Share News

అభయారణ్యంలో చేపల చెరువులు

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:34 AM

కొల్లేరు అభయా రణ్యం పరిధిలో ఉన్న చేపల చెరువులకు అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తూ చేపల సాగు చేస్తున్నారని జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డిని కలిసి కె.తులసి ధర్మతేజ, పలువురు సోమవారం విజ్ఞప్తి చేశారు.

అభయారణ్యంలో చేపల చెరువులు

ఏలూరు రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాంటూరు పరిధిలో లేని చెరువు లపేరుతో విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుని అక్కడి నుంచి కరెంటువైర్లు ద్వారా కొల్లేరు అభయా రణ్యం పరిధిలో ఉన్న చేపల చెరువులకు అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తూ చేపల సాగు చేస్తున్నారని జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డిని కలిసి కె.తులసి ధర్మతేజ, పలువురు సోమవారం విజ్ఞప్తి చేశారు. ఏలూరు రూరల్‌ మండలం, పెదపాడు ప్రాంతాల్లో కొల్లేరు అభయారణ్య పరిధిలో అక్రమ చేపలచెరువులు తవ్వారని వాటిలో చేపలు సాగుచేస్తున్న చెరువులకు అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా చేపలసాగు చేస్తున్నారని జేసీ దృష్టికి తీసుకువెళ్ళారు. కాంటూరు పరిధిలో లేని చెరువుల పేరుతో విద్యుత్‌కనెక్షన్‌ తీసుకుని వైర్లుద్వారా అభయారణ్యపరిధిలో ఉన్న చేపల చెరువులకు విద్యుత్‌ వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ విద్యుత్‌వైర్లు చేపలచెరువు గట్లమీద నుంచి వేయటం వల్ల కొల్లేరులోకి ఆహారం కోసం వచ్చే పశువులు విద్యుత్‌వైర్లు తగిలి షాక్‌కు గురై చనిపోతున్నాయన్నారు. గతవారం రూరల్‌ మండలం చాటపర్రులో పట్టాభూముల నుంచి అభయారణ్యపరిధిలో ఉన్న చేపల చెరువుకు విద్యుత్‌కోసం వైర్లు ఏర్పాటుచేసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై ఒక యువకుడు మృతిచెందాడని జేసీ దృష్టికి తీసుకువెళ్ళారు. విద్యుత్‌ కనెక్షన్ల పై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోవడం లేదని జేసీ దృష్టికి తీసుకువెళ్ళారు. రూరల్‌ మండలంలో కలకుర్రు గ్రామంలో అక్రమ విద్యుత్‌కనెక్షన్‌ల పై స్థానిక విద్యుత్‌శాఖ అధికారి ఓ వ్యక్తిపై చర్యలు తీసుకుని సుమారు లక్షా70వేలు జరిమానా విధించారని కలకుర్రు గ్రామంలో అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్‌ పెట్టుకున్న సుమారు ఏడుగురిపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ విద్యుత్‌కనెక్షన్లు పెట్టకుండా చెరువులకు ఇచ్చే సబ్సీడీ కరెంటు దుర్వినియోగం కాకుండా చూడాలని, ప్రస్తుతం పత్తికోళ్ళలంక, గుడివాకలంక, శ్రీపర్రు, మొండికోడు, పైడిచింతపాడు, కొక్కిరాయలంక, పెదపాడు మండలం వడ్డిగూడెం, గుడిపాడు గ్రామంలో ఉన్న అక్రమ చేపల చెరువుల పైకి విద్యుత్‌కనెక్షన్‌ పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకుని కనెక్షన్‌ తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Dec 10 , 2024 | 12:34 AM