ఆపన్నులకు ఆసరా
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:11 AM
విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇలా ప్రతీ ఒక్కరూ మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు.
భీమవరం టౌన్, సెప్టెంబరు 4: విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇలా ప్రతీ ఒక్కరూ మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఆహారం, వాటర్ ప్యాకెట్లతో పాటు నిత్యావసర వస్తువులు, దుస్తులు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యవేక్షణలో బుధవారం పెద్ద ఎత్తున వేలాది ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స విజయవాడకు పంపించారు. జనసేన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ యిర్రింకి సూర్యారావు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు ఐదు వేల బిర్యాని ప్యాకెట్లు,ఐదు వేల దుప్పట్లు అందించారు. ఎమ్మెల్యే రామాంజనేయులు వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వేల ఆహార పదా ర్థాలను కలెక్టర్ , ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారం భించారు. వీరవాసరం మండలం నవుడూరు గ్రామానికి చెందిన అడబాల నారాయణరావు 5 వేల మందికి భోజనం, వాటర్ ప్యాకెట్లు తరలించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులు నుంచి సుమారు 5 వేల భోజనం ప్యాకెట్లు పంపారు. భీమవరం లయన్స్‌క్లబ్ తర ఫున 3 వేల మందికి భోజనం ప్యాకెట్స్‌ను పంపించారు. సీహెచ్ కృష్ణంరాజు అందించిన రూ.2 లక్షలతో వీటిని తయారు చేశారు.భీమవరం డీఎన్‌ఆర్ కాలేజ్ విద్యాసంస్థలు డిగ్రీ, పాలిటెక్నిక్, బీటెక్ విద్యార్థులు ఐదు వేల ఆహార పొట్లాలు తయారు చేయించి పంపారు.
ఆకివీడు : ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు ఆర్థిక సహకారంతో బుధవారం 12 వేల ఆహార పొట్లాలు, వెయ్యి వాటర్ బాటిల్స్ మూడు వాహనాలలో పంపించారు. ఆదర్శ లయన్స్ క్లబ్, ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపించారు.
కాళ్ళ: దొడ్డనపూడి సర్పంచ్ కొల్లి సుబ్బారావు, బీజేపీ ఉండి ఇన్‌చార్జి కోరా రామ్మూర్తి, సీసలి మాజీ సర్పంచ్ కట్రెడ్డి శ్రీనివాసరావు, సీసలి జనసేన గ్రామాధ్యక్షుడు నూకల భోగేంద్రబాబు సహకారంతో ఏర్పాటు చేసిన సుమారు 5 వేలు ఆహార పొట్లాలు, ఐదువేల వాటర్ బాటిల్స్‌ను బుధవారం ప్రత్యేక వ్యాన్‌లో విజయవాడకు పంపించారు.
ఉండి : పెదపుల్లేరు గ్రామస్థుల ఆధ్వర్యంలో 6 వేల ఆహార పొట్లాలను పంపించారు. స్థానికులు పలువురు తరలివెళ్లారు. తహసీల్దారు నాగార్జున జెండాను ఊపి పంపించారు.
పాలకొల్లు రూరల్ : పాలకొల్లు జైభారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం తరపున 2 వేలు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ తరపున 3 వేల ఆహార పొట్లాలను, సంధ్యా మెరైన్స్ నుంచి 5 వేల ఆహార పొట్లాలు, విజయవాడకు వ్యాన్లలో పంపించారు.
నరసాపురం టౌన్ : కష్టకాలంలో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే నాయకర్ పిలుపునిచ్చారు. బుధ వారం రాత్రి వరద బాధితుల కోసం 20 లక్షలు విలువ చేసే 12 వేలు నిత్యావసర ప్యాకెట్లను సిద్ధం చేసి వాటిని వాహనంలో విజయవాడ తరలించారు. ఒక్కొక్క ప్యాకెట్‌లో ఐదు కేజీల బియ్యం, ఒక పాలు, బెడ్, ఇతర నిత్యవసరా వస్తువులు ఉన్నాయి. మండలంలోని కొప్పర్రు గ్రామానికి చెందిన జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాస్ విజయవాడ వరద బాధితులకు తనవంతు సాయంగా 1000 భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. డీఅర్‌డీఏ సహకారంతో వీటిని వ్యాన్ సాయంతో తరలించారు.
పెనుగొండ : పెనుగొండ శ్రీవాసవీ టెంపుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 2500 పులిహోర ప్యాకెట్లును , 2500 వాటర్ ప్యాకెట్లును పంపిణీ చేసినట్లు ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ గోవిందరాజులు తెలిపారు.
ఏలూరు టూటౌన్ : ఏలూరు అన్ ఎయిడెడ్ పాఠశాలల అసోసి యేషన్ ఆధ్వర్యంలో రూ.లక్షా 50 వేల విలువైన ఆహార పదార్థాలను విజయవాడ తరలించినట్టు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శర్మ తెలిపారు. నగర పాలక సిబ్బంది, డ్వాక్రా మహిళలు ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని ఎస్‌ఎంఎస్ అంబు లెన్స్ సర్వీస్ ద్వారా 5వేల మందికి ఆహార పొట్లాలు పంపినట్టు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఏపీఎన్ జీఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, నెరుసు రామారావు 5వేల మందికి సరిపడ బ్రెడ్, వాటర్‌బాటిల్స్ పంపామన్నారు. శ్రీసత్యసాయి సేవా కేంద్రం ఆధ్వర్యంలో 5 వేల వాటర్ బాటిల్స్‌ను, బ్రెడ్ పంపించారు.
ఏలూరు కార్పొరేషన్ : ఏలూరు ఆర్డీవో ఎస్.కె.ఖాజావలి, తహశీల్దార్ జి.వి.శేషగిరిరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనునాయక్, వీఆర్వోల బృందం లారీపై ఆహార పదార్ధాలు, మంచినీటి బాటిల్స్, పాలు ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లతో తరలివెళ్ళారు.
ఏలూరు రూరల్ : ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ వారికి ఇచ్చిన విరాళాల సహాయనిధి నుంచి పుడ్ ఫ్యాకెట్లు, వాటర్‌ప్యాకెట్ల వాహనాన్ని ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఏ.భానుప్రతాప్ ప్రారంభించారు.
ద్వారకాతిరుమల :ద్వారకాతిరుమలలో టీడీపీ నాయకుడు ఇమ్మడి రత్నాజీ ఆధ్వర్యంలో 4 వేల ఆహార పొట్లాలను, పంపించారు. గుడి సెంట ర్‌లో ఉన్న వ్యాపారులు 40 వేల వాటర్ ప్యాకెట్లను పంపారు. శ్రీవారి దేవ స్థానం 5,500 సాంబార్ రైస్‌ప్యాకెట్లు, 6 వేల వాటర్ ప్యాకెట్టు పంపించారు.
చింతలపూడి : చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన స్ఫూర్తి స్వచ్ఛంధ సంస్థ కార్యదర్శి మొహిద్దీన్ పాషా వెయ్యి ఆహార పొట్లాలను తహసీల్దార్ ప్రమధ్వర ఆధ్వర్యంలో పంపారు.
ఉంగుటూరు : .కైకరం నుంచి జనసేన తరపున రూ.3.30 లక్షలతో తయారు చేసిన ఆహార పొట్లాలను పంపించారు. రెండు టన్నుల బియ్యం, 2 టన్నుల కూరగాయలు, టన్ను ఉప్మా రవ్వ, టన్ను చపాతి పిండి, టన్ను బత్తాయిలు, పంపారు.
భీమడోలు :పూళ్ళ, ఎంఎంపురం గ్రామాల్లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వ ర్యంలో ఐదు వేల బిర్యానీ ప్యాకెట్లు, 10 వేల వాటర్ ప్యాకెట్ల తరలించారు.
కామవరపుకోట : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ల సూచనతో కామవరపుకోట నియోజక వర్గానికి చెందిన కూటమి నాయకుల బృందం బుధవారం వివిధ వాహ నాల్లో బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీరు, ఆహార పదార్థాలను తీసుకువెళ్ళారు.
పెదవేగి : వరదలకు అల్లాడుతున్న ప్రజల అవసరాలను తీర్చడమే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు నియోజకవర్గం నుంచి 50 వేల మందికి ఆహారాన్ని సిద్ధం చేసి విజయవాడ తీసుకెళ్ళి బాధితులకు అందించారు. ఏడు పదుల వయస్సులో చంద్రబాబునాయుడు యువకుడిలా పనిచేస్తుంటే ఒక్క పులిహోర పొట్లం కూడా పంచడం చేతకాని జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న సేవలపై వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు.నీచరాజకీయాలు చేయడం ఒక్క జగన్‌కే చెల్లుతుందని విమర్శించారు. ఇకపై ఆహారం కాకుండా ఆహార వస్తువులను అందించే దిశగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయణ, మాగంటి నారాయణ ప్రసాద్, జాస్తి ప్రసాద్, లావేటి శ్రీనివాసరావు, నంబూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.