Share News

ఆపరేషన్‌ సిద్ధ

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:48 AM

వారిద్దరూ అక్కా చెల్లెళ్లు. అక్క కష్టంలో అండగా ఉండాల్సిన చెల్లెలు తల్లిదండ్రుల ద్వారా ఆమెకు సంక్రమించే ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నింది. ఇందుకు భర్త నేర స్వభావం కలిసి వచ్చింది. అక్కను శవాలతో భయపెట్టి.. ఆస్తిని లాక్కునే కుట్రను పన్నింది.

ఆపరేషన్‌ సిద్ధ
కేసును ఛేదించిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ నయీం అస్మి

వారిద్దరూ అక్కా చెల్లెళ్లు. అక్క కష్టంలో అండగా ఉండాల్సిన చెల్లెలు తల్లిదండ్రుల ద్వారా ఆమెకు సంక్రమించే ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నింది. ఇందుకు భర్త నేర స్వభావం కలిసి వచ్చింది. అక్కను శవాలతో భయపెట్టి.. ఆస్తిని లాక్కునే కుట్రను పన్నింది. ఇందుకు అన్నెం పున్నెం ఎరుగని ఓ వ్యక్తి బలయ్యాడు. వారం పాటు అటు పోలీసులకు, ఇటు ఆయా గ్రామాల ప్రజలకు ముచ్చెమటలు పట్టించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘పార్శిల్‌లో మృతదేహం డోర్‌ డెలివరీ’ కేసు క్రైం సినిమాను తలపించింది. నిందితుల అరెస్ట్‌తో కేసు సుఖాంతమైంది.

‘మృతదేహం డోర్‌ డెలివరీ’ కేసులో నిందితుల అరెస్ట్‌

క్రైం సినిమాను తలపించేలా సన్నివేశాలు

రోజుకో ట్విస్టుతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌

అక్క ఆస్తి కోసం శవంతో బెదిరించాలని చెల్లెలు, భర్త, ప్రియురాలు కలిసి కుట్రలు

అమాయకుడు పర్లయ్య హత్య.. రెండు రోజులపాటు మృతదేహంతో కారులోనే

తొమ్మిది రోజులపాటు గాలింపు.. ఎట్టకేలకు ముగ్గురూ కటకటాల వెనక్కు

భీమవరం క్రైం/ఉండి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి):

పచ్చని పాడి పంటలతో, ఎంతో ప్రశాంతంగా ఉండే జిల్లా పశ్చిమ గోదావరి. ఇలాంటి జిల్లాలోని ఉండి మండలం యండగండిలో ఈ నెల 19న ముదునూరి రంగరాజు నివాసానికి చెక్క పెట్టెలో మృతదేహాన్ని పెట్టి డోర్‌ డెలివరీ చేయడం సంచలనం సృష్టించింది. నేర చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావచ్చు ! ఈ కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుబోయే, నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. 40ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని పోలీసులే చెప్పడం విశేషం.

అక్కా చెల్లెళ్లకు చెరో అర ఎకరం పొలాన్ని తల్లి దండ్రులు రంగరాజు, హైమావతి పంచి ఇచ్చారు. అయినప్పటికి పెద్ద కుమార్తె సాగి తులసికి వచ్చే ఆస్తిని కొట్టేయాలని పన్నాగం పన్నిన ఆమె చెల్లెలు రేవతి, భర్త శ్రీధర్‌వర్మ సహాయం తీసుకుంది. అతను తన ప్రియురాలు సుష్మతో కలిశాడు. ఈ ముగ్గురూ కలిసి శవంతో తులసి భయపెట్టి ఆస్తిని రాయించు కోవాలని అనుకున్నారు. ఇందుకు ఒక అమాయకుడిని కూలీ పని పనికి తీసుకుని వెళ్ళి హత్యచేశారు. రెండు రోజులపాటు ఆ మృతదేహాన్ని తమ పక్కనే ఉంచుకోవడం చూస్తుంటే వారు ఎంత కరుడుగట్టిన నేరస్తులో అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రిమినల్‌ మైండ్‌తో శ్రీధర్‌వర్మ చేసిన అఘాయిత్యాన్ని పోలీసులు చాకచక్యంగా తెలుసుకుని ‘ఆపరేషన్‌ సిద్ధ’ పేరిట ఐదు రోజులపాటు విస్తృత తనిఖీలు చేసి చివరకు మచిలీపట్నం వద్ద అతన్ని అరెస్ట్‌ చేశారు. శ్రీధర్‌వర్మ, రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మలను పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి తామే నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. తమ చుట్టూ ఇలాంటి నేరగాళ్లతో కలిసి ఉన్నామా ? అని కాళ్ల, ఉండి, భీమవరం తదితర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ‘మొన్నే వారితో మాట్లాడాను. వారితో కలిసి టిఫిన్‌ చేశాను. ఏదో సాయం అడిగితే చేశాను. నేను రోజూ చూస్తుంటాను. మా కళ్ల ముందే ఇలా వెళుతుంటారు’ అంటూ వారితో పరిచయం వున్నవారు వాటిని గుర్తు చేసుకుని స్థాని కులు హడలిపోతున్నారు. ‘శవాలతో భయపెట్టి ఆస్తి రాయిం చుకోవాలని, ఇందుకోసం ఓ మనిషినే మట్టుబెట్టడం’ అనే ఆలోచన వారికి ఎలా వచ్చిందో అంతుబట్టడం లేని వారు చెబుతున్నారు. అయితే శ్రీధర్‌వర్మపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. అయితే అతని అకౌంట్‌లో పదిహేను రూపాయలు మాత్రమే ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రియురాలు సుష్మ పదేళ్ల కుమార్తె పాత్ర పెద్దగా లేదని పోలీసులు నిర్ధారిస్తున్నారు. వీరి అరెస్ట్‌తో యండగండి వాసులు ఒక్కసారిగా హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకు న్నారు. అక్క ఆస్తి కోసం కుట్ర పన్ని ఓ అమాయకుడిని బలి తీసుకున్న ముగ్గురు వ్యక్తులకు కఠిన శిక్షలు విధించాలని.. ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ముగ్గురు నిందితులపై 252/2024 అండర్‌ సెక్షన్‌ 194 బిఎన్‌ఎస్‌ఎస్‌ ఆల్టర్‌ 2, 103, 61 (2), ఆర్‌/డబ్ల్యు 3 (5), బిఎన్‌ఎస్‌ కింద ఉండి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నయీం అద్నాన్‌ అస్మి విలేకరులకు ఈ కేసు వివరాలను తెలిపారు. అనంత రం నిందితులు శ్రీధర్‌వర్మ, ఆయన భార్య రేవతి, సుష్మలను ఉండి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనం తరం అరెస్ట్‌ చూపించి భీమవరం కోర్టుకు తరలించ డంతో 14 రోజులపాటు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ నజీరుల్లా తెలిపారు. తొమ్మిది రోజులపాటు ఎస్పీ నయీం, ఏఎస్పీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, సీఐ జగదీశ్వరరావు, నాలుగు మండలాల ఎస్‌ఐలు కలిసి బృందాలుగా ఏర్పడి కేసులోని చిక్కుముడి ఛేదించినట్లు తెలిపారు.

‘అక్కా.. బావ అప్పులపాలై ఇల్లు వది పారిపోవడానికి, అప్పులు వాళ్లు వచ్చి నిన్ను డబ్బుల కోసం వేధించడానికి కారణం మీకు ఎవరో చేతబడి చేశారట. అప్పులవాళ్లు ఇకపై శవాలను కూడా పంపిస్తారట.. మాకు తెలిసిన సిద్ధాంతి ఒకరు చెప్పారు’ అంటూ అక్క తులసితో.. చెల్లెలు రేవతి అన్నమాటలివి..

అక్కకు శవాన్ని పంపించి భయపెట్టాలని రేవతి, శ్రీధర్‌వర్మ భావించారు. ఈ క్రమంలో రేవతి కోడ్‌ భాషలో ‘వర్మా.. చేప దొరికిందా’ అంటూ అడిగేది. చేప అంటే శవం అని అర్థం. ముందుగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు ప్లాన్‌ చేశారు. అది బెడిసికొట్టడంతో పర్లయ్యను బలి తీసుకున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:53 AM