Share News

గ్లాస్‌ గలాటా..!

ABN , Publish Date - May 01 , 2024 | 12:49 AM

ఏలూరు జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో ఇండిపెండెట్‌లకు గ్లాస్‌ గుర్తు కేటాయించడం గందరగోళానికి దారి తీస్తోంది. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ, ఏలూరు లోక్‌సభ స్థానంలో ఇండిపెండెంట్‌లకు జనసేన గుర్తు కేటాయించారు.

గ్లాస్‌ గలాటా..!

జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లోఇండిపెండెట్‌లకు గ్లాసే

ఇప్పుడు దీనిపైనే గందరగోళం

హైకోర్టు ఆదేశాల కోసం జనసేన ఎదురుచూపు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఏలూరు జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో ఇండిపెండెట్‌లకు గ్లాస్‌ గుర్తు కేటాయించడం గందరగోళానికి దారి తీస్తోంది. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ, ఏలూరు లోక్‌సభ స్థానంలో ఇండిపెండెంట్‌లకు జనసేన గుర్తు కేటాయించారు. జనసేన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే గ్లాస్‌ గుర్తుతో ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు. నామినేషన్‌ ప్రక్రియకు చివరి రోజు అయిన సోమవారం పోలవరం, ఉంగుటూరు నియోజక వర్గాల్లో బరిలో ఉన్న జనసేన అభ్యర్థులకు గ్లాస్‌ గుర్తులు కేటాయించారు. సమాంతరంగా నూజివీడు, కైకలూరు, చింతలపూడి, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు ఇదే గ్లాస్‌ గుర్తు కేటాయించడం గందరగోళానికి దారి తీస్తోంది. ఎక్కడైనా జనసేన అభ్యర్థి లేరో అక్కడ గ్లాస్‌ గుర్తు కేటాయింపు జరిగినట్టు ఎన్నికల అధికారి చెబుతున్నా దీని ప్రభావం ఎంపీ అభ్యర్థిపై పొడచూపుతుందన్న అనుమానం లేకపోలేదు.

ఎందుకిలా జరిగింది..

ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఒక ఎన్నికల గుర్తు కేటాయిస్తే ఈ గుర్తుకు సమాంతరంగా ఇండిపెండెంట్‌లకు, మరే ఇతర రాజకీయ పార్టీలకు అదే గుర్తు కేటాయించి పునరావృతం చేయడం జరగదు. జనసేన పార్టీ కేవలం రిజిస్ట్రర్‌ పార్టీగానే ఉన్నందున గత ఎన్నికల్లో తగినంత ఓట్లు దక్కక ఎన్నికల సంఘంలో గుర్తింపు పొందలేదు. జనసేన పార్టీకి ఇంతకుముందు కేటాయించిన గ్లాస్‌ గుర్తు ఎవరైతే ఆ పార్టీ అభ్యర్థులుగా రంగంలో ఉంటారో వారికి మాత్రమే ఆ గుర్తు కేటాయిస్తూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇండిపెండెంట్‌లు కోరుకుంటే గాజు గ్లాస్‌ గుర్తు వారికి కేటాయించారు. ఏలూరు ఎంపీ స్థానానికి 13 మంది అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. కూటమి పక్షాన టీడీపీ బలపరిచిన మహేష్‌ కుమార్‌ యాదవ్‌ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఇండిపెండెంట్‌గా ఉన్న బొకినాల కోటేశ్వరరావుకు గ్లాస్‌ గుర్తు కేటాయించారు. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా ఉన్న మహేష్‌ యాదవ్‌ ప్రచారంలో సైకిల్‌, కమలం, గాజు గ్లాస్‌ గుర్తులు మూడింటిని విస్తృతంగా ఓటర్ల ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్‌ అభ్యర్థికి కూడా గాజు గ్లాస్‌ గుర్తు కేటాయిస్తే ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందన్నది అందరిలోనూ నెలకొన్న సందిగ్ధత. అసెంబ్లీ నియోజక వర్గాలకు వచ్చేసరికి పోలవరంలో చిర్రి బాలరాజు, ఉంగుటూరులో పత్సమట్ల ధర్మరాజు జనసేన కూటమి పక్షాన రంగంలోకి దింపింది. వీరిద్దరికి గ్లాస్‌ గుర్తు కేటాయించారు. మిగిలిన నియోజక వర్లాల్లో ఇండిపెండెంట్‌లకు గ్లాస్‌ గుర్తు కేటాయించడం రాజకీయ గలాటాకు దారి తీస్తోంది. దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఇండిపెండెంట్‌గా ఉన్న పల్లి రమేష్‌, ఏలూరు అసెం బ్లీ నియోజకవర్గంలో ఇం డిపెండెంట్‌ అభ్యర్థి మత్తె బాబి, కైకలూరులో ఇండిపెండెంట్‌ అభ్యర్థి మాదాసు సత్యనారాయణ, చింతలపూడి నియోజకవర్గంలో మొవ్వల ఎస్తేరు రాణికి గాజు గ్లాస్‌ గుర్తు దక్కింది. అంటే ఒక్క ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోనే దాదాపు అన్ని అసెం బ్లీ నియోజక వర్గాల్లోనూ గాజు గ్లాస్‌ గుర్తు ఉంటుంది. దీనిపైనే కూటమిలోనూ తీవ్ర తర్జన భర్జన జరుగుతోంది. కూటమి పక్షాన ఇప్పటికే మూడు చిహ్నాలతో విస్తృతంగా ప్రచారం చేసినందున ఇదంతా కూడా జనం మధ్యకు వెళ్లింది. ఇలాంటి తరుణంలో ఇండిపెండెంట్‌లకు గ్లాస్‌ గుర్తు కేటాయించడం గుండె గుభేలుమనేలా చేసింది.

ఇప్పుడు ఏం చేయబోతున్నారు..

గ్లాస్‌ గుర్తు తమ పార్టీదని జనసేన వాదిస్తూ ఎన్ని కల చిహ్నాల కేటాయింపులో ఇండిపెండెంట్‌లకు గ్లాస్‌ గుర్తు కేటాయించడంపై ఇప్పటికే జనసేన రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరగబోతుంది. ఇప్పటికే గుర్తు ఇండిపెండెంట్‌కు కేటాయించిన కారణంగా ఎలాంటి ప్రభావం కూటమి అభ్యర్థులపై పడుతుందన్న తర్జన భర్జన జరుగుతోంది. అది కాకుండా ఎంపీ స్థానంలోనూ ఇండిపెండెంట్‌కు ఇదే గుర్తు కేటాయిస్తే దీని ప్రభావం పూర్తిగా ఎంపీ అభ్యర్థిపై పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. జనసేన గుర్తు గాజు గ్లాస్‌గా అట్టడుగు స్థాయిలోనూ ఓటర్ల మదిలో ఉంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటా యన్న నమ్మకంతో కూటమి అభ్యర్థులు ఉన్నారు.

Updated Date - May 01 , 2024 | 12:49 AM