Share News

29 తిరస్కారం

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:48 PM

నరసాపురం పార్లమెంటరీ నియో జకవర్గ నామినేషన్ల పరిశీలనలో ఆరింటిని తిరస్కరించినట్లు ఆర్వో, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

29 తిరస్కారం

ఎంపీకి 6, ఎమ్మెల్యే 23 నామినేషన్లు

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 26 : నరసాపురం పార్లమెంటరీ నియో జకవర్గ నామినేషన్ల పరిశీలనలో ఆరింటిని తిరస్కరించినట్లు ఆర్వో, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సాధారణ పరిశీలకురాలు ఎం.దీప సమక్షంలో వీటిని పరిశీలించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు 27 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 21 మంది అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. మిగతా ఆరుగురు అభ్యర్థుల నామినేషన్‌ల్లో ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థులకు మద్దతుదారులుగా వేయడం, ఇద్దరు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి పది మంది ప్రతిపాదికుల మద్దతు సంతకాలు లేకపోవడం, ఒక అభ్యర్థి ఫామ్‌ ఏ, బీ అఫిడవిట్లు సమర్పించకపోవడంతో వాటిని తిరస్కరించినట్లు తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 23 మంది నామినేషన్లు తిరస్కరించారు. 99 మంది అభ్యర్థులవి సక్రమంగా ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా..

భీమవరంలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిం చినట్లు రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులరాజు తెలిపారు. వీటిలో గ్రంధి సత్యరవితేజ, దాసరి కిరణ్‌వర్ధన విజయ్‌ ప్రకాశరావుల నామినేషన్లు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించారు. మిగిలిన 17 మంది నామినేషన్‌లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించారు. పాలకొల్లులో మూడు నామినేషన్లు తిరస్కరించినట్లు ఆర్వో బి.శివనారాయణరెడ్డి తెలిపారు. వీటిలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ముగ్గురు డమ్మీ అభ్యర్థులవి వున్నాయి. మిగిలిన 16 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. నరసాపురంలో ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు ఆర్వో అంబరీష్‌ తెలిపారు. వీటిలో సరైన పత్రాలు సమర్పించని శారదావాణి, లోకం శ్రీనివాసరావుల నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 14 మంది 25 సెట్ల నామినేషన్లు వేశారు. వాటిలో ఇద్దరి నామినేషన్లను తిరస్క రించడంతో ఇంకా 12 మంది మిగిలారు. ఆచంటలో ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు ఆర్వో వి.స్వామి నాయుడు తెలిపారు. సరైన పత్రాలు సమర్పించని కారణంగా పితాని వెంకట్‌, చెరుకువాడ వెంకట నరసింహరాజుల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 11 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. తాడేపల్లిగూడెంలో నిబంధనలకు విరుద్ధంగా వున్న ఏడుగురి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు ఆర్వో కె.చెన్నయ్య తెలిపారు. మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీరిలో 13 మందివి సక్రమంగా వున్నాయి. తణుకులో సరిగా పూరించని, పత్రాలు సమర్పించని ముగ్గురి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు ఆర్వో బీవీ రమణ తెలిపారు. వీరిలో కారుమూరి లక్ష్మీకిరణ్‌, ఆరిమిల్లి కృష్ణతులసి, దిర్శిపో రామకృష్ణ ఉన్నారు. మొత్తం 16 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 13 మంది నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయి. ఉండిలో నాలుగు నామినేషన్లను తిరస్కరించినట్లు ఆర్వో సీఏ ఆదిత్య ప్రవీణ్‌ తెలిపారు. వీటిలో గుండె నగేష్‌, కనుమూరు భరత్‌, పెనుమత్స గోపాలకృష్ణంరాజు, వేగేశ్న వెంకటరామరాజుల నామినేషన్లు ఉన్నాయి. మొత్తం 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 17 మందివి ఆమోదించినట్లు తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 11:48 PM