Share News

హలో.. మీపై గంటలో ఐటీ రైడ్స్‌ !

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:57 AM

‘హలో.. నేను భీమవరం ఆదాయపన్ను శాఖ కార్యాలయం నుంచి ఇన్‌స్పెక్టర్‌ను మాట్లాడుతున్నా. మాపై అధికారులు గంటలో మీ వద్దకు తనిఖీలకు వస్తున్నారు. మీ డాక్యుమెంట్లు అన్ని రెడీ చేసుకోండి.

 హలో.. మీపై గంటలో ఐటీ రైడ్స్‌ !

ఫోన్‌ చేసి భారీగా వసూలు చేస్తున్న ఓ ఆగంతకుడు..

భీమవరం క్రైం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘హలో.. నేను భీమవరం ఆదాయపన్ను శాఖ కార్యాలయం నుంచి ఇన్‌స్పెక్టర్‌ను మాట్లాడుతున్నా. మాపై అధికారులు గంటలో మీ వద్దకు తనిఖీలకు వస్తున్నారు. మీ డాక్యుమెంట్లు అన్ని రెడీ చేసుకోండి. మీ ఫైల్‌ ప్రస్తుతం నా దగ్గర ఉంది. అధికారులు మీ వద్దకు రాకుండా ఉండాలంటే నా దగ్గర ఉన్న ఫైల్‌ పక్కన పెడితే రారు. దీనికోసం ఒక అధికారి ఫోన్‌ నెంబర్‌ ఇస్తాను.. దానికి ఓ పది వేలు ఫోన్‌ పే చేయండి. లేకుంటే తనిఖీలకు వచ్చిన అధికారులకు ఏ ఒక్క డాక్యుమెంట్‌ సరిగా లేకపోయినా ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు ఫైన్‌ వేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం’ అంటూ ఒక అగంతుకుడు ఆక్వా మెడిసిన్‌ దుకాణాల యజమానులకు బెదిరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలైన ఆకివీడు, గణపవరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, వీరవాసరం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది వ్యాపారులకు ఇలాగే ఫోన్‌ చేసి ఫోన్‌ పే చెయ్యండి అంటూ బెదిరించడం ప్రారంభించాడు. అసలు ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరు ? భీమవరం ఆదాయ పన్ను శాఖ అధికారి పేరు ఎందుకు చెబుతున్నాడు ? ఏదైనా కార్యాలయంలో పనిచేస్తూ అక్రమ సంపాదన కోసం ఇలా చేస్తున్నాడా ? అన్నది తెలియాల్సి ఉంది. కానీ చాలా మంది ఎందుకొచ్చిన గొడవలే.. ఓ పది పోతే పోయాయి అని భయపడి నగదు చెల్లిస్తూ మోసపోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు. వ్యాపార వర్గాల్లో మాత్రం దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇటువంటి మోసాలు భారీగా పెరిగాయి. దీనిపై పోలీసులు ఓ కన్నేయాల్సి వుంది.

Updated Date - Nov 10 , 2024 | 12:57 AM