Share News

ఎర్ర చందనం ఎదురీత

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:17 AM

మండలంలో ఎర్ర చందనం సాగు చేప ట్టిన పలువురు రైతులు పెట్టుబడి భారంతో ఎదురీదుతున్నారు.

ఎర్ర చందనం ఎదురీత
అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఎర్ర చందనం దుంగలు

కొనేవారు లేరు .. దళారుల బెదిరింపులు

టి.నరసాపురం, సెప్టెంబరు 19: మండలంలో ఎర్ర చందనం సాగు చేప ట్టిన పలువురు రైతులు పెట్టుబడి భారంతో ఎదురీదుతున్నారు. ఎర్ర చందనం విక్రయానికి ప్రభుత్వం సహకరించి రైతులకు న్యాయం చేయాలని మక్కినవారిగూడెం, కృష్ణాపురం, గంగినీడుపాలెం గ్రామాల రైతులు కోరుతు న్నారు. ఎర్ర చందనం సాగుతో లాభాలు వస్తాయనే ఆశతో మండలంలో సుమారు 10 మంది రైతులు 25 ఏళ్ల క్రితం సాగు చేపట్టారు. సుమారు వెయ్యికి పైగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న చెట్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది దళారులు చెట్టను చూసి వెళుతున్నారని, కొందరు అతి తక్కువ ధరకు బేరమాడుతున్నారని వాపోయారు. మరికొం దరు తమకు విక్రయించాల్సిందేనని, తమను కాదని ఎలా అమ్ముతారో చూస్తామంటూ బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్ర చందనం చెట్లు అమ్మకాలు జరిగితే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామని భావించామని, ప్రస్తుతం పెట్టుబడి భారం కూడా మోయాల్సి వస్తోంద న్నారు. ప్రభుత్వం స్పందించి మండలంలో ఎర్ర చందనం సాగుచేసిన రైతుల వద్ద చెట్లు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు సిరిమళ్ళ సూర్యప్రకాష్‌, ముళ్ళపూడి రఘురాం, సిరిమళ్ళ వెంకట సత్యనారాయణ తదితరులు కోరుతున్నారు.

ఐదు ఎకరాల్లో సాగు చేశాను : సిరిమల సూర్యప్రకాశరావు

రెండు రాష్ర్టాల్లో మొట్టమొదటగా ఎర్రచందనం సాగు చేసిన రైతుని నేను. నా వద్దనే మొక్కలు కొనుగోలు చేసి పలుచోట్ల సాగు చేస్తున్నారు. 41 సంవత్సరాల క్రితం ఐదు ఎకరాల భూమిలో సుమారు 500 మొక్కలను నాటాను. ప్రస్తుతం 100 మొక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పలు కారణాలతో మొక్కలు చనిపోవడం వల్ల తీవ్ర నష్టాలు చవి చూశాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఎర్రచందనం రైతులను ఆదుకోవాలి.

లాభదాయకమని భావించాం : ముళ్ళపూడి రఘురాం

ఎర్రచందనం సాగు రైతులకు లాభదాయకమని భావించి సాగుచేశాం. ప్రస్తుతం ఎర్రచందనం చెట్లు రైతుకు భారంగా కనిపిస్తున్నాయి. పలువురు ఎర్రచందనం కొనుగోలు దారులుగా పరిచయం చేసుకున్ని చూసి వెళ్లడం తప్ప కొనుగోలు చేయడం లేదు. కోతకు సిద్ధంగా ఉన్న చెట్లు మార్కెటింగ్‌ చేసే మార్గం లేకుండాపోయింది. ప్రభుత్వం ఎర్రచందనం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.

Updated Date - Sep 20 , 2024 | 12:17 AM