మద్యం ప్రియుల్లో జోష్
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:01 AM
మద్యం ధరలు తగ్గడంతో అమ్మకాలు పెరిగాయి. వినియోగం అధికమైంది. ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు అక్రమ దిగుమతులు తగ్గిపోయాయి.
తగ్గిన ధరలు.. పెరిగిన అమ్మకాలు
ఆదాయం అంతంతే..
లైసెన్స్‌దారుల్లో అసంతృప్తి
త్వరలోనే అందుబాటులోకి మరిన్ని బ్రాండ్‌లు
భీమవరం/భీమవరం క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మద్యం ధరలు తగ్గడంతో అమ్మకాలు పెరిగాయి. వినియోగం అధికమైంది. ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు అక్రమ దిగుమతులు తగ్గిపోయాయి. నాసిరకం మద్యానికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఇతర రాష్ర్టాలకు మించి నాణ్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో బ్రాండ్‌లను దింపుతోంది. మరోవైపు తక్కువ ధరలకు విక్రయాలు సాగిస్తోంది. గతంలో నాసి రకం మద్యం రూ.140లకు విక్రయించేవారు. ఇప్పుడు నాణ్యమైన మద్యం రూ.99లకు అమ్మకాలు సాగిస్తున్నారు. కింగ్ ఫిషర్ వంటి బీర్‌ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. అయితే ఆదాయపరంగా టర్నోవర్ అంతగా పెరగలేదు. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే నవంబరు నెలలో పెరుగుదల కనిపించింది. గత ఏడాది బ్రాంది, విస్కీ వంటి రకాలు 1.21 లక్షల కేసులు అమ్ముడు పోయాయి. ఈ ఏడాది మాత్రం 1.53 లక్షల కేస్‌లను విక్రయించగలిగారు. అంటే మద్యం అమ్మకాల్లో 23శాతం పెరుగుదల కనిపించింది. అదే బీర్‌ల విషయంలో 73శాతం అధికంగా విక్రయాలు సాగాయి. గత ఏడాది దాదాపు 31వేలు కేస్‌లు అమ్ముడు పోతే ఈ ఏడాది నవంబరులో 53వేల కేసులను విక్రయించ గలిగారు. బీర్ ధరను రూ. 130లకు తగ్గించడంతో అమ్మకాలు పెరిగాయని అంచనా వేస్తున్నారు.
బ్రాండెడ్ రకాల ధరల తగ్గింపు
మ్యాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ రూ.220 నుంచి 190కి ఫుల్ బాటిల్ 870 నుంచి 760కి తగ్గించారు. రాయిల్ చాలెంజ్ గోల్డ్ విస్కి క్వార్టర్ 230 నుంచి 210కి ఫుల్‌బాటిల్ 920 నుంచి 840కి తగ్గింది. యాంటిక్విటి విస్కి ఫుల్ బాటిల్ 1600 నుంచి 1400 తగ్గింది. క్వార్టర్‌కు 50 రూపాయలు తగ్గించారు. ఇంకా కొన్ని రకాల బ్రాండ్లు త్వరలోనే ఆయా కంపెనీలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదాయపరంగా నష్టమే
గత సంవత్సరం నవంబరులో రూ. 109.5కోట్లు విలువైన మద్యాన్ని అమ్మకం సాగించారు. ఈ సారి వినియోగం పెరిగినా సరే టర్నోవర్ మాత్రం రూ. 111.00 కోట్లు మాత్రమే నమోదైంది. దాంతో ప్రభుత్వ ఆదాయం పెద్దగా పెరగలేదు. ఇదిలా ఉంటే లైసెన్స్‌దారులకు కూడా నష్టమే వస్తుందంటూ ఆందోళన చెందుతున్నారు. కేవలం 10శాతం మాత్రమే కమీషన్ వస్తోంది. ప్రభుత్వం 20శాతం కమీషన్ ఇస్తుందని ఆశించారు. కానీ ఇష్యూ ధర అంటే డిస్ట్రలరీల వద్ద అమ్మకం ధరపైనే 20శాతం ఇస్తోంది. దాంతో కమీషన్ పెద్దగా రావడం లేదు. క్వార్టర్ బాటిల్ రూ. 99లకు విక్రయిస్తే రూ. 10లు మాత్రమే మిగులుతోంది. దాంతో లాభసాటి కావడం లేదంటూ లైసెన్స్‌దారులు గగ్గోలు పెడుతున్నారు.
చీకటి దందా ఆగడం లేదు
ప్రభుత్వం బెల్ట్‌షాపులపై కొరడా ఝుళి పిస్తున్నాసరే చీకటిదందా అగడం లేదు. నర్సాపురం నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్వహించిన వారి నుంచి బాటిల్‌కు రూ.10 లు వంతున జనసేన నాయకుల పేరుతో వసూలు చేస్తున్నారు. అంత మొత్తంలో ఇస్తే నే అమ్మ కాలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుం దని స్పష్టం చేస్తున్నారు. మొగల్తూ రు మండలంలో బెల్ట్‌షాపుల నిర్వహణకు వేలంపాట పెట్టారు. ఈ వేలం పాట ద్వారా దక్కించు కున్న బెల్ట్‌షాపు యజమాని లైసెన్స్ దుకా ణానికి వెళితే మద్యం సీసాలు ఇవ్వలేదు. మండలంలోని జనసేన నాయ కుణ్ని సంప్ర దించాలని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే నాయకుణ్ని సంప్రదిస్తే అసలు విషయాన్ని బయట పెట్టారు. మండలంలో బెల్ట్‌షాపు లకు సరఫరా తన ద్వారానే జరుగుతుందని, ఒక్కో బాటిల్‌పై రూ. 20లు అదనంగా విక్ర యించుకుంటే రూ. 10లు తనకు ఇవ్వాలని జనసేన నాయకుడు ఒకరు బెల్ట్‌షాపు నిర్వా హకునికి స్పష్టం చేశారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో అధికారులు మొగల్తూరు మండల ంలో జల్లెడ పట్టారు. బెల్ట్ షాపు నిర్వాహ కులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా నాయకుల దందా సాగుతోంది. ఇప్పటి కే నష్టాలను చవిచూస్తున్నామంటూ గగ్గోలు పెడుతున్న లైసెన్స్‌దారులకు నేతల దందా మరింత తలనొప్పిగా మారింది.