Share News

4 నుంచి ఎంఎస్‌ఎంఈ సర్వే

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:03 AM

జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సర్వే (ఎంఎస్‌ఎం ఈ) ప్రారంభం కానుంది.

 4 నుంచి ఎంఎస్‌ఎంఈ సర్వే

ఫిబ్రవరి 1వ తేదీలోగా పూర్తి చెయ్యాలి

కమిషనర్లు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాలి

సచివాలయ ఉద్యోగులతో సర్వే

భీమవరం టౌన్‌, డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సర్వే (ఎంఎస్‌ఎం ఈ) ప్రారంభం కానుంది. ఈనెల 4వ తేదీ నుం చి జిల్లా పరిశ్రమలశాఖ ఆఽధ్వర్యంలో జరిగే ఈ సర్వేలో వ్యాపారాలకు సంబంధించి ప్రతి షాపు, పరిశ్రమల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేస్తారు. ప్రత్యేక యాప్‌లో సర్వే వివరాలను నమోదు చేస్తారు. మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో కమిషనర్ల పర్యవేక్షణలో సర్వే చే స్తారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలకు, కమిషనర్లకు అవగాహన కల్పించారు. 3వ తేదీన సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి 4వ తేదీ నుంచి సర్వే ప్రారంభిస్తారు.

ఎనిమిది అంశాల్లో సర్వే

ఎనిమిది అంశాలపై సర్వే చేస్తారు సంబంధిత వ్యాపార యజమానులు అందించే వివరాలను యాప్‌ ద్వారా నమోదు చేస్తారు. వ్యాపార యజమాని ఎవరు? ఎంత పెట్టుబడితో పెట్టారు? వ్యాపారం ఎలా ఉంది? సిబ్బంది కొరత ఏమైనా ఉందా? కొత్త సాంకేతికత వినియోగిస్తున్నారా? సిబ్బందికి శిక్షణ అవసరమా? బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సరుకు ఎవరికి ఎగుమతి చేస్తారు? ట్రేడింగ్‌లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర అంశాలపై సర్వే చేస్తారు. ఈ సర్వే ఆధారంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ద్వారా ఎటువంటి సహాయం కోరుతున్నారో గుర్తించి వాటిని అందించి వ్యాపారాభివృద్ధికి సహకరించే విధంగా ఈ సర్వే ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.

వచ్చేనెల 1కి సర్వే పూర్తి చెయ్యాలి

వ్యాపార, పరిశ్రమలకు సంబంధించి 90 వేల విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. దీని కంటే రెట్టింపు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అందువల్ల సచివాలయ ఉద్యోగులు అందరూ ఈ సర్వేలో పాల్గొంటారని, ప్రతిషాపు నుంచి, ఫ్యాక్టరీ నుంచి వివరాలను సేకరించి ఫిబ్రవరి 1వ తేదీలోగా సర్వే చెయ్యవలసి ఉంటుంది. ఈ సర్వేను అధికారులు పరిశీలించాల్సి ఉంది.

సర్వేకు సహకరించాలి: కలెక్టర్‌

జిల్లాలో వ్యాపార వినియోగ విద్యుత్‌ కనెక్షన్లు ఆధారంగా జరిగే ఎంఎస్‌ఎంఈ సర్వేను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వేకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. జిల్లాలో 90 వేలకు పైగా సూక్ష్మ చిన్న తరహా ఎంటర్‌ప్రైజెస్‌ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని అన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:03 AM