Share News

ఓఎల్‌ఎక్స్‌లో కారు బేరం..

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:39 AM

తాడేపల్లిగూడెంలో ఓఎల్‌ఎక్స్‌లో కారు బేరం పెట్టి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ అమ్మేసిన కారును అమ్మకానికి పెట్టి మరొకరికి విక్రయించి రూ.3 లక్షలు మోగించాడో ప్రబుద్దుడు.

ఓఎల్‌ఎక్స్‌లో కారు బేరం..

అమ్మేసిన కారునే విక్రయించి రూ.3 లక్షలకు టోకరా

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 26: తాడేపల్లిగూడెంలో ఓఎల్‌ఎక్స్‌లో కారు బేరం పెట్టి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ అమ్మేసిన కారును అమ్మకానికి పెట్టి మరొకరికి విక్రయించి రూ.3 లక్షలు మోగించాడో ప్రబుద్దుడు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడేనికి చెందిన వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో ఓ కారును అమ్మకానికి పెట్టాడు. మండపేటకు చెందినవారు తాడేపల్లిగూడెం వచ్చి కారు చూసుకున్నారు. రెండు రోజుల్లో వస్తామని చెప్పి కొనుగోలు చేసేందుకు డబ్బుతో వచ్చారు. కారు స్నేహితుడు తీసుకెళ్లాడని గంటలో వస్తుందని చెప్పి కారు బేరం పెట్టాడు. రూ.4 లక్షలకు మాట్లాడుకున్న మండపేట వాసి దానికి సంబంధించి అడ్వాన్స్‌ ఇద్దామని అనుకున్నాడు. కారు వచ్చేస్తుంది.. డబ్బులు ఇచ్చేయండని పట్టుబట్టడంతో రూ.3 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించారు. మిగిలిన లక్ష రూపాయలు కారు కాగితాల బదిలీ సమయంలో ఇస్తామని చెప్పారు. ఎంత సేపటికీ కారు రాలేదు. కారు విజయవాడ తీసుకెళ్లారని రేపు ఉదయమే వచ్చి తీసుకెళ్లండని నమ్మించి పంపించాడు. మరుసటి రోజు కూడా అలాగే కారు రావకపోవడంపై స్టోరీ చెప్తుండటంతో అనుమానం వచ్చిన మండపేట వాసి కారు ఎవరి పేరున ఉందో చెక్‌ చేయగా నర్సీపట్నం పేరు మీద తాను కొనుగోలు చేద్దామనుకున్న రోజుకంటే ముందే విక్రయించినట్టు తెలిసి మోస పోయినట్టు గుర్తించాడు. వెంటనే తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించగా అక్కడ ఇరువురినీ పిలిపించి డబ్బులు ఇచ్చేందుకు అంగీకార పత్రం రాయించి పంపించేశారు. డబ్బులు ఇస్తానన్న గడువు దాటినా ఇవ్వకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 07:21 AM