యాప్ పేరుతో బురిడి
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:24 AM
తక్కువ సమయంలోనే అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ ప్రజలను సైబర్ మోసగాళ్ళు బురిడీ కొట్టించారు.
డబ్బులు చెల్లించిన బాధితులు.. అకౌంట్‌లో డబ్బులు పడక లబోదిబో.. రూ.కోట్లలో నష్టం
భీమవరం క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : తక్కువ సమయంలోనే అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ ప్రజలను సైబర్ మోసగాళ్ళు బురిడీ కొట్టించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాధితులు అధికంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. సైబర్ పోలీసులకు ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. బ్యాంక్ ఖాతాలు, చరవాణి నెంబర్లు, ఆధార్‌కార్డు సమాచారమంతా ఆ యాప్‌లో ఉంచడంతో ఖాతాల్లో నగదు ఎప్పుడైనా జమ చేస్తే లాగేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.
వందలాదిగా బాధితులు
బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యాప్‌ను పరిచయం చేశారు. భీమవరంలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఆశ చూపారు. ఇది నిజమని నమ్మినవాళ్ళంతా వారితో పాటు బంధువులతో కూడా నగదు జమ చేయించారు. ఇంతకీ నగదు అంతా ఎలాంటి పూర్తి వివరాలు లేని యాప్‌లో ఉంచారు. అందులో కొన్ని విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో రూ.6వేలు, రూ.18వేలు, రూ.20వేలు ఇలా నగదు చేసినవారికి ప్రతీరోజు ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేయడంతో విభాగానికి తగ్గట్లుగా నగదు వారి ఖాతాలో జమ చేశారు. ఇదంతా చూస్తే రోజుకు రూ.750 వరకు ఖాతాలో నగదు సంబంధిత యాప్ నుంచి జమ అయ్యేది. కొన్ని రోజుల పాటు జమ అయిన తరువాత నగదు డ్రా చేసుకున్నారు. ఈవిధంగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. దీంతో ఒక్కో విభాగంలో 500 నుంచి 600 మంది సభ్యులుగా చేర్చారు. ఒక్కొక్కరు రూ.20వేలుకు పైగా జమ చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వందలాది బాధితులు నగదు జమ చేసి సైబర్ వలలో చిక్కుకున్నారు. ఇటీవల కాలంలో టాస్క్‌లు పూర్తి చేసినా నగదు బ్యాంక్ ఖాతా నుంచి డ్రా కావడం లేదు. రెండు రోజులు, నాలుగు రోజుల్లో నగదు చేతికి వస్తాయంటూ బాధితులను ఇప్పటి వరకు మభ్యపెట్టారు. చాలా మందికి అనుమానం వచ్చి నగదు లావాదేవీ నిలిపివేయడంతో యాప్‌ను మళ్ళీ పునరుద్ధరించామంటూ రూ.6వేలు ఒకేసారి జమచేస్తే మీరు గతంలో చెల్లించిన నగదు కూడా తిరిగి వస్తుందని చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. భీమవరంలో గతంలో సమావేశం నిర్వహించిన వారి వివరాలు కోసం వెతుకుతున్నారు. బాధితులంతా సమావేశమై పోలీసులను ఆశ్రయించే యోచనలో ఉన్నారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలో అనేక మంది ఈ యాప్ బారిన పడ్డారు. ఈ క్రమంలో గ్రామంలో అనేక మంది కోటి రూపాయల మేర చెల్లించారు. రెండు నెలలుగా జరుగుతున్న ఈ పఽథకంలో కొంత మంది నాలుగు వారాల పాటు బాగానే విత్‌డ్రాలు జరిగాయి. అయితే రెండు వారాల నుంచి అకౌంట్లలో పడిన సొమ్ము విత్ డ్రా కాకపోవడంతో బాధితుల్లో ఆందోళ న మొదలైంది. ఎవరిని అడగాలి అనే మీమాంసలో ఉండి పోయారు. టెక్నికల్ సమస్య వచ్చిందని, అలాగే ఫైనాన్సియల్‌గా ఇబ్బంది వచ్చిందని ఉదయం 9.30 గంటల నుంచి రెండున్నర గంటలపాటు వేచి చూడాలని మెసేజ్‌లు వచ్చాయి. తాము మోసపోయా మని బాధితులు లబోదిబో అంటున్నారు.