Share News

కైకలూరు.. కొల్లేరే!

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:38 AM

కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.. అభివృద్ధి ఊసే లేదు.

కైకలూరు.. కొల్లేరే!

నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం

బెదిరింపులు, దౌర్జన్యాలు

ఇసుక మాఫియా

కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.. అభివృద్ధి ఊసే లేదు. అక్రమాలకు మాత్రం అంతులేదు. కొల్లేరు రెగ్యులేటర్‌ ఏర్పాటు చేస్తామని స్వయంగా జగన్‌ ఇచ్చిన హామీ గాలికొదిలేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో 10 కిలో మీటర్ల పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు ఎమ్మెల్యే కుమారులు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందుంచారు. కొల్లేరులో చెరువుల అక్రమ సాగుపై ఆరా తీసిన అధికారిని బదిలీ చేశారు. కైకలూరులో సాగుదారులను బెదిరించి వంద ఎకరాల చెరువు తక్కువ మొత్తంతో బలవంతంగా లీజుకు తీసుకున్నారని, నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతులేదని, ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

కైకలూరు

నియోజకవర్గం ఐదేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అవినీతి, దౌర్జన్యాలు, మాటల గారడీకే పరిమితం. తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలను పట్టించుకోకపోవడమే గాక కేంద్రం ప్రవేశపెట్టిన జల జీవన్‌ మిషన్‌ పథకం ఇంటింటికి ఉచిత మంచినీటి కనెక్షన్‌ ద్వారా నీరు ఇచ్చిన దాఖలాలు లేవు. మండవల్లిలో రూ.75 లక్షలతో జలజీవన్‌ మిషన్‌ ద్వారా నూతనంగా పైపులైన్లు నిర్మాణం అటకెక్కించారు. గ్రామాల్లో రహదారులు నిర్మాణంలో వెనుకబడిపోయారు. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లే తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అక్కడక్కడ మాత్రమే రోడ్లు వేశారు.

కోరుకొల్లు క్యాంపెల్‌ కాలువపై, ఆవకూరు, కోరుకొల్లు సరిహద్దులో ఉన్న పెదలంక డ్రైన్‌పై వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో 15 ఏళ్ల కిందట కొత్త వంతెన నిర్మించారు. దానికి ఇప్పటికీ అప్రోచ్‌ రోడ్డు వేయ లేదు. కలిదిండిలో వ్యవసాయ రైతుబజారును టీడీపీ ప్రభుత్వంలో 70 శాతం పూర్తి చేసినా ఈ ప్రభుత్వం అసంతృప్తిగానే వదిలివేసింది. పెద లంక డ్రైన్‌ నిర్మాణం అభివృద్ధి లేక ఈడేపల్లి, పెదగొన్నూరు రైతుల పొలాల నీరు కిందకు వెళ్లకపోవడంతో కనీసం సాగు చేసుకునే పరిస్థితి లేదు. పేదల ఇళ్ల స్థలాలకు భూముల సేకరణలో వైసీపీ నేతలకు కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కైకలూరులో 50 మంది రైతులు లీజుకు చేస్తున్న వంద ఎకరాల చేపల చెరువును ఎమ్మెల్యే తనయుడు బలవంతంగా తీసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధానమైన ఆక్వాసాగుకు పూర్తిగా మొండిచెయ్యి చూపించారు. యూనిట్‌ విద్యుత్‌ రేట్లను రూ.3.80పైసలకు పెంచడమే గాక గత ప్రభుత్వంలో వినియోగించుకున్న విద్యుత్‌ వాడకానికి సైతం కోట్లలో వసూలు చేస్తున్నారు.

కొల్లేరు రెగ్యులేటర్‌ ఎక్కడ జగనన్నా..

ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో కొల్లేరు ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత రూ.470 కోట్లతో అంచనా వేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఐదేళ్లు గడిచినా అతిగతీ లేదు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని పట్టించుకోలేదు. జల జీవన్‌ పథకంలో కూడా తాగునీరు అందించలేకపోయారు.

నెరవేరని హామీలు

కలిదిండిలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుకు కనీస ప్రయత్నాలు జరగలేదు.

ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాములు అందుబాటులో లేవు. 24వేల ఎకరాల్లో దాదాపు 600టన్నుల ఉత్పత్తి నిల్వ సామార్ధ్యం లేక రైతులు ఇబ్బందులు గురవుతున్నారు.

ముదినేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు ఊసే ఎత్తలేదు.

కైకలూరు నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు వినతులు పట్టించుకోలేదు.

పేరూరులో పోల్‌రాజ్‌ మెయిన్‌డ్రైన్‌పై వంతెన కూలి 3సంవత్సరాలు అయినా నిర్మాణం జరగలేదు. 3కోట్లతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు.

మండవల్లిలో తరుగుమూలలో 120మందికి ఇళ్ల స్థలాలు మెరక చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. నాలుగున్నరేళ్లుగా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు.

మండవల్లి మండలంలో రెండో ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలు, ఇతర సామగ్రి, మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు.

కైకలూరులో పార్కు ఏర్పాటు, పీహెచ్‌సీలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు, 50 పడకల ఆసుపత్రి హామీలు నెరవేరలేదు.

కైకలూరును పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారుస్తామన్న హామీ ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదు.

పెదలంక డ్రైన్‌పై గరిసేపూడి వద్ద పాతరెగ్యులేటర్‌ పాడైపోవడంతో కొత్త రెగ్యులేటర్‌ నిర్మాణం చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.

కొల్లేరు గ్రీన్‌జోన్‌కు ముప్పు

కొల్లేరు అభయారణ్య పరిధిలో పది కిలోమీటర్ల మేర ఎలాంటి కర్మాగారాల ఏర్పాటుకు అనుమతి లేదు. కానీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతుల కోసం ఎమ్మెల్యే కుమారులు సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

కొల్లేరులో చేపల చెరువుల అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఫారెస్ట్‌ రేంజర్‌ ఆఫీసర్‌ను బదిలీ చేయించారు.

ఎమ్మెల్యే మాట కాదని ఎవరైనా గ్రామాల్లో వ్యతిరేకిస్తే ప్రభుత్వ పథకాల్లో కోతలు పెడుతున్నాని వాపోతున్నారు.

ప్రశ్నిస్తే కేసులు ఎదుర్కొవలసివస్తుందని అవినీతిపై తమకు తెలియదన్నట్లు ప్రజలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

రైతుబజారు లేక ఇక్కట్లు

కలిదిండిలో రైతుబజారు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పడమటిపాలెం, పరసావానిపాలెం, ఎస్సార్పీ ఆగ్రహారం, వెంకటాపురం గ్రామాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులు వాటిని అమ్ముకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది.

ముచ్చు నాగమల్లేశ్వరరావు, కూరగాయల వ్యాపారి

వంతెనపైకి మార్గం లేదు

కోరుకొల్లు వద్ద పెదలంక డ్రెయిన్‌పై నిర్మించిన ఆవకూరు వంతెనకు అప్రోచ్‌ రోడ్డు లేదు. ఎన్నో సంవత్సరాలుగా అవస్థలకు గురవుతున్నాం. శిథిలావస్థకు చేరిన వంతెనపై రాకపోకలతో భయాందోళనకు గురవుతున్నాం. వంతెన నిర్మించి పదేళ్ళు గడిచినా నిరుపయోగంగా మారింది.

– కేశిరెడ్డి బలరాం

పెదలంక డ్రెయిన్‌ అభివృద్ధి చేయాలి

పెదలంక మేజర్‌ డ్రయిన్‌ దిగువన ముంపు నివారణకు దర్శిపూడి యూటి (అండర్‌ టెన్నెల్‌) అభివృద్ధి చేయాలి. ఐదేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయంగా నిడమర్రు వద్ద రూ.40కోట్లతో రెగ్యులేటర్‌ నిర్మాణానికి నాయకులు హామి ఇచ్చి నేటికి దాని పనులు ప్రారంభించలేదు.

– రెడ్డి నాగరాజు, స్తంభంచెరువు

Updated Date - Apr 25 , 2024 | 12:38 AM