Share News

ఇటు సార్వా.. అటు దాళ్వా

ABN , Publish Date - Dec 11 , 2024 | 01:07 AM

వరుస వాయుగుండాలు, అల్పపీడనాలతో సాగు పనులకు ఆటం కాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ రైతులు ఇటు సార్వా మాసుళ్లు, అటు దాళ్వా నారుమడుల పనులను ముమ్మరంగా చేస్తున్నారు.

 ఇటు సార్వా.. అటు దాళ్వా

వచ్చే నెల పదిలోపు నాట్లు వేసేలా రైతుల పరుగులు

మరో అల్పపీడనంతో అన్నదాతల్లో గుబులు

భీమవరం రూరల్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):వరుస వాయుగుండాలు, అల్పపీడనాలతో సాగు పనులకు ఆటం కాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ రైతులు ఇటు సార్వా మాసుళ్లు, అటు దాళ్వా నారుమడుల పనులను ముమ్మరంగా చేస్తున్నారు. పది రోజుల క్రితం తుఫాన్‌తో సార్వా మాసూళ్ళు కొన్ని రోజులు నిలిచిపోయాయి. వారం రోజుల్లో 80 వేల ఎకరాలు మాసూళ్లు చేశారు. దీంతో జిల్లాలో లక్షా 95 వేల సార్వా పంటకు లక్షా 35 వేల ఎకరాల పంట మాసూళ్లయ్యింది. ఇంకా 59 వేల ఎకరాలు జరగాలి. వీటిని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేసేలా రైతులు అడుగులు వేస్తున్నారు. మాసుళ్ళు జరుగుతుండగానే వచ్చే దాళ్వాకు నారుమడులు వేయడంపైన రైతులు దృష్టి పెట్టారు. దాళ్వా పంట రెండు లక్షల 25 వేల ఎకరాలకు గాను, పది వేల ఎకరాల వరకు నారుమడులు వేయాలి. ఇప్పటికీ వ్యవసాయ అధికారుల లెక్కలు ప్రకారం 256 ఎకరాల్లో నారుమడులు వేశారు. వారం రోజుల్లో నారుమడులు పూర్తి చేసే ఆలోచనలో రైతులు ఉన్నారు. వచ్చే నెల పదో తేదీలోపు నాట్లు వేయాలని అంచనా వేస్తున్నారు. ఆ విధంగా నారుమడులు పడితేనే దాళ్వా సక్రమంగా సాగి దిగుబడి బాగుంటుందని భావిస్తున్నారు. అల్పపీడన హెచ్చరికలతో ఆందోళన నెలకొంది.

అల్పపీడనంతో అప్రమత్తం : కలెక్టర్‌

ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 11, 12 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పరిస్థితులకు అనుగుణంగా వరి కోతలు, నూడ్పులు చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి రైతులను కోరారు. రైతులకు టార్ఫాలిన్స్‌ లేకపోతే ఆర్‌ఎస్‌కెలకు తెలియజేయాలన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ 4.10 లక్షల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం కాగా, నేటి వరకు 2,51,356 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 38,712 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. వీరికి రూ.578 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.561 కోట్లు రైతులు ఖాతాలలో జమ చేశామన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా జిల్లా యంత్రాంగానికి తెలియజేయవచ్చు అన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 08:51 AM