Share News

ఎన్టీఆర్‌ గృహాలపై సర్వే

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:13 AM

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్‌ గృహాలకు మోక్షం లభించనుంది.

ఎన్టీఆర్‌ గృహాలపై సర్వే

గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు

పెండింగ్‌లో బిల్లులు చెల్లించని వైసీపీ

తాజాగా కూటమి ప్రభుత్వం ఆదేశాలు

సర్వే నివేదిక ఇవ్వాలని దిశా నిర్దేశం

భీమవరం టౌన్‌, అక్టోబరు 1 : గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్‌ గృహాలకు మోక్షం లభించనుంది. లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ జిల్లాకు 25,350 ఇళ్ళు మంజూరుచేసింది. సొంత స్థలాలు, ప్రభుత్వం స్థలాల్లో పూరి గుడిసెల్లో ఉన్నా సరే సర్వేచేసి లబ్ధిదారులను గుర్తించారు. ఇళ్ళు మంజూరు చేశారు. ప్రతి ఇంటికి రూ.1.80 లక్షల వంతున నిధులు మంజూరు చేసింది. లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్‌ గృహాలను పక్కన పెట్టింది. బిల్లులు మంజూరు చెయ్యలేదు. దీంతో లబ్ధిదారులు, అప్పుల్లో మునిగిపోయారు. ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. మొత్తంగా రూ.40.79 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ గృహాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ సర్వే చేపడుతోంది. ఎన్టీఆర్‌ గృహాలను పరిశీలిస్తున్నారు. ఇళ్ళు ఏ దశలో ఉన్నది గుర్తిస్తున్నారు. వార్డు గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ఇళ్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలకు అప్పట్లో ఇళ్ళు కేటాయించారు. తాజాగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తారు.

Updated Date - Oct 02 , 2024 | 12:14 AM