Share News

ఉచిత సిలిండర్‌ రెడీ

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:07 AM

జిల్లాలో 6.25 లక్షల గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. అందరికీ ఉచిత గ్యాస్‌ పథకం వర్తించదు. కేవలం తెల్ల రేషన్‌ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేస్తారు.

ఉచిత సిలిండర్‌ రెడీ

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

తెల్లకార్డుదారులకు లబ్ధి

బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరి

నాలుగు నెలలకు ఒక బండ ఉచితం

జిల్లాలో 6.25 లక్షల గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. అందరికీ ఉచిత గ్యాస్‌ పథకం వర్తించదు. కేవలం తెల్ల రేషన్‌ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 5.67 లక్షల మంది తెల్ల రేషన్‌ కార్డుదారులున్నారు. వారందరికీ ఉచిత గ్యాస్‌ అందనుంది, ఉచిత గ్యాస్‌ కోసం జిల్లాలో ప్రభుత్వం ఏటా దాదాపు రూ.170 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే అధికారులు ఉచిత గ్యాస్‌ను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సొమ్ములు జమ చేయనుంది. కేవలం 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్ములు వేయనుంది. ఎప్పటికప్పుడు గ్యాస్‌ ధరలు మారుతూ వస్తున్నాయి. ధరలకు అనుగుణంగానే ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ భారాన్ని మోయనుంది.

(భీమవరం–ఆంఽధ్రజ్యోతి)

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరో హామీని అమలు చేయనుంది. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌లను లబ్ధిదారులకు అందజేయనుంది, ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఎన్నికల ముందే సూపర్‌ సిక్స్‌ పథకంలో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్‌లు అందజేస్తామని ప్రకటించింది. దీపావళి నుంచి ఆ పథకాన్ని నెరవేర్చనున్నారు. జిల్లా అధికారులకు మార్గదర్శకాలు రానున్నాయి. ఇప్పటికే అర్హుల కోసం ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీచేసింది. అర్హులు తెల్లకార్డుదారులై ఉండాలి. రాష్ట్రంలో నివాసితులు కావాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్న రాయితీ బ్యాంకు ఖాతా కూడా మనుగడలో ఉండాలి. కేంద్రం ఒక్కో గ్యాస్‌ సిలెండర్‌కు రూ.10 మాత్రమే రాయితీ ఇస్తోంది, ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం మూడు సిలిండర్‌లు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్‌ పెంచి లబ్ధిదారులకు అందజేస్తోంది. నెలకు రూ.4 వేలు వంతున పంపిణీ చేస్తోంది. తాజాగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌లతో ప్రతి కుటుంబానికి ఏడాదిలో రూ.3 వేల లబ్ధి చేకూరనుంది.

మార్చి 31 వరకు అర్హత

ఉచిత గ్యాస్‌ దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31వ తేదీ వరకు అర్హత ఉంటుంది. అప్పటిలోగా ఎవరైనా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌లను తీసుకోవచ్చు. తెల్లరేషన్‌ కార్డుదారులందరూ ఉచిత గ్యాస్‌కు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాది మార్చి నాటికి ఒక్క సిలిండర్‌ మాత్రమే వస్తుంది. ఆ తర్వాత ఏడాది మూడు సిలిండర్‌లు పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం సగానికిపైనే ముగిసింది. కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్‌కు ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంది. ప్రతి ఏటా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించి మూడు గ్యాస్‌ సిలిండర్‌లు అందచేస్తారు. నాలుగు నెలలకు ఒక్కటి మాత్రమే ఇస్తారు. అదికూడా ఏ రోజు తీసుకునేందుకైనా లబ్ధిదారునికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాతిపదికన ప్రభుత్వం మూడు సిలిండర్‌లను ఉచితంగా అందజేసేందుకు ప్రణాళిక రచించింది. మొత్తంపైన సూపర్‌ సిక్స్‌ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉచిత గ్యాస్‌ కోసం లబ్ధిదారులు సైతం ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 27 , 2024 | 01:07 AM