AP Politics: ఆ వైసీపీ నేతలపై సీఐడీ విచారణ వేయిస్తాం.. కామినేని శ్రీనివాస్ వార్నింగ్
ABN , Publish Date - Jun 05 , 2024 | 10:06 PM
వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేల భాషకు ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రజలు మంచి బుద్ధి చెప్పారని బీజేపీ తరఫున గెలిచిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. అలాగే తన జీవితంలో కూడా వచ్చిన ఫలితాలు చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని అన్నారు.
ఏలూరు జిల్లా (కైకలూరు): వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేల భాషకు ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రజలు మంచి బుద్ధి చెప్పారని బీజేపీ తరఫున గెలిచిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. అలాగే తన జీవితంలో కూడా వచ్చిన ఫలితాలు చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని అన్నారు. తన విజయం ప్రజలకే అంకితం చేస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా నియోజకవర్గ అభిమానులు, కార్యకర్తలు కామినేనికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
కైకలూరు మండలం వరాహపట్నంలో నేడు(బుధవారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో ఐదేళ్ల క్రితం ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందని అన్నారు. ఆ సంఘటన నుంచి నిన్న(మంగళవారం) ప్రజలు విముక్తి లభించిందని తెలిపారు. ఐదేళ్ల నాడు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే వాళ్ల నిజ స్వరూపం కనిపించిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయాల్లో విలువలు సాంతం పడిపోయాయన్నారు. వైసీపీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి సూక్తులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
చరిత్రలో లేనటువంటి మెజార్టీ కైకలూరు నియోజకవర్గ ప్రజలు తనకు ఇచ్చారని అన్నారు. వైసీపీ నేత దూలం నాగేశ్వరరావు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన చేసిన మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణ వేయిస్తానని హెచ్చరించారు. నియోజకవర్గంలో ముగ్గురు వైసీపీ రౌడీలు ఉన్నారని.. వారిని జిల్లా బహిష్కరణ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చారు. దూలం నాగేశ్వరరావు, ఆయన కుమారుడు చేసిన అరాచకాలు తన దృష్టికి తీసుకొస్తే వారిపై విచారణ చేయించి శిక్షించేలా చేస్తానని కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు.