రైతుల ఉరుకులు పరుగులు
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:32 AM
వాతావరణ మార్పులతో రైతులు పరుగులు పెడుతున్నారు.
వర్షాల హెచ్చరికతో రైతుల్లో ఆందోళన
హడావుడిగా వరి మాసూళ్లు
ఏలూరు సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వాతావరణ మార్పులతో రైతులు పరుగులు పెడుతున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం వర్షా లు లేకున్నా ముసురు వాతావరణంలో హడావుడిగా వరి మాసూళ్లు చేస్తున్నారు. జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటి వరకు 1.16 లక్షల ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యాయి. 15,612 మెట్రిక్ టన్నుల ధాన్యం రహదారులపై రైతులు ఆరబోశారు. మిగిలిన పంటలో కొంత కల్లాలు, మరి కొంత కుప్పలపై ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 1.99 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వర్షాల నేపథ్యంలో రైతుల నుంచి ఽధాన్యం కొనుగోలుకు జిల్లా యం త్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఉన్నఫళంగా మబ్బులు పట్టి వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం 15,612 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రహదారులపై ఆరబోయగా 13,653.8 మెట్రిక్ టన్నుల ధాన్యం కుప్పలపై ఉంది. వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ధాన్యం రక్షణ రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నామన్నారు.