పట్టభద్రులెక్కడ?
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:23 AM
ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదులో అధికార పక్షం బాగా వెనుకబడింది.
ఓటరు నమోదులో కూటమి నేతల తడబాటు
ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికలకు 3 లక్షల మంది ఓటర్లు
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 60 వేలు కూడా లేని ఓటర్ల సంఖ్య
మరో రెండు రోజుల్లో ముగియనున్న గడువు
నేతలు, కార్యకర్తలు కదలాలని అధినేత ఆదేశాలు
ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదులో అధికార పక్షం బాగా వెనుకబడింది. నియోజకవర్గాల వారీగా రెండు వారాల క్రితమే కూటమి నేతలందరినీ సన్నద్ధం చేసినా సాధ్యమైనంత మేర ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఓటర్ల నమోదులో చురుగ్గా కదలాల్సిందిగా నేతలను ఆదేశించారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకునే దిశగా శ్రేణులను సమాయత్తం చేసినా ఓటర్ల నమోదు ఆశించిన స్థాయిలో లేదు. ఓటర్ల నమోదు గడువు రెండు రోజుల్లో ముగియనున్నా 50 శాతం కూడా నమోదు కాలేదు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
టీడీపీ, బీజేపీ, జనసేన త్రయం ఉమ్మడిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధి పేరా బత్తుల రాజశేఖర్‌ను గెలిపించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. లక్ష్యం చేరడంలో ఓటర్ల నమోదు అత్యంత కీలకం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో అనుకున్నంత మేర ఓటర్ల నమోదు పుంజుకోలేదు. సమన్వయ లోపం గ్రాడ్యుయేట్‌లను వెతికి ఆ మేరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో నమోదు చేసేందుకు కింది స్థాయి కేడర్ పెద్దగా ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ పట్టణాలు, నగరాల్లో మాత్రం కొంతలో కొంత ఓటరు నమోదు పూర్తి చేయ గలిగారు. ఈనెల 6న ఓటర్ల నమోదుకు తుది గడువు. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం గతంతో పోలిస్తే కొన్ని నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడే ఉన్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి ప్రభుత్వం తొలుత సీరియస్‌గా తీసుకుంది. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గానికి కూటమి అభ్యర్థిగా కాకినాడకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్‌ను ఖరారు చేశారు. ఈ దిశగా ఎంత వీలైతే అంతమేర ఉమ్మడి పశ్చిమ లో కూటమి ఎమ్మెల్యేలంతా సమష్టిగా నిర్ణయా లు, సమాంతరంగా ఓటర్ల నమోదు, ఆ తదుపరి కూటమి అభ్యర్ధి గెలుపుకు అనుకూలంగా వ్యూహం ఖరారు చేసేందుకు సమాయత్తపరి చారు. కాని గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉన్న ఏలూరు కార్పొరేషన్‌తో సహా మునిసిపాలిటీలు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లి గూడెం వంటి ముఖ్యప్రాంతాలలో ఓటర్ల నమోదు అత్యధికంగా సాగాలని పక్షం రోజుల క్రితమే జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఏలూరులో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో ఓటర్ల నమోదే కాకుండా కూటమి అభ్యర్థి విజయానికి వ్యూహాలను ఎక్కడికక్కడ ఖరారు చేసుకుని ముం దుకు సాగాల్సిందిగా ఆదేశించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సునాయాసంగా ఉండేలా కూటమి నేతలంతా పక్కా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఆ మేరకు తక్షణం రంగంలోకి దిగి ఓటర్ల నమోదు భారీగా ఉండేలా చూడాలని సూచించారు.
చెప్పిందొకటి.. జరుగుతుందొకటి
రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గ నేతలకు ఇచ్చిన ఆదేశం ఒకటి, ఆచరణలో జరుగుతున్నది ఇంకొకటి. పరస్పర సమన్వయలోపం బహిర్గత మైంది. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవ ర్గంలో గతంలో మూడు లక్షలకుపైబడి ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓటర్ల చేర్పింపులో మాత్రం అనుకున్నంత సజావుగా సాగలేదు. దీనికితోడు అనేక అడ్డంకులు. కూటమి నేతల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయం లేకపోవడం కూడా ఓటర్ల నమోదులో వెనుకబాటుకు దారితీసింది.
45 శాతంలోపు నమోదు
ఇంతకుముందు నమోదైన ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఇప్పటివరకు ఉభయగోదావరిలో కేవలం లక్షా 30 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. 40–45 శాతం మధ్యే ఓటర్ల నమోదు నత్తనడకన సాగినట్టయ్యింది. ఒక్క ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే సరాసరి 50 నుంచి 60 వేలలోపే ఓటర్ల సంఖ్య నమోదైనట్టు తేలుతుంది. ప్రత్యేకించి జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో ఓటర్ల నమోదు సంఖ్య ఏమాత్రం ముందుకు సాగలేదు. మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ దిగువ స్థాయి టీడీపీ నేతలు కూడా కలుగచేసుకుని ఓటర్ల నమోదుకు ప్రయత్నిం చారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ఎప్పటికప్పుడు ఒకేరకంగా ఉండదు. గతంలో ఉన్నదానికి, ఇప్పుడు నమోదవుతున్న ఓటర్ల సంఖ్యకు సారూప్యత లేకుండా పోయింది. మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో గ్రాడ్యు యేట్‌ల సంఖ్య అత్యధికం. మండల కేంద్రాల్లోను ఇంకాస్త పర్వాలేదనిపిస్తుంది. దీనిని కూర్పుచేసి ఓటర్ల నమోదుకు ముందుకు సాగాలి. ఆఖరుకు ఉమ్మడి పశ్చిమగోదావరి ఏపీఎన్జీవో సంఘ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ తాజాగా ఎక్కడి కక్కడ పట్టభద్రులైన ఉద్యోగులను కూడా ఓటర్లుగా నమోదు చేయించారు. అంత చొరవ కూడా కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు ప్రాధాన్యం ఇవ్వలేకపోయినట్టు కనిపిస్తుంది.
వలసపోయిన ఓటర్లు
ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక గ్రాడ్యుయే ట్‌లు ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్, ఇతర నగరాలకు తరలిపోయారు. ఉన్నప్రాంతం నుంచి వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడడం వంటి పరిణామాల నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్ల నమోదులో అడ్డంకి ఏర్పడినట్టు కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి పక్షంలో తెలుగుదేశంకు చెందిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు మాత్రం తమ పరిధిలో ఎక్కడికక్కడ పట్టభద్రులను గుర్తించి మరీ ఇంటింటికి వెళ్లి నమోదు చేశారు. అయినప్పటికీ ఒక్కొ నియోజకవర్గంలోను మూడు, నాలుగు వేలకు మించి సంఖ్య పెరగలేదు. ఏలూరు నియో జకవర్గంలో దాదాపు మూడు వేలకుపైగా ఓటర్లు నమోదయ్యారు. ఈ క్రమంలో ఈనెల 6తో ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియనుంది. వచ్చే రెండు రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోను మహా అయితే ఒకటి రెండు శాతం మాత్రమే ఓటర్ల నమోదు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఓటర్లు సంఖ్య తక్కువ కావచ్చు.
కదలండి.. కదిలించండి : సీఎం చంద్రబాబు
పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకు గడువు దగ్గరపడినందున నియోజకవర్గాల్లో వేగం పెంచాలని తక్షణం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు మిగతా కూటమి నేతలను సమన్వయపర్చుకుని ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు నాయుడు నేతలందరికీ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం పార్టీ ముఖ్యులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎక్కడిక్కడ లోటుపాట్లు ఉన్నది గుర్తించి ఆరా తీశారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో వెనుకపడకూడదని, రాబోయే రెండు రోజుల్లో వేగంగా స్పందించి ఓటర్ల సంఖ్య పెరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమా చారం. దీనికనుగుణంగానే కొన్ని నియోజకవర్గాల వరకే గ్రాడ్యుయేట్‌లను అన్వేషించి ఆ మేరకు ఓటరుగా నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇంతకుముందైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీచర్లను లక్ష్యంగా చేసుకుని పట్టభద్రుల ఓటర్ల నమోదు వేగంగా జరిగేది. ఉద్యోగులను ఎక్కడికక్కడ గుర్తించడం, వారిని ఓటర్లుగా నమోదు చేయడం వంటి చర్యల్లో పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో వేగంగా కదిలేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయినా రాబోయే రెండు రోజుల్లో ఈ వర్గాల వైపు పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.