Share News

జీతాలు ఇవ్వకుంటే సమ్మె

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:37 AM

జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పారిశుధ్య కార్మికులు వేతన బకాయిల కోసం ఆందోళన బాట పట్టారు.

జీతాలు ఇవ్వకుంటే సమ్మె
ఏలూరులో జిల్లా ఆస్పత్రి వద్ద కార్మికుల ధర్నా

జిల్లా, ఏరియా ఆస్పత్రుల పారిశుధ్య కార్మికుల నిరసన

ఏలూరు క్రైం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పారిశుధ్య కార్మికులు వేతన బకాయిల కోసం ఆందోళన బాట పట్టారు. ఐదు నెలల నుంచి జీతాలు చెల్లించాలని, మూడు రోజుల్లో చెల్లించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని ఏపీ మెడికల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, ప్రధాన కార్యదర్శి పి.దత్తాత్రేయ ప్రకటించారు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం గంట సేపు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఐదు నెలల నుంచి పారిశుధ్య కార్మికులకు, సెక్యూరిటీ సిబ్బందికి కాంట్రాక్టర్‌ జీతాలు చెల్లించడం లేదన్నారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ ద్వారా తెలిపినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్నాలో పారిశుధ్య నాయకులు విజయ, జయ, ఝాన్సీ, సెక్యూర్టీ సూపర్‌వైజర్‌ మైఖేల్‌రాజు పలువురు నాయకత్వం వహించారు.

చింతలపూడి: స్థానిక ఏరియా ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. సంఘ నాయకులు టి.బాబు మాట్లాడుతూ మంత్రి, ఉన్నతాధికారులకు చెప్పినా స్పందించ లేదన్నారు. ధర్నాలో ఏరియా ఆసుపత్రి నాయకురాలు టి.మరియమ్మ, రాజు, రామకృష్ణ, రామమ్మ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు.

బుట్టాయగూడెం: పారిశుధ్య కార్మికుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ శుక్రవారం బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద కార్మికులు ఆందోళన చేశారు. బేతి కిషోర్‌ మాట్లాడుతూ ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. నాయకులు రాజు, మునేశ్వరావు, కృష్ణ, వెంకటేశ్వరావు, చిన్నబాబు, సుజాత, సత్యవతి, సుందరమ్మ పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: ఏరియా ఆసుపత్రి వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. పారిశుధ్య కార్మికుల వేతన చెల్లింపులో కాలయాపన చేస్తున్నారని కూనపాముల విజ్ఞేష్‌ అన్నారు. బకాయి వెంటనే చెల్లించకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని కుంచె వసంతరావు హెచ్చరించారు. జంపన వెంకటరమణరాజు, కంటేటి వెంకటరావు, బొక్కా శ్రీనివాస్‌, ఏరియా ఆసుపత్రి పారిశుధ్య కార్మికుల సంఘ అధ్యక్షురాలు దయామణి,మేరీ, ప్రభావతి, రాజు, సంజీవరావు, శ్రీను, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:37 AM