పొందలేకపోతున్నారు. వీరు గ్యాస్‌ బుక్‌ చేసుకున్నా పథకం వర్తించడం లేదు. దీనిపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

ఇంటి వద్దే ఈకేవైసీ

నమోదు చేస్తున్న డెలివరీ బాయ్స్‌

జిల్లాలో పెండింగ్‌ 1,15,257

దీపం–2లో తొలి సిలిండర్‌ బుక్‌ చేసుకున్న 1,03,325 మంది

సిలిండర్‌ వచ్చిన 48 గంటల్లో వారి ఖాతాలకు సొమ్ములు జమ

సమస్యలుంటే 1800 425 1291

1967 నెంబర్లకు ఫోన్‌ చేయండి

భీమవరం టౌన్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి):దీపం–2 ఉచిత గ్యాస్‌ పఽథకానికి చాలా మంది ఈకేవైసీ చేయించకపోవడంతో ఉచిత సిలిండర్‌ పొందలేకపోతున్నారు. వీరు గ్యాస్‌ బుక్‌ చేసుకున్నా పథకం వర్తించడం లేదు. దీనిపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ సమస్యకు అసలు కారణం ఈకేవైసీ లేకపోవడమేనని అధికారులు తేల్చి చెబుతున్నారు. జిల్లాలో ఈ పథకానికి అర్హులు ఐదు లక్షల 67 వేల 651 మంది. నాలుగు లక్షల 52 వేల 394 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకా లక్షా 15 వేల 257 మంది చేయించుకోవాలి. ఈ కారణంగా వీరికి దీపం–2 పథకంలో అర్హులు కావడం లేదు. వీరు తెలుపు రంగు రేషన్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌తో లింక్‌ చేసుకుని ఈకేవైసీ చేసుకుంటేనే ఈ పథకానికి అర్హులని అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు లక్షా మూడు వేల 325 మంది లబ్ధిదారులు దీపం–2 పథకంలో గ్యాస్‌ బుక్‌ చేసుకున్నారు. వీరిలో 59 వేల 265 మందికి గ్యాస్‌ సిలిండర్‌ అందగా వీరిలో 33 వేల 210 మందికి సొమ్ములు అందాయి. 44 వేల 60 మందికి గ్యాస్‌ సరఫరా కావాల్సి వుంది. ‘అర్హులందరికీ ఈ పథకంలో ఉచిత గ్యాస్‌ అందిస్తాం. లబ్ధిదారులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. ఏమైనా ఇబ్బందులుంటే టోల్‌ ఫ్రీ నెంబరు 1800 425 1291, లేదా 1967కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. తక్షణం చర్యలు తీసు కుంటాం’ అని డీఆర్వో మొగిలి వెంకటేశ్వరరావు తెలిపారు.

దీపం–2 పథకానికి అర్హత

జిల్లాలో జనరల్‌, దీపం, ఉజ్వల, సీఎస్‌ఆర్‌ కనెక్షన్‌దారులు అర్హులు.

లబ్ధిదారుడికి ఆధార్‌, తెల్ల రంగు రేషన్‌ కార్డు ఉండాలి.

ఆధార్‌, రేషన్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌తో ఈకేవైసీ చేయించుకోవాలి.

ఈకేవైసీకి గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ స్వయంగా వినియోగదారుడి వద్దకే వచ్చి ఈకేవైసీ చేస్తారు.

మొదటి సిలిండర్‌ బుకింగ్‌కు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అవకాశం వుంది.

మొబైల్‌ నెంబరు ద్వారా మొదటి ఉచిత సిలిండర్‌ బుక్‌ చేసుకుని, డెలివరీ సమయంలో ఎప్పటిలాగే ముందే నిర్ణీత సొమ్ము చెల్లించాలి.

సిలిండర్‌ పొందిన 48 గంటల్లో లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమవుతుంది.

ఒకే ఇంటిలో ఒకే డోర్‌ నెంబరు మీదు రెండు సిలిండర్లు ఉంటే ఒక సిలిండర్‌కు మాత్రమే ఉచిత గ్యాస్‌ వస్తుంది.

Updated Date - Nov 08 , 2024 | 12:20 AM