గాలి పీల్చారో..!
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:24 AM
ఏలూరు నగరం దుమ్ము, ధూళి కణాలతో నిండిపోయింది. సాధారణ స్థాయిని దాటి ప్రమాదకర పరిస్థితు ల్లో కొన్నేళ్ళుగా కొనసాగుతోంది.
దుమ్ము, ధూళితో పొంచి వున్న ముప్పు
వాయు కాలుష్య నగరాల జాబితాలో ఏలూరు నగరం
ఛిద్రమైన రహదారులు, కాలం చెల్లిన వాహనాల పొగతో కాలుష్యం
గాలి నాణ్యతపై పీసీబీ విశ్లేషణ
ఏలూరు నగరం దుమ్ము, ధూళి కణాలతో నిండిపోయింది. సాధారణ స్థాయిని దాటి ప్రమాదకర పరిస్థితు ల్లో కొన్నేళ్ళుగా కొనసాగుతోంది. ఫలితంగా వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపు తోంది. ముఖ్యంగా రోడ్ల వెంబడి వెలువడే ధూళి కణాలు వాయు కాలుష్యాన్ని మరింత పెంచగా, వాహనాల నుంచి వెలువడే పొగ ఎయిర్ పొల్యూషన్‌ను మరికొన్ని రెట్లు పెరగడానికి కారణమవుతు న్నట్టు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పరిశీలనలో తేలింది. దేశవ్యాప్తంగా అత్యధిక వాయు కాలుష్యం ఉన్న 118 పెద్ద, మధ్య తరహా నగరాలు, పట్టణాల జాబితాలో ఏలూరు కార్పొరేషన్‌ను ఒకటిగా పీసీబీ చేర్చడం గమనార్హం.
ఏలూరు అర్బన్, నవంబరు 24(ఆంద్రజ్యోతి): ఏలూరు జిల్లాలో భారీ పరిశ్రమలు, గనులు లేక పోయినా వాయుకాలుష్యం తీవ్రత అధికంగా ఉందని పీసీబీ కొన్నేళ్ళ క్రితమే గుర్తించింది. నేష నల్ ఎయిర్ మానటరింగ్ ప్రోగ్రాం(నాంప్) కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యతను పరిశీలించడానికి ఆయా ప్రాంతా ల్లో యంత్రాలను అమర్చారు. వీటి నుంచి సేకరిం చిన విశ్లేషణల్లో ఏలూరు పరిధి అంతటా గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉందని నిర్థా రించారు. ఒక మీటర్ క్యూబ్‌లో ధూళికణాలు 60 మైక్రోగ్రాములకంటే ఎక్కువ పరిణామంలో ఉంటే ఆ ప్రాంతంలో వాయు కాలుష్యం ఉన్నట్టుగా ప్రకటిస్తారు. ఏడాది కాలంలో ఈ విశ్లేషణలన్నిం టినీ క్రోడీకరించి వాయుకాలుష్యం ఉన్నదీ, లేనిదీ నిర్ణయిస్తారు. ఆ ప్రకారం ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఒక దశలో గాలి నాణ్యత గరిష్ట మోతాదు అంటే 69 మైక్రో గ్రాములకు చేరిందని పీసీబీ ప్రకటించి వాయు కాలుష్య నగరాలు, పట్టణాల జాబితాలో చేర్చింది. కొంత కాలం క్రితం నగరంలోని జూట్‌మిల్లు మూసివేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోవున్న గాలి నాణ్యతను కొలిచే యంత్రాల నుంచి సేకరిం చిన సమాచారం ప్రకారం వాయుకాలుష్యం కొం త మేర అంటే 64 మైక్రో గ్రాములకు తగ్గిందని ఇటీవల నిర్ణారణకు వచ్చారు. అయినప్పటికీ పలు రహదారులు ఛిద్రమై వాహనాలు వెళుతు న్నపుడు ధూళికణాలు భారీ మొత్తంలో పైకి లేచి వాయు కాలుష్యం మోతాదులను పెంచుతున్నా యని తేల్చారు. రోడ్ల దుస్థితి నగరంలో ఆశ్రం హాస్పిటల్ రోడ్డు నుంచి పాత బస్టాండ్ వరకు, కైకలూరు రోడ్డు, మరి కొన్ని అంతర్గత రహదారు ల్లో ధూళికణాలు విపరీతంగా ఎగిసి పడుతున్న ట్టు గుర్తించారు. మరోవైపు కాలం చెల్లిన వాణిజ్య వాహనాలు, ప్రైవేటు వాహనాల నుంచి వెలువడే పొగ కూడా వాయుకాలుష్య మోతాదులను కొన్ని రెట్లు పెంచడానికి కారణమవుతోంది.
త్వరలో గాలి నాణ్యత మిషన్
ప్రజలు గాలినాణ్యతను ప్రత్యక్షంగా తెలుసుకు నేలా కంటిన్యూస్ యాంబియటీ ఎయిర్ క్వాలిటీ స్టేషన్‌ను ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి పీసీబీ చర్యలు చేపట్టింది. ఈ మిషన్ ద్వారా ఽధూళికణాలను విశ్లేషించి ప్రతి పది నిమిషాలకోసారి గాలి నాణ్యతను బహిరం గంగా ఏర్పాటుచేసే స్ర్కీన్‌పై అందరూ వీక్షించ డానికి వీలుగా ప్రదర్శించే ఏర్పాటు ఇందులో ఉంటుంది.
నియంత్రణపై దృష్టి
ఏలూరు నగరాన్ని వాయు కాలుష్యరహితంగా తీర్చిద్దడానికి చర్యలు అవసరం. రోడ్లపై గుంతలను పూడ్చే పనులు పూర్తయితే ధూళి కణాల మోతాదు తగ్గుతుం ది. రోడ్లను నీళ్ళతో తడుపుతుండాలి. మొక్కలను విరివిగా నాటాలి. వాహనాల నుంచి మోతాదుకు మించి పొగ వెలువడకుండా పర్యవేక్షించాలి. మృతదేహాల దహనానికి గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక వినియోగించాలి. నిర్దేశిత ప్రమాణాలకు మించి వాయు కాలుష్యం ఏలూరులో ఎక్కువగా ఉన్నప్పటికీ తగిన చర్యలతో ప్రజారోగ్యానికి ముప్పేదీలేదు.
– కె.వెంకటేశ్వరరావు, ఇంజనీరు, పీసీబీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి