Share News

చేలల్లో మంటలు

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:37 AM

వరి మాసూళ్ల అనంతరం చేలల్లో దుబ్బులను రైతులు తగలబెడుతున్నారు.

చేలల్లో మంటలు
పెనుమంట్ర వద్ద భూముల్లో కాలుతున్న వరి దుబ్బులు

వరి మాసూళ్లు అనంతరం దుబ్బులు కాల్చుతున్న రైతులు

భూసారానికి ముప్పు

మిత్ర పురుగులు నశిస్తాయి

శాస్త్రవేత్తల హెచ్చరిక

పెనుమంట్ర, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వరి మాసూళ్ల అనంతరం చేలల్లో దుబ్బులను రైతులు తగలబెడుతున్నారు. కూలీలు కొరతను అధిగమించేందుకు ఖర్చులు తగ్గించుకోవడానికి యంత్రాలతో వరి కోత చేస్తున్నారు. యంత్రాలు నేలమట్టానికి దుబ్బులు కోయడం లేదు. కోసిన గడ్డి పశువులకు పూర్తిగా ఉపయోగించుకునే పరిస్థితి లేదు. గడ్డి కట్టలు కట్టే యంత్రాలు అందుబాటులో లేవు. దీనితో చేలో గడ్డి ఎక్కు వగా ఉంటే తగలబెట్టేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దుబ్బును తగలబెట్టడం వల్ల లాభదాయక సేంద్రియ ఎరువులు కాలి బూడిద కావడంతో పంటకు నష్టం వాటిల్లుతుందని భూ సారం కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు.

దుష్పరిణామాలు తప్పవు

వరి దుబ్బు కాల్చితే దుష్పరిణామాలు తప్పవని భూసార శాస్త్రవేత్త సీహెచ్‌.శ్రీనివాస్‌ రైతులను హెచ్చరిస్తున్నారు. చేలోనే గడ్డిని తగల బెట్టడం వల్ల 149.24 మిలియన్‌ టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌, 9 మిలియన్‌ టన్నుల కార్బన్‌ మోనాక్సైడ్‌, 25 మిలియన్ల టన్నుల సల్ఫర్‌ ఆక్సైడ్‌, 1.28 టన్నుల బూడిద నుసి విడుదలతో వాతావరణ కలుషితం అవుతుందన్నారు. చేలలో గడ్డిని మండించడం వల్ల సుమారు ఒక సెంటీ మీటర్‌ లోతులో ఉన్న పంటకు మేలు చేసే మిత్ర పురుగులు, సూక్ష్మజీవులు నశించిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనితో భూమి నిస్సారం అవుతుందన్నారు. వేడి వల్ల మిత్ర కీటకాలు మిత్ర శిలీంద్రాలు నశించడం వల్ల చీడ పీడల ఉధృతి పెరిగి పోతుందన్నారు.

ఒక టన్ను గడ్డి తగలబెడితే..

శాస్త్రవేత్తల పరిశోధనలో ఒక టన్ను గడ్డిని తగలబెడితే ఉత్పనమయ్యే రసాయన ప్రభావా లు వెలుగు చూశాయి. 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్పరస్‌, 2.8 కిలోల పొటాషియం ఒక కిలో సల్ఫర్‌, సేంద్రియ కర్బనాన్ని నేల కోల్పో తుందని తెలిపారు. టన్ను వరి గడ్డిలో 5 నుంచి 8 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 17 కిలోల పొటాషియం, కిలో గంధకం, 3 నుంచి 4 కిలోల కాల్షియం, 1 నుంచి 3 కిలోల మెగ్నీషి యం, 40 కిలోల సిలికాన్‌ ఉంటాయి.

వరిగడ్డి తగలబెట్టడం వల్ల మనుషులపై దుష్ప్రభావం ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పొగ వల్ల కళ్ల మంటలు, ముక్కులో మంట, గొంతు నొప్పి సంభవిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు కూడా దారితీస్తాయి.

Updated Date - Dec 20 , 2024 | 12:37 AM