పంచాయతీ పన్నుల చెల్లింపు ఇకపై ఆన్‌లైన్‌లో..
ABN , Publish Date - Dec 05 , 2024 | 12:28 AM
గ్రామ పంచాయతీ ల్లోను ఆన్‌లైన్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ మేరకు ‘స్వర్ణ పంచా యతీ పోర్టల్’లో గృహాల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 393 గ్రామ పంచాయతీలకు గాను మూడు లక్షల తొమ్మిది వేల542 గృహాలు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ ల్లోను ఆన్‌లైన్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ మేరకు ‘స్వర్ణ పంచా యతీ పోర్టల్’లో గృహాల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 393 గ్రామ పంచాయతీలకు గాను మూడు లక్షల తొమ్మిది వేల542 గృహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు లక్షల 91 వేల గృహాల వివరాలను అప్‌లోడ్ చేశారు. మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయనున్నారు.
స్వర్ణ పంచాయతీ పోర్టర్‌లో గృహాల వివరాలు నమోదు
గ్రామాల్లో వేలం సొమ్ములు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి
భీమవరం రూరల్, డిసెంబరు 4(ఆంధ్ర జ్యోతి):ఆన్‌లైన్ పన్ను విధానంలోకి తీసుకురా వడం ద్వారా నగదు రహిత లావాదేవీలతోపాటు ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దీనిని ఎంచుకుంది. వివరాల నమోదు ఆన్‌లైన్ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇప్పటి వరకు 90 శాతం పూర్తయ్యింది. మిగిలిన పది శాతం నమోదు తొందరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా పన్నుల చెల్లింపుపై అవగాహన కల్పించేలా పోస్టర్లలను పంచాయతీల వద్ద ఏర్పాటు చేయనున్నారు.
మునిసిపాల్టీల్లోనే..
ఆన్‌లైన్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపుల విధానం మునిసిపాల్టీల్లోనే అమలవుతోంది. ఈ విధానం ద్వారా యజమానులు ఇతర ప్రాంతాల్లో ఉన్నా పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీల్లోను అమలులోకి తీసుకురావడం వల్ల ఇంటి యజమానులు ఎక్కడ ఉన్నా పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎంత పన్ను ఉంది ? ఏడాదికి ఎంత చెల్లించాలి ? అనేది ఆన్‌లైన్‌లో పొందుపరచడంతో యజమానికి తెలుసుకోవటానికి వీలు ఉంటుంది. ఇటీవలే విద్యుత్ శాఖ యాప్ ద్వారా బిల్లులు స్వీకరిస్తోంది. ఇది వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా వుంది.
పంచాయతీల్లో పన్ను చెల్లింపుల్లో చాలా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పలు పంచాయతీల్లో లక్షలాది రూపాయలు గోల్‌మాల్ అయ్యాయి. అధికారులు విచారణ చేసి సంబంధిత వ్యక్తుల నుంచి సొమ్మును రాబట్టాల్సి వస్తోంది. గ్రామాల్లో పన్ను చెల్లింపులు గతంలో చేసేటప్పుడు రశీదు ఇచ్చి పన్ను వసూలు చేసేవారు. అప్పట్లో కొందరు పంచాయతీ దిగువ సిబ్బంది తప్పుడు బిల్లులు ఇచ్చేవారు. దీనివల్ల యజమానులు పన్నులు చెల్లించినా జమ అయ్యేది కాదు. తదుపరి పన్ను చెల్లింపులో ఎక్కువ మొత్తం వసూలు చేసేవారు. ఇప్పుడు ఎంత కట్టారు ? ఎంత కట్టాలి ? అనేది యజమానులకు మెసేజ్ ద్వారా ఆన్‌లైన్‌లో వస్తుంది. ఈ విధానం వల్ల అవకతవకలకు ఆస్కారం ఉండదు. నేరుగా ప్రభుత్వానికి జమ కావటం వల్ల పంచాయతీల్లో ఎంత నిధులు ఉన్నాయనే సమచారం తెలుసుకోవడంతోపాటు అభివృద్ధి పనులకు నిధులు వినియోగించుకునే మార్గం సులభతరం అవుతుంది. గ్రామాల్లో పంచాయతీల చెరువులు, కొబ్బరి చెట్లు, పచ్చ గడ్డి పాటల సొమ్మును పాటదారులు ఇక ఆన్‌లైన్ ద్వారానే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.
వివరాలు భద్రం
దశాబ్ధాల కాలం నుంచి పంచాయతీలకు సంబంధించిన ఇంటి పన్ను వివరాలన్నీ పుస్తకాల్లోనే నిక్షిప్తమయ్యేవి. పంచాయతీల్లో కంప్యూటర్లు విధానం అందుబాటులోకి వచ్చి ఏళ్లు గడిచి ఆ వివరాలు ఆన్‌లైన్ కాలేదు. ఇప్పుడు కొత్త విధానంతో వివరాలను ఆన్‌లైన్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో రికార్డులతో సంబంధం లేకుండా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.