త్రిశంకు స్వర్గంలో విలీన గ్రామాలు
ABN , Publish Date - Jun 24 , 2024 | 12:06 AM
పట్టణాల్లో విలీనం చేస్తున్నా మంటూ గత ప్రభుత్వం జిల్లాలో 22 గ్రామాలను నాలుగేళ్లుగా త్రిశంకు స్వర్గంలో నెట్టింది.
ఆర్థిక సంఘ నిధులు నిల్..
ఉపాధి పనులకు గండి
కోర్టులను ఆశ్రయించిన గ్రామస్థులు
తాడేపల్లిగూడెం రూరల్, జూన్ 23 : పట్టణాల్లో విలీనం చేస్తున్నా మంటూ గత ప్రభుత్వం జిల్లాలో 22 గ్రామాలను నాలుగేళ్లుగా త్రిశంకు స్వర్గంలో నెట్టింది. ఒక పక్క పట్టణాల్లో కలవలేక.. గ్రామాల్లో ఇమడ లేక రెంటికీ చెడ్డ రేవడిలా ఆ గ్రామాలు కొట్టుమిట్టాడుతునాయి. ఫలితంగా ఇటు పారిశుఽధ్యం నుంచి మంచినీటి సరఫరా వరకూ అన్నింటా వివక్షగానే మిగిలి పోతున్నాయి. ఈ గ్రామాల్లో ఇప్పటికీ ఎన్నికలు జరగకుండా ప్రత్యేక అధికారుల పాలనలో ఉండడంతో పాటు నిధులు రాకపోవడంతో కేవలం పన్నులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఆర్థిక సంఘం నిధులు సున్నా
విలీన ప్రతిపాదన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ జరగని దృష్ట్యా ఆ గ్రామాలకు జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘ నిధులకు గండి పడింది. దీంతో ఆయా గ్రామాల్లో నిధులు లేక అభివృద్ధి కుంటుపడింది. సిబ్బందికి జీతాలు అందించడానికి నానా పాట్లు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. జిల్లాలోని 22 గ్రామ పంచాయ తీల్లో 85 వేల మంది జనాభా ఉండగా ఆయా గ్రామాల్లో మైనర్ పంచాయతీకి ఏడాదికి రూ.10 లక్షల వరకు, మేజర్ పంచాయతీలకు 20 లక్షల వరకూ ఆర్థిక సంఘ నిధులు విడుదలయ్యేవి. ఆ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుకుని, పన్నుల రూపంలో వచ్చిన నిఽధులు మంచినీరు, పారిశుధ్య నిర్వహణ, తదితర అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉండేది. కానీ అభివృద్ధి పనుల మాటేమో కానీ సాధారణ పనులు కూడా చేయలేని దుస్థితిలో ఆ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి.
ఉపాధి పనులు నిల్..
పట్టణాల్లో విలిన ప్రతిపాదన తీసుకురావడంతోనే ఆ గ్రామాల్లో కూలీలు ఉపాధి కోల్పొయారు. దీంతో ఆయా గ్రామాల్లో కూలీలు ఉపాధి లేక తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ గ్రామాన్ని పట్టణంలో కలిపితే తమకు ఒరిగేదేమీ లేదని తమకు ఏళ్ల తరబడి ఉపాధికి ఊతం ఇచ్చిన పథకం తమకు లేకుండా పోయిందని కూలీలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు గతేడాది తూతూ మంతంగ్రా ఉపాధి పని కల్పించే ప్రయత్నం చేసినా అది అంతంత మాత్రమే.
కోర్టులో కేసులు..
గ్రామాలను పట్టణాల్లో విలీనం చేసే ప్రక్రియ తమ ఇష్టంతో జరగలేదని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సమయంలో తీర్మాణాలు తీసుకున్నారని ఈ ప్రక్రియకు కనీసం గ్రామసభ కూడా నిర్వహించలేదని ఆయా గ్రామాల వారు కోర్టును ఆశ్రయించారు. నరసాపురం పట్టణంలో సరిపల్లె, రుస్తుంబాద, లక్ష్మణేశ్వరం, భీమవరం సమీపంలోని రాయలం, చిన అమిరం, తాడేరు, కొవ్వాడ అన్నవరం, పాలకొల్లు సమీపంలోని పూలపల్లి, భగ్గేశ్వరం, ఉల్లంపర్రు, వరిధనం, ఆగర్తిపాలెం, తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు, పడాల, కుంచనపల్లి, కొండ్రుప్రోలు, ఎల్.అగ్రహారం, తణుకు సమీపంలోని పైడిపర్రు, వెంకటాపురానికి చెందిన గ్రామ పంచాయతీల ప్రజలు కోర్టును ఆశ్రయించారు. వారితో పాటు తమకు ఉపాధి లేకుండా పోతున్నదని ఉపాధి కూలీలు, గ్రామాల్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని జీవిస్తుంటే పట్టణాలుగా మారిస్తే తమకు ట్యాక్స్‌లు పెరిగిపోతాయని ఆయా గ్రామాల్లోని ఫ్యాక్టరీల యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగేళ్లుగా ఈ వ్యవహారం కోర్టులోనే నానుతోంది. ఫలితంగా ఆయా గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఎన్నికలు లేక ప్రత్యేక అధికారుల చేతుల్లోనే పాలన సాగుతోంది.
ప్రత్యేక అధికారుల కోసం ఎదురుచూపులు
గ్రామాల్లో ఏ చిన్న అవసరం వచ్చినా గ్రామంలోని వార్డు సభ్యులను కానీ, సర్పంచ్‌లను కాని సంప్రదిస్తే ప్రజల సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏళ్ల తరబడి ప్రత్యేక అధికారుల పాలనలో సాగడం వల్ల ప్రజల సమస్యలు చెప్పడానికి ప్రత్యేక అధికారుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రత్యేక ఽఅధికారి అంటే మండల స్థాయి అధికారులకే ఈ అధికారాలు ఉండటంతో వారు మండలస్థాయి పనులు చూసుకుంటారా లేక గ్రామాల సమస్యలపై దృష్టి పెడతారా అని ప్రజలు వాపోతు న్నారు. దానికి తోడు ఈ అధికారుల పాలనలో గ్రామాల్లో నిధుల దుర్వినియోగంపై కూడా చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాలికి కొట్టుకుపోయిన కోట్లు
జిల్లాలో విలీన ప్రతిపాదిత గ్రామాలుగా ఉన్న 22 గ్రామ పంచాయితీలలో 85 వేల మంది జనాభా ఉంటున్నారు. ఆర్థిక సంఘ లెక్కల ప్రకారం ఏడాదికి రెండు విడతలుగా ఒక్కో మనిషికి రూ.222 చొప్పుల కేటాయిస్తారు. మూడేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీల పాలన సాగుతుండగా మొత్తంగా రూ.5 కోట్ల 60 లక్షలు గాలికి కొట్టుకుపోయాయి. వీటికి తోడు పంచాయతీలకు రావాల్సిన అదనపు నిధులు నిర్వీర్యం అయిపోయాయి.