Share News

వీడని వర్షంతో ముంపు

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:12 AM

బంగాళాఖాతంలో వాయుగుండంతో కురుస్తున్న భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి.

వీడని వర్షంతో ముంపు
యలమంచిలి మండలం ఆర్యపేటలో నీట మునిగిన వరి చేను

నీటిలో నానుతున్న వరి చేలు

బీమవరం టౌన్‌, సెప్టెంబరు 4: బంగాళాఖాతంలో వాయుగుండంతో కురుస్తున్న భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. ఐదు రోజు లుగా కురుస్తున్న వర్షాలకు వరి చేలు ముంపు బారిన పడ్డాయి. తేరుకుంటు న్నంతలో మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఏకాఽధాటిగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. కూలీ పనులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర వ్యాపారాలు మందగించాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.

జిల్లాలో వర్షపాతం

జిల్లాలో గడచిన 24 గంటలలో వర్షపాతం ఇలా ఉంది. తాడేపల్లిగూడెం 28.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా పెంటపాడులో 21.2, తణుకు 56, అత్తిలి 15.4, గణపవరం 27.8, ఆకివీడు 2.4, ఉండి 22.2, పాలకోడేరు 21.8, పెనుమంట్ర 42.6, ఇరగవరం 32.4, పెనుగొండ 19.8, ఆచంట 26, పోడూరు 22.4, వీరవాసరం 20.2 భీమవరం 28.8, కాళ్ళ 41.2, మొగల్తూరు 19.4, నరసాపురం 16.8, పాలకొల్లు 46, యలమంచిలిలో 16.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

11,890 ఎకరాల్లో మునిగిన వరి

భీమవరం రూరల్‌ / పాలకొల్లు రూరల్‌ / యలమంచిలి / ఆకివీడు: భారీ వర్షాలతో వరి చేలు ముంపు బారినపడ్డాయి. జిల్లాలో బుధవా రం నాటికి 11,890 ఎకరాల్లో ముంపు బారిన పడినట్లు వ్యవసాయాధికారుల అంచనా. మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాల కొల్లు రూరల్‌ మండలంలో పలు గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దగ్గులూరులో యానాది వారి కాలనీ (పుంత)లో 110ఎకరాలు పూర్తిగా నీటిలో మునిగింది. భగ్గేశ్వరం డ్రెయిన్‌ దిగువన మరో 25 ఎకరాలు నీట మునిగాయి. ఆగర్రు, ఆగర్తిపాలెం, వెలివెల, కొత్తపేట, దిగమర్రు, వరధనం కాపవరం, అరట్లకట్ట, శివదేవుని చిక్కాల, తిల్లపూడి తదితర గ్రామాల్లో రైతు లు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యలమంచిలి మండలంలో సుమారు 1200 ఎకరాలు నీట మునిగాయి. వీడని వర్షంతో నీరు బయటకు మళ్లించే అవకాశం లేదని అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సార్లు వేసిన నారు, నాట్లు కూడా మునగడంతో రైతులు తీవ్రనష్టాలను చవిచూడాల్సిన పరి స్థితులు నెలకొన్నాయి. ఒకపక్క భారీవర్షాలు, మరోపక్క గోదావరికి వరదనీరు పెరుగుతున్న నేపధ్యంలో మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే వరినాట్లు పూర్తయిన చేలన్నీ నీటమునిగే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకివీడు మండలంలో 960 ఎకరాల్లో వరి చేలు నీట ముని గినట్లు ఏవో ప్రియాంక తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 12:12 AM